What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 7 April 2014

శ్రీరామ కర్ణామృతం

శ్రీరామ కర్ణామృతం

మన పురాణాల్లో ఇతిహాసాల్లో ముప్ఫయిమూడు కోట్ల దేవతల ప్రస్తావన ఉన్నా, హిందువులకు అత్యంత అభిమాన పాత్రమైన ఆరాధ్యదైవం మాత్రం శ్రీరాముడు. ఇది వేలాది సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయం. ఆసేతు హిమాచలం కనిపించే సంప్రదాయం.

అయితే ఒక ముఖ్యమైన విశేషమేమంటే, ఇన్ని వేల సంవత్సరాలుగా హిందువులు శ్రీరాముడిని కొలుస్తూ వస్తున్నది ఆయన తమ ఐహికమైన కోరికలన్నీ తీర్చగల కామధేనువని కాదు. ఆయన ధర్మాచరణ తత్పరత ఆయనను ఈ దేశానికి ఒక ఆదర్శమూర్తినిగా నిలిపింది. రాముడిని ఈ దేశవాసులు అభిమానించి, ఆరాధించేది ఆయనే మూర్తీభవించిన ధర్మం (రామో విగ్రహవాన్‌ ధర్మః) కనుక.

సీతా, లక్ష్మణుడూ, హనుమంతుడూ, గురుడూ, శబరీ లాంటి భక్తులు రాముడిని భగవంతుడిగా భావించిన కారణం, ఆయన వాళ్ళకు చేసిన ఉపకారాలో, ఇచ్చిన ఐశ్వర్యాలో కాదు. ఆయన నిరంతరధర్మాచరణ. ఈ దేశంలో ప్రతి కుగ్రామంలోనూ ఒక రామాలయం ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రూపంలో రామకథ వర్ణించే గ్రంథం ఉంటుంది. ప్రతి హైందవ కుటుంబంలోనూ, ప్రతిరోజూ ఒక్కసారయినా రామనామస్మరణ జరగక పోదు.

శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రమేయమ్‌
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజాను బాహుమరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి

వంటి శ్లోకాలు, ఈనాటికీ హిందువులలో చాలా మందికి కంఠస్థం. శ్రీరాముడిని స్మరించుకొన్నప్పుడల్లా ఈ శ్లోకం చదువుకుంటూ ఉంటారు చాలామంది.

ఈ శ్లోకం "శ్రీ రామకర్ణామృతం" అనే గ్రంథంలోనిది. రామభక్తులకు శ్రీరామకర్ణామృతం, కృష్ణ భక్తులకు శ్రీకృష్ణ కర్ణామృతం, నిజంగా అమృతప్రాయమైన స్తోత్ర శ్లోకాలను అందిస్తాయి. అయితే, ఒకతేడా ఏమిటంటే శ్రీకృష్ణ కర్ణామృతాన్ని లీలాశుకుడు వ్రాశాడనీ, ఈయన పదకొండవ శతాబ్దం వాడనీ, ఈయనకు బిల్వామంగళుడనే పేరుండేదనీ, చింతామణి అనే వైశ్యా స్త్రీ ప్రబోధం వల్ల, ఆయన తన ప్రవర్తనను మార్చుకుని శ్రీకృష్ణ భక్తుడయ్యాడనీ జనస్రుతిగా తెలుస్తోంది.

శ్రీరామ కర్ణామృతం ఏనాటి గ్రంథమో, ఎవరు రచించిచారో తెలియటం లేదు. దీన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులవారే రచించారని ఒక అభిప్రాయం ఉన్నా, అది ప్రబలంగా లేదు.

కర్త ఎవరో? కాలం ఏదో! తెలియక పోయినా, ఈ స్తోత్రగ్రంథంలో భక్తిరసం చిప్పిల్లే శ్లోకరత్నాలు జనబాహుళ్యంలో ఎంతో ప్రచారం సంపాదించుకున్నాయి.

మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే|
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ||

అనే అతి ప్రసిద్ధమైన మంగళశ్లోకం, ఈ గ్రంథంలోనేదే. ప్రస్తుతం లభ్యమవుతున్న శ్రీరామకర్ణామృతంలో నాలుగు ఆశ్వాసాలున్నాయి. సుమారు 440 శ్లోకాలున్నాయి. అన్నీ శ్రీరాముడినీ, ఆయన గుణగణాలనూ, రామనామ మహిమనూ, స్మరించేవి. ఇది కథాకావ్యం కాదు. దీనిని చదువుతున్నప్పుడు భక్తి పరవశులమవుతాము.

'జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగా యితాః' అన్న శ్లోకం ఓ ఉదాహరణ. ఈ శ్లోకం చూచాయగానన్నా ఎరగని ఆంధ్రులుండరు. ఎందుకంటే పెళ్ళి శుభలేఖలన్నిటినీ దీంతో ప్రారంభించడం బాగా పాతుకుపోయిన తెలుగు సంప్రదాయం. తమ సంతానం వివాహ సందర్భంలో ఆంధ్రులు ఆదర్శదంపతులైన సీతారాములను ఈ శ్లోకం ద్వారా మొదట స్మరించుకుని, శుభకార్యానికి శుభారంభం చేసుకుంటారు.

సీతారాముల కళ్యాణంలో తలంబ్రాలు పోసుకునే ఘట్టాన్నీ ఈ శ్లోకం వర్ణించి, ఆ తలంబ్రాలు మీకు శుభాలు కలిగించుగాక అని ప్రార్థిస్తారు.

జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మరాగాయితాః
న్యస్తాః రాఘవ మస్తకే చ విలసత్‌ కుంద ప్రసూనాయి తాః
స్రస్తాఃశ్యామలకాయ కాంతికలితాఃయాః ఇంద్ర నీలాయితాః
ముక్తాః తాః శుభదాః భవంతు భవతాం శ్రీ రామవైవాహికాః

పెళ్ళి కూతురుగా సీతామ్మ తల్లి, శ్రీరాముడి తలమీద ముత్యాల తలంబ్రాలు పోస్తున్నదట. ఆ తలంబ్రాలు కమలాల వంటి నిర్మలమయిన ఆమె దోసిలిలో (కమల - అమల - అంజలి - పుటే) ఉన్నంత సేపు ఎర్రని పద్మరాగమణుల్లాగ ప్రకాశించాయట. ఆమె ఆ ముత్యాలను రాఘవ మస్తకం మీద ఉంచినప్పుడు ఆయన నల్లని కేశజాలం మీద అవి మల్లెపూల లాగా ఒప్పాయట (కుంద ప్రసూనాయితాః) ఆ తర్వాత ఆయన తల మీద నుంచి జారి, ఆ నీలమేఘశ్యాముడి శరీరం మీద పడ్డప్పుడు, అవి ఆయన శరీరకాంతితో కలసి ఇంద్రనీలమణుల లాగా భాసించాయట. అలాంటి శ్రీరామకళ్యాణ సందర్భపు ముత్యాల తలంబ్రాలు (శ్రీ రామ వైవాహికాః) మీకందరికీ శుభం కలగ జేయుగాక (శుభదాః భవంతు భవతామ్‌), అని కవి ప్రార్థన.

ఇంత అద్భుతమైన, సుందరమైన, ఉదాత్తమైన భావం గల శ్లోకం కాబట్టే పెద్దలు దీనిని ప్రతి వివాహసమయంలోనూ స్మరించే ఉత్తమ సంప్రదాయం నెలకొల్పారు. అర్థం పూర్తిగా తెలిసినా తెలియక పోయినా ఈ నాటికీ ఈ సంప్రదాయం పాటిస్తున్నాం.

భద్రాచలంలో సీతారాముల మనోహరమైన విగ్రహాలు చూసిన వారు, వాటిని మరవలేరు. భద్రాద్రి శ్రీరాముడు ఒడిలో సీతాదేవితో, భక్తులకు దర్శనమిస్తాడు. ఆ విగ్రహాలను కళ్ళకు కట్టే శ్లోకం శ్రీరామకర్ణామృతంలో ఉంది.

వామాంక స్థిత జానకీ,
పరిలసత్‌ కోదండదండం కరే
చక్రం చోర్ద్వ కరేణ బాహుయుగళే
శంఖం శరం దక్షీణే
బిభ్రాణం జలజాత పత్ర నయనం
భద్రాద్రి మూర్థ్ని స్థితం
కేయూరాది విభూషితం
రఘుపతిం రామం భజే శ్యామలం

ఈ శ్లోకం కూడా మనందరికీ పరిచితమైనదే. శ్రీరామకర్ణామృతంలో శ్లోకమని చాలామందికి తెలియకపోవచ్చు.

వైదేహీ సహితం సురద్రుమతలే
హైమే మహా మంటపే
మధ్యే పుష్పక మాసనే
మణిమయే వీరాసనే సంస్థితమ్‌
అగ్రే వాచయతి ప్రభంజన సుతే
తత్త్వం మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః
పరివృతం రామం భజేశ్యామలం

ఈ శ్లోకంలో భజింపబడుతున్న శ్రీరామచంద్రమూర్తి వైదేహీసమేతంగా, భరతాదులతో పరివృతుడై కూర్చొన్న వాడు. ఎక్కడ? కల్పవృక్షపు చాయలో, బంగారు మంటపం మీద, పుష్పకం మధ్యలో, మణిసింహాసనం మీద వీరాసనంలో కూర్చొని ఉన్నాడు.

ఏం చేస్తున్నాడు?

ప్రభంజనసుతుడైన హనుమంతుడు ముందు శ్రీరాముడి పరతత్త్వాన్ని మునులకు చెప్తూండగా, శ్యామల వర్ణం గల రాముడే ఆ తత్త్వాన్ని వ్యాఖ్యానపూర్వకంగా వివరిస్తూన్నాడు. ఈ పుణ్య దృశ్యం ఈ శ్లోకం చదివిన భక్తుడి మనః ఫలకంలో ముద్ర వేస్తుంది.

శ్రీరామ కర్ణామృతం విరచించిన మహానుభావుడికి శ్రీరాముడే సర్వస్వం.

మాతా రామః మత్పితా రామచంద్రః
భ్రాతా రామః మత్సఖా రాఘవేశః
సర్వస్వం మే రామచంద్రః దయాళుః
నాన్యం దైవం నైవ జానే న జాసే

భద్రాచల రామదాసు, రాముడికి 'రెండవ సారి దైవమిక లేడనుచున్‌ గడ కట్టి, భేరికాడాండ డడాండ డాండ నినదంబు లజాండము నిండ మత్త వేదండము నెక్కి చాటి' చెప్పేది, ఈ శ్లోకం నాలుగో పాదంలో ఉన్న సందేశమే.

అసలు వేదాల ద్వారా తెలియదగిన వేద వేద్యుడైన పరమాత్మే, దశరథుడి ఆత్మజుడిగా శ్రీరామచంద్రమూర్తిగా పుట్టాడు. అప్పుడు వేదమే, వాల్మీకి ద్వారా, రామాయణ కథగా రూపుదిద్దుకుంది అనే భావమును ఈ గ్రంథంలో మరో శ్లోకం ప్రకటిస్తుంది.

వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే,
వేదఃప్రాచేతసాత్‌ ఆసీత్‌ సాక్షాత్‌ రామా యణాత్మనా

రాముడి కంటే రాముడి నామం మరింత గొప్పదని భక్త కబీరు ప్రస్తుతించాడు. ఆ రామనామమంత్రాన్ని శ్రీరామకర్ణామృతకారుడు కూడా ఒక శ్లోకపరంపరతో ఉగ్గడిస్తాడు. వాటిలో మచ్చుకొక జగత్‌ప్రసిద్ధమైన శ్లోకం:

జయతు జయతు మంత్రం
జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ ఖేద
క్లేశ విచ్చిన్న మంత్రమ్‌
సకల నిగమ మంత్రం
సర్వ శాస్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం
రామ రామేతి మంత్రం

శ్రీరామ కర్ణామృతంలో శ్లోకాలన్నీ సుబోధంగా, తేలికగా అర్థమయ్యేలా ఉంటాయి. ఎన్నో ప్రసిద్ధ రామస్తుతి శ్లోకాలకు ఆకరం 'శ్రీరామ కర్ణామృతం'. ఈ రామనవమి సందర్భంగా ఈ శ్లోకాలుకొన్ని ఇలా పునశ్చరణ చేసుకోవటం శుభదాయకమవుతుందని ఆశిద్దాం.

జానాతి రామ తవ తత్త్వ గతిం హనూమాన్‌
జానాతి రామ తవ సఖ్య గతిం కపీశః
జానాతి రామ తవ యుద్ధ గతిం దశాస్యః
జానాతి రామ ధనదానుజ ఏవ సత్యమ్‌

ఓ రామచంద్రా! నీ తత్త్వాన్ని పూర్తిగా తెలుసుకున్నవాడు నీ మహాభక్తుడైన ఆంజనేయుడు. నీ మిత్రభావాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న మహానుభావుడు సుగ్రీవుడు. నీ యుద్ధ పరాక్రమం పూర్తిగా అనుభవంలోకి తెచ్చుకున్నవాడు రావణాసురుడు. నిన్ను గురించిన సత్యం అంతా బోధ పరచుకున్న వాడు నీ శరణాగతితో తరించిన విభీషణుడు.

సమస్త పాపాలను తరిమికొట్టేది, పుణ్యప్రదమయినదీ, శ్రీరామనామం. ఆయన నామకీర్తనం. అది శ్రీరామ కర్ణామృతాన్ని మననం చేయడం ద్వారా పొందగలమన్నది స్పష్టం. ఆ స్వామిని పంచరత్నాలలోని ఓ శ్లోకం ఇలా కీర్తిస్తోంది.

సకలభువనరత్నం సచ్చిదానంద రత్నం
సకలహృదయ రత్నం సూర్యబింబాంత రత్నం
విమల సుకృతరత్నం వేదవేదాంత రత్నం
పురహర జపరత్నం పాతుమాం రామరత్నం

ఆ స్వామి కీర్తనతో మన జన్మలను ధన్యం చేసుకుందాము.
 


1 comment:

  1. ధన్యోస్మి, కృతజ్ఞతాపూర్వక అంజలులు

    ReplyDelete

Powered By Blogger | Template Created By Lord HTML