What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 25 September 2014

తులసి - హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి.



తులసి -

హిందూ మతంలో, ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తులసి మొక్క పట్ల ఎంతో భక్తి,పూజావిధానాలు ఉన్నాయి. ఆడువారు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు, వ్రతాలు, పండుగలు, స్తోత్రాలు, భక్తి గేయాలు ఆచారంలో ఉన్నాయి. తులసి తీర్ధం అన్నమాట తరచు వింటాము. తులసి తీర్థం లేదా తులసి రసం భారతీయ సాంప్రదాయంలో ప్రముఖ స్థానాన్ని కలి ఉంది. దీన్ని సర్వరోగ నివారణిగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి చనిపోయే ముందు నోటిలో తులసి తీర్ధం పోస్తారు. తులసి 24 గం.లూ ప్రాణవాయువును వదులుతూ ఉంటుంది.ఆ వాయువును పీల్చుట వలన ' యజ ' చేయగా వచ్చు ఫలితము వచ్చుచున్నది.కావున ప్రతి ఇంట్లో కనీసం 10 మొక్కలయినా పెంచి,వాతావరణ కాలుష్యాన్ని నివారించి,ఆరోగ్యాన్ని రక్షించుకొని,తులసి తీర్ధం సేవించండి.త్రికాలములందు తులసిని సేవించినచో అనేక చాంద్రాయణ వ్రతములకంటే మిన్నగా శరీరశుద్ధియగును.తులసి యొక్క సువాసన వ్యాపించి ఉన్న వాతావరణంలో నివసించు ప్రాణికోటి పవిత్రులు,నిర్వికారులు కాగలరు.తులసి మొక్క వున్న చోట త్రిమూర్తులు మొదలగు సర్వ దేవతలు నివసింతురు.తులసి దళములందు పుష్కరాది తీర్ధములు,గంగ మొదలగు నదులు,వాసుదేవది దేవతలు నివసింతురు.

వేలాది సంవత్సరాలుగా ఆయుర్వేదంలో తులసి ఒక ముఖ్యమైన ఔషధిగా వాడబడుతున్నది. రెండు వేల సంవత్సరాలకంటే పురాతనమైన ఆయుర్వేద గ్రంధం చరక సంహితంలోనూ, అంతకంటే పురాతనమైన ఋగ్వేదంలోనూ కూడా తులసి ప్రస్తావన ఉంది. తులసిని ఇంకా చాలా గృహ వైద్యంచిట్కాలలో కూడా వాడుతారు. దీని ఔషధీగుణంపై ఇప్పుడు మరింత పరిశోధన జరుగుతున్నది. అనేక ఆధునిక ఔషధాలలో కూడా తులసిని వాడుతున్నారు. శరీరంలో వివిధ ప్రక్రియలను సమతుల్యం చేశే ప్రభావం ఉన్న adaptogen గా తులసిని గుర్తించారు. కనుక మానసిక వత్తిడిని తగ్గించే ప్రభావం, ఆయుర్వృద్ధి కలిగించే ప్రభావం తులసిలో ఉన్నాయని అభిప్రాయుం. ఇదే జాతికి చెందిన థాయ్ బేసిల్ మొక్కను ఒకోసారి తులసి (హోలీ బేసిల్)గా పొరపడటం జరుగుతుంది. కాని రెండింటికీ రూపంలోనూ, రుచి, వాసనలోనూ తేడాలున్నాయి.

శ్లో|| పుష్పాణాం సార భూతాం త్వం భవిష్యసి మనోరమే
కళాంశేన మహాభాగే స్వయం నారాయం ప్రియా
ప్రియత్వం త్వరదేవానాం శ్రీకృష్ణస్య విశేశతః
పూజా విముక్తిదా నౄణాం మయాభోగ్యాన నిత్యశః
ఇత్యుక్త్వాతాం సురశ్ర్ష్ఠో జగామ తపసేపునః
హరేరాధన నవ్యగ్రో బదరి సన్నిధింయయౌ

తులసిని గురించి హిందూమతంలో ఎన్నో కథలు, నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. గురించి దాని పవిత్రత గురించి బ్రహ్మవైవర్త పురాణంలో తులసి వరింపబడింది. పరశురాముడు తన గురువైన శివుడిని దుర్గాదేవి గణపతిని అన్ని పుష్పములతో అర్చించాడు కాని తులసితో అర్చించక పోయినా గణపతి ఆ పూజలు ఎందువలన స్వీకరించాడు అని నారదుడు నారాయణ మునిని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వృత్తాంతాన్ని చెబుతారు. ఒక్కప్పుడు యవ్వనము నందున్న తులసి నారాయణుడిని మనసులో తలచుకొనుచు వెళ్ళుచుండగా గంగానది తీరంలో చందనము రాసుకొని రత్నాలంకారములతో నారాయణుడి గురించి ధ్యానం చేసుకొనుచున్న గణపతి కనిపించెను. ఆయనను చూసి తులసి కామ పీడితురాలై గణపతితో వికారముగా గజముఖమును కలిగి లంబోదరముతో ఏకదంతము కలిగి నువ్వు ధ్యానం వదిలి పెట్టి బాహ్య ప్రపంచములోకి రమ్ము అని అంటుంది. దానికి సమాధానంగా, తల్లి శ్రీకృష్ణ పాదపంకజాలను స్మరిస్తున్న నన్ను ఏలా నా ధ్యానంను భంగము చేయుచున్నావు, నీ తండ్రి ఎవరు, నీకు ఏ విఘ్నాలు కలగకుండ ఉండుగాక నీ విషయాలు తెలుపుము అని అంటాడు. అప్పుడు తులసి తాను ధర్మద్వజుడు కుమార్తెనని భర్త కోసం తపం ఆచరిస్తున్నానని గణపతిని భర్తగా అవ్వమని కోరుకొంటుంది. అప్పుడు గణపతి వివాహానికి నిరాకరించి పెళ్ళి దుఃఖం కలిగించునని శ్రీహరి సాన్నిధ్యము నుండి వేరు చేయునని, మోక్షమార్గానికి కవాతం కాదని వారిస్తాడు. తులసి దానికి కోపించి గణపతిని ఈ విధంగా శపిస్తుంది "నీభార్య అందరివద్ద ఉండుగాక". ఈ శాపవచనమును విన్న గణపతి ప్రతిశాపంగా "నువ్వు రాక్షస జన్మ ఎత్తుతావు, శరీరాన్ని పరిత్యజించిన తరువాత వృక్షానివి అవ్వుతావు" అంటాడు. ఆ ప్రతిశాపం విన్న తులసి రోదించి గణపతిని స్తుతించింది , అది విని గణపతి ప్రసన్నుడై పుష్పములన్నింటికి ప్రధానదానవు అవుతావు, సమస్త దేవతలకు ప్రత్యేకంగా శ్రీకృష్ణపరమాత్మకు ప్రీతి పాత్రురాలు అవుతావు, నీచేత చేయబడిన పూజ మానవులకు మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి గణపతి బదరికా వనానికి వెళ్ళి పోతాడు. ఆ తరువాత తులసి శంఖచూడునకు అనే రాక్షసుడికి కుమార్తెగా జన్మిస్తుంది, శంఖచూడుడు శివుని చేత శూలంతో సంహరించబడ్డాక తులసి వృక్షరూపాన్ని పొందుతుంది. అందువల్ల గణపతి ప్రతి నిత్యం తులసితో పూజించరాదు.ఈ విషయాలు ధర్ముడు తనకు చెప్పెనని నారాయణ ముని నారదునితో చెప్పడంతో ఆ వృత్తాంతం ముగుస్తుంది. తులాభారం శ్రీ కృష్ణ తులాభారం కథలో -సత్యభామ బారువులకొలది బంగారం వేసినా సరితూగని కృష్ణుడు రుక్మిణి ఒక్క తులసి ఆకు వేయగానే తూగాడు. భగవంతుడు భక్తికి అందుతాడని ఈ గాధ సందేశం.

ఔషధంగా తులసి :

తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.

కొన్ని ఉపయోగాలు
తులసి ఆకులకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా,
జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.

తులసి ఆకుల్ని పలురకాల జ్వరాల్లో ఉపశమనానికి ఉపయోగించుకోవచ్చు. వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ జ్వరం వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి తాగితే ఈ రకం జ్వరాల నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. జ్వరం మరీ తీవ్రంగా ఉంటే తులసి ఆకులనూ, యాలకుల పొడినీ కలిపి అరలీటరు నీళ్లలో మరిగించి కషాయం తయారు చేయాలి. అందులో చక్కెర, పాలు కలిపి తాగితే జ్వర తీవ్రత తగ్గుతుంది. తులసి ఆకుల్ని మెత్తగా నూరి నీటిలో కలుపుకుని రెండుమూడు గంటలకోసారి తాగొచ్చు.
పలురకాల ఆయుర్వేద దగ్గు మందుల్లో తులసిని తప్పకుండా కలుపుతారు. బ్రాంకైటిస్‌, ఆస్థమాల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది. తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ నీళ్లతో నోటిని పుక్కిలించినా మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.
ఎండిన తులసి ఆకులను ధాన్యం నిలవ చేసిన చోట్ల ఉండుతారు - కీటకాలను దూరంగా ఉంచడం కోసం. ఆకుల రసం (పసరు), ఎండిన ఆకుల పొడి, మరగించిన నీరు, హెర్బల్ టీ, నేతిలో మరగ పెట్టడం - ఇలా తులసిని చాలా విధాలుగా తీసుకోవచ్చును. ఇటీవల అధ్యయనాలలోని ఫలితాల ప్రకారం చాలా నొప్పి నివారక పదార్ధాలలాగా తులసి ఒక COX-2 inhibitor కావచ్చును. ఇందుకు కారణం తులసిలో అధిక మోతాదులో ఉన్న యూజినాల్'(Eugenol) (1-హైడ్రాక్సీ-2-మీథాక్సీ-4-అల్లైల్ బెంజీన్).ఇంకా ఇతర అధ్యనాలలో తులసికి రక్తంలో చక్కెర మోతాదును తగ్గించగలిగే శక్తి తులసికి ఉంది. కనుక డయాబెటిస్ (చక్కెర వ్యాధి) వైద్యంలో కూడా తులసి పనికొస్తుంది.
రక్తంలో కోలెస్టరాల్ను తగ్గించడానికీ, 'యాంటీ ఆక్సిడెంట్' గుణాల వలన బ్లడ్ షుగర్ తగ్గించడానికీ కూడా పనికొచ్చే పదార్ధాలు తులసిలో ఉన్నాయని మరి కొన్ని పరిశోధనలలో తేలింది.

'రేడియేషన్' కు గురైనందువలన కలిగే విషమ పరిస్థితి నుండి రక్షణకు కూడా తులసి ఉపయోగ పడవచ్చునని కొన్ని అధ్యయనాలు సూచించాయి.అలాగే కంటి శుక్లాల సమస్యకు కూడా.

తులసి లో సుమారు అరవై రకాలు పైగా వున్నాయి. అందులో ముఖ్యమైనవి కృష్ణ తులసి, రామ తులసి, వన తులసి, బాబి తులసి, తుకష్మియ తులసి, ద్రుదిరః తులసి, కపూర్ తులసి మొదలైనవి.

ఇన్ని ప్రయోజనాలు కలిగించే తులసి చెట్టుని పూజించటం మన కర్తవ్యంగా భావించి పూజించాలి.



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML