What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 31 July 2013

ఆషాడంతో మొదలుపెట్టి అట్లతద్ది, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి...

ఆషాడంతో మొదలుపెట్టి అట్లతద్ది, వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి... అంటూ ప్రతి పండుగకూ అరచేతి గోరింటను పండించేవారు పల్లెపడుచులు ఒకప్పుడు. కాలగతిలో కనుమరుగయ్యే అనేకానేక పద్ధతులకు భిన్నంగా ఆనాటి గోరింట నేడు హెన్నాగా మారి ఆధునిక యుగంలో అత్యాధునిక ఫ్యాషన్‌గా ఎదిగింది.
పండుగ పబ్బాలతో నిమిత్తం లేకుండా పల్లె, పట్నం అన్న తేడా లేకుండా పల్లె పడుచునీ, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నీ, కాలేజీ, యూనివర్సిటీ అమ్మాయిల్ని, ఫ్యాషన్ డిజైనర్లనీ, క్రీడాకారుల్ని, కళాకారుల్నీ ఏకరీతిన ఆకట్టుకోగలగడంతో పాటు పాశ్చాత్యుల్ని సైతం అతివలందరి మనసుల్ని దోచుకుని సుమనోహర సౌందర్యమై వెలుగొందుతోంది. ప్రధానంగా భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో భాగమైంది. ప్రతి తెలుగింట శుభకార్యాల్లో ఇంకా చెప్పాలంటే ప్రతి వేడుకలోనూ మమేకమై ఆడపడుచుల ఒంటినిండా గోరింటాకు పూస్తుంది.
‘‘మందారంలా పూస్తే... మంచి మొగుడొస్తాడనీ, గనే్నరులా పూస్తే... కలవాడొస్తాడనీ, సింధూరంలా పూస్తే.. అందాల చందమామే దిగివస్తాడ’’నే అల్లిబిల్లి ఊహల్నీ, ఆశల్నీ, నమ్మకాల్నీ పండిస్తోంది. ఉత్తర భారతీయులు పెళ్ళి వేడుకల్లో పెట్టే మెహందీ బాగా పండాలని దైవాన్ని వేడుకుంటారు. అలా పండితే భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధం పటిష్ఠంగా ఉంటుందని వారి విశ్వాసం.
ఇలాగే తెలుగింట అమ్మాయిలు గోరింటాకు బాగా పండాలని వారి వారి ఇష్టదైవాలను కోరుకుంటారు. అమ్మలు, నాన్నమ్మలు, అమ్మమ్మల ఆశీర్వచనాలను తీసుకుంటారు.
ఎలా పండుతుంది?
ఆకులోని ఎర్రరంగుకు కారణమయ్యే లాసోన్ పదార్థం చర్మంలోని స్ట్రామ్ కార్నియమ్ పొరలోని మృతకణాల ద్వారా లోపలకు ఇంకి చర్మానికి ఎరుపు రంగునిస్తుంది. సాధారణంగా మగవారి అరిచేతుల్లో ఈపొర మందంగా ఉండి ఇంకడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మగవారికి త్వరగా పండదు. అయితే మందపాటి చేతులవల్ల మరో లాభం కూడా ఉంది. పండటం ఆలస్యమైనట్లే రంగు త్వరగా పోకుండానూ ఉంటుంది.
లాసోన్‌తోపాటు మేనైట్ యాసిడ్, మ్యుసిలేజ్, గాలిక్ యాసిడ్, నాఫ్తాక్వినోన్ లాంటి రసాయనాలు కూడా ఇందులో ఉండటంవల్ల అనాదినుంచీ ఇది మంచి కలర్ డైగా వాడుకలోనూ ఉంది. మిగిలిన ప్రయోజనాల సంగతెలా ఉన్నా మన దేశంలో మాత్రం సంప్రదాయ పెళ్లిళ్ళతో మెహందీ విడదీయలేని అనుబంధాన్ని ఏర్పరచుకుందనే చెప్పాలి. గోరింటాకు పెట్టుకోవడానికి పెళ్ళి ఒకటే సందర్భం కాకపోవచ్చు. కానీ మెహందీ లేని పెళ్ళి సందడి ఉండదంటే అతిశయోక్తికాదేమో!
తెలుగింట జరిగే వివాహ శుభకార్యాల్లో పెళ్ళికూతురుకు మెహందీని పెట్టడాన్ని పెద్ద వేడుకగా చేసే ఆచారం నేటికీ కొనసాగుతోంది. మెల్లగా ఇది అన్ని ప్రాంతాలకూ పాకింది. డిజైన్లు వేసేందుకు బ్యూటీపార్లర్లూ వెలశాయి. కొత్తగా మెహందీ డిజైనర్లు పుట్టుకొచ్చారు. కాలక్షేపంగానో, ఆసక్తికొద్దీనో నేర్చుకున్న ఈ కళ, కొంతమంది మహిళలకు పార్ట్‌టైమ్ జాబ్‌గానూ ఉపయోగపడుతోంది. కాలేజీ అమ్మాయిలు మెహందీపట్ల మరింత ఉత్సాహం కనబరుస్తున్నారు. పట్టణాల్లో, నగరాల్లోని పార్కులు, ఎగ్జిబిషన్లు, షాపింగ్ మాల్స్‌లో దీక్షగా మెహందీ డిజైన్లను తీర్చిదిద్దే అమ్మాయిలు కనబడుతున్నారు. వీళ్లు పెట్టే డిజైన్లలో కూడా విభిన్న ప్యాక్‌లున్నాయి. ఇండియన్ ప్యాక్‌లో చేతుల నిండా డిజైన్స్ వేస్తే, అరబిక్ ప్యాక్‌లో ఓపక్క మాత్రమే డిజైన్ ఉంటుంది. ధర కూడా డిజైన్ బట్టి ఉంటుంది.
కేవలం వేడుకలకే కాకుండా, ఉగాది, హోలీ, దీపావళి, రక్షాబంధన్, నాగపంచమి, సంక్రాంతి... వంటి సందర్భాల్లో ఆయా పండుగలకు సంబంధించిన డిజైన్లను వేసుకోవడం ఈ తరంవారికీ ఫ్యాషన్‌గా మారింది. తెలుగు నాట తొలకరి వర్షాలు పడే ఆషాఢంలోనూ, అట్లతద్దికీ గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలని అమ్మమ్మలు బాగా ప్రోత్సహిస్తున్నారు. ఈ తరం
యువతులు మోజుపడుతున్నారు. దీంతో గోరింటాకు పట్ల మరింత క్రేజ్ పెరిగింది.
ప్రాచీన కాలంనాటి ఈ అలంకారం, మరిన్ని సింగారాలు తీర్చిదిద్దుకుని అటు ఆధునిక ఫ్యాషన్‌గానూ, ఇటు సంప్రదాయ వేడుకగానూ నేటికీ వాడుకలో ఉండటమే గోరింటాకులోని గొప్పతనం! అదే దాని స్పెషల్... అట్రాక్షన్!!

ఎలా పెట్టుకోవాలి?
చిన్న పాత్రలో గోరింటాకు పొడిని వేయాలి. బాగా మరిగించి చల్లార్చిన టీ డికాక్షన్‌ని పొడిలో కలిపి పేస్టులా చేయాలి. కొద్దిగా యూకలిప్టస్ నూనె, టేబుల్ స్పూన్ పంచదార, కొన్ని చుక్కల నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత మూతపెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. రాత్రి సమయంలో పెట్టుకోవాలంటే ఉదయానే్న ఇవన్నీ చేసి సాయంత్రం వరకు బాగా నానబెట్టాలి. మందంగా ఉన్న ప్లాస్టిక్ కవర్‌లో పేస్టుని వేసి కోన్ ఆకృతిలో చుట్టాలి. కోన్ కొనభాగంలో సన్నని రంధ్రం చేసి కావలసిన డిజైన్లు వేసుకోవచ్చు. మార్కెట్‌లో రెడీమేడ్ కోన్స్ కూడా ఇపుడు దొరుకుతున్నాయి. వీటిని ఉపయోగించనూ వచ్చు.
మెహందీని కనీసం 4 నుంచి 6 గంటలు ఉంచుకోవాలి. ఎండిన తరువాత పెచ్చులు పెచ్చులుగా దానంతట అదే ఊడిపోతుంది. లేదంటే చేత్తో మృదువుగా గీరి తీయాలేగానీ నీళ్ళలో తడవకూడదు. తీసిన తరువాత మరో ఆరు గంటల వరకూ నీళ్ల జోలికి వెళ్ళకూడదు.
ఇలా చేస్తే డిజైన్ ముదురు రంగులోకి మారుతుంది. కనీసం పక్షం రోజులు పోకుండా ఉంటుంది. అయితే పండే రంగు మాత్రం చర్మంమీద ఆధారపడి వుంటుంది సుమా!

పుట్టుక... వేడుక!
భారతీయ జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్న గోరింటాకును మొట్టమొదటగా వాడింది మనమేనా?... అంటే... కాదనే చెప్పాలి. సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే ప్రాచీన ఈజిప్షియన్లు వాడినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
రుబ్బిన గోరింటాకును వారు ఆడామగా తేడా లేకుండా గోళ్ళకీ, చేతులకీ, పాదాలకీ, జుట్టుకీ, చివరికి గడ్డానికి కూడా పెట్టుకునేవారట. అంతేకాదు, తాము పెంచుకునే జంతు జాతులకీ గోరింటను దట్టంగా పట్టించేవారట. ఉత్తర ఆఫ్రికాలోని ఎడారివాసులు ఈ ఆకులో ఉన్న చల్లని గుణం గురించి తెలుసుకుని వేసవి తాపాన్ని తగ్గించే చలువ వస్తువుగా దీన్ని ఉపయోగించేవారు.
ఆపై మొఘల్ చక్రవర్తుల ద్వారా 12వ శతాబ్దంలో ఇది మన దేశంలో అడుగుపెట్టి అన్ని ప్రాంతాలకు విస్తరించింది. తెలుగు నాట సంప్రదాయకమై ప్రతి ఇంటా గోరింటాకు పూస్తుంది.
గోరింటను ప్రధానంగా మనం కాళ్ళకూ, చేతులకూ చేసుకునే అలంకారంగానే పరిగణించినా అమెరికన్లు మాత్రం కేవలం జుట్టుకు వేసుకునే రంగుగానే దీన్ని వాడేవారట. దీంతో ప్రపంచ వ్యాప్తంగా హెన్నా అంటే జుట్టుకు వేసుకునే రంగుగానే ప్రాచుర్యం చెందింది. ప్రస్తుతం పచ్చబొట్టు ఫ్యాషన్ మోజులో ఉన్న అమెరికన్లూ, యూరోపియన్లూ కూడా తాత్కాలికమైన పచ్చబొట్టుగా మెహందీ డిజైన్లని ఒళ్ళంతా వేసుకుంటున్నారు. హెన్నా టాటూవల్ల ఎలాంటి నొప్పీ లేకపోవడంతో ఇది పచ్చబొట్టును మించిన క్రేజ్‌గా సంపాదించుకుంది.
గుజరాత్‌లోని ఆదివాసీ తెగలో పెళ్ళిళ్ళప్పుడు వధూవరుల మొహాల్ని కూడా గోరింటాకుతో అలంకరిస్తారు. మధ్య తూర్పు దేశాల్లో గర్భిణీలు, పుట్టబోయే తమ చిన్నారులకు స్వాగతం చెబుతూ గోరింటాకును బొడ్డుచుట్టూ పెట్టించుకుంటారు.
మొరాకోలో గర్భిణీలు ఏడోనెల వచ్చాక చీల మండ దగ్గర పట్టీలు పెట్టుకున్నట్లుగా డిజైన్స్ వేసుకుంటారు. అలా చేయడంవల్ల ప్రసవం సుఖంగా జరిగి తల్లీ బిడ్డా క్షేమంగా ఉంటారనేది వాళ్ళ నమ్మకం. సైన్స్ పరంగా గోరింటాకు ఇలా ఉపయోగపడి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. శిశువు జన్మించాక బొడ్డు తాడు కోసిన తరువాత గోరింటాకు ముద్దను బొడ్డుమీద పెడితే బిడ్డకు అందం, ఐశ్వర్యం లభిస్తుందని చాలామందికి తెలుగునాట విశ్వాసం వుంది. మన తెలుగింటి ఆడపడుచులు గోరింటాకు రుబ్బి చేతులకు, కాళ్ళకు పెట్టుకునే సంప్రదాయం అనాదిగా వస్తున్నా, మెహందీగా రూపుదాల్చడంతో రెడీమేడ్ కల్చర్‌గా మారిపోయింది

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML