What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Monday, 2 December 2013

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు.

మన్వంతరము

హిందువుల పురాణాల ప్రకారం ఒక మనువు యొక్క పాలనా కాలాన్ని మన్వంతరము అంటారు. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ఒక బ్రహ్మ దినము లో 14 మన్వంతరాలు, 15 మన్వంతర రాత్రులు ఉంటాయి. ప్రస్తుతము మనము ఏడవ మన్వంతరములో ఉన్నాము. ప్రతి మన్వంతరము 71 మహాయుగములుగా విభజించబడినది.
భాగవతం అష్టమ స్కందంలో మన్వంతరాల గురించిన వివరణ ఉన్నది. ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో 27 మహాయుగాలు గతించి 28వ మహాయుగంలో సత్య, త్రేతా, ద్వాపర యుగాల తరువాత కలియుగం నడుస్తున్నది. ప్రతి మన్వంతరం లోను సప్తర్షులు, ఇంద్రుడు, సురలు మారుతుంటారు. భగవంతుని అవతారాలు కూడా మారుతుంటాయి.
మన్వంతరాల పేర్లు
1. స్వాయంభువ మన్వంతరము
2. స్వారోచిష మన్వంతరము
3. ఉత్తమ మన్వంతరము
4. తామస మన్వంతరము
5. రైవత మన్వంతరము
6. చాక్షుష మన్వంతరము
7. వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
8. సూర్యసావర్ణి మన్వంతరము
9. దక్షసావర్ణి మన్వంతరము
10. బ్రహ్మసావర్ణి మన్వంతరము
11. ధర్మసావర్ణి మన్వంతరము
12. భద్రసావర్ణి మన్వంతరము
13. దేవసావర్ణి మన్వంతరము
14. ఇంద్రసావర్ణి మన్వంతరము
ఎన్నెన్ని సంవత్సరాలు?
దేవతల కాల ప్రమాణము మన (మానవ) కాలప్రమాణమునకు 360 రెట్లు అధికము. అనగా మన ఒక సంవత్సరకాలము దేవతలకు ఒక దివారాత్రము (పగలు + రాత్రి). మన 30 సంవత్సరములు దేవతలకు ఒక నెల. మన 360 సంవత్సరములు వారికి ఒక (దివ్య) సంవత్సరము. ఇట్టి 12,000 దివ్య సంవత్సరములు వారికి ఒక దివ్య యుగము (మహాయుగము). ఇది మనకు ఒక చతుర్యుగ కాలము నకు సమానము. ఈ విధముగా లెక్క పెడితే మన 43,20,000 సంవత్సరములు ఒక మహాయుగము అగును.

• కృత యుగము = 4,800 దివ్య సంవత్సరములు = 17,28,000 మానవ సంవత్సరములు
• త్రేతా యుగము = 3,600 దివ్య సంవత్సరములు = 12,96,000 మానవ సంవత్సరములు
• ద్వాపర యుగము = 2,400 దివ్య సంవత్సరములు = 8,64,000 మానవ సంవత్సరములు
• కలియుగము = 1,200 దివ్య సంవత్సరములు = 4,32,000 మానవ సంవత్సరములు
• మొత్తము 12,000 దివ్య సంవత్సరములు = 43,20,000 మానవ సంవత్సరములు = ఒక దివ్య యుగము (చతుర్యుగము, మహాయుగము)
ఇలాంటి వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక పగలు. బ్రహ్మ పగలును కల్పము (సర్గము) అంటారు. మరొక వేయి దివ్య యుగములు బ్రహ్మదేవునకు ఒక రాత్రి. ఈ రాత్రిని ప్రళయము అంటారు. అటువంటి 360 దివారాత్రములు బ్రహ్మకు ఒక సంవత్సరము. అటువంటి 100 సంవత్సరములు బ్రహ్మ ఆయుఃకాలము.

కాలమానము సౌర (మానవ) సంవత్సరాలు దివ్య సంవత్సరాలు
ఒక చతుర్యుగము 43,20,000 12,000
71 చతుర్యుగములు 30,67,20,000 8,52,000
ప్రతి కల్పాదియందు వచ్చు సంధ్య 17,28,000 4,800
14 సంధ్యా కాలములు 2,41,92,000 67,200
ఒక సంధ్యాకాలముతో పాటు ఒక మన్వంతరము 30,84,48,000 8,56,800
14 సంధ్యలతో పాటు కలిపిన 14 మన్వంతరములు 4,31,82,72,000 1,19,95,200
14 మన్వంతరములు + కల్పాది సంధ్య = ఒక కల్పము = బ్రహ్మకు ఒక పగలు 4,32,00,00,000 1,20,00,000
బ్రహ్మకు ఒక రాత్రి 4,32,00,00,000 1,20,00,000
బ్రహ్మకు ఒక దివారాత్రము (ఒక రోజు) 864,00,00,000 2,40,00,000
బ్రహ్మకు ఒక సంవత్సరము 311040,00,00,000 864,00,00,000
ముఖ్య సంఘటనలు
వెనుకటి మన్వంతరాలలో జరిగిని కొన్ని ముఖ్య సంఘటనలు
స్వాయంభువ మన్వంతరము
• మనువు - స్వాయంభువు.
• భగవంతుని అవతారాలు - కపిలుడు, యజ్ఞుడు - దేవహూతి కడుపున కపిలునిగా జన్మించి ధర్మ జ్ఞానాలను లోకాలకు ఉపదేశించాడు.దీనినే కపిలగీత అని అన్నారు. స్వాయంభువ మనువు చిరకాలం రాజ్యం పాలించి, విరక్తుడై రాజ్యాన్ని త్యజించి, భార్యయైన శతరూపతో బయలుదేరి అరణ్యాలకు వెళ్ళాడు. సునంద నది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేశాడు. క్షుధార్తులైన అసురులు, యాతుధానులు ఆ మనువును భక్షించడానికి వచ్చారు. నారాయణుడు ఆకూతి(స్వాయంభువ మనువు కూతురు) గర్భంలో యజ్ఞునిగా జన్మించి దుష్టులను సంహరించి త్రిదివాలను పాలించాడు.వేదశిరుడు అను విప్రుని కుమార్తెకు విభుడు అను పేరుతో అవతరించెను.
• మనుపుత్రులు - ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని కొడుకు ధ్రువుడు తపస్సు చేసి, నారాయణుని దర్శనము పొందాడు.
• మనుపుత్రికలు -ఆకూతి(రుచి ప్రజాపతి భార్య),ప్రసూతి(దక్ష ప్రజాపతి భార్య),దేవహూతి(కర్ధమ ప్రజాపతి భార్య).
• సప్తర్షులు - మరీచి ప్రముఖులు
• ఇంద్రుడు - రోచనుడు
• సురలు - యామాదులు
• ప్రహ్లాదుని జననము, నరసింహ అవతారము మరియు వరహ అవతారము ఈ మన్వన్తరములొ జరిగినది.
స్వారోచిష మన్వంతరము
• మనువు - స్వరోచికి వనదేవతయందు కలిగిన కుమారుడు.
• మనువు పుత్రులు - చైతుడు,రోచిష్మదుడు,కింపురుషుడు
• భగవంతుని అవతారాలు - విభువు - వేద శిరసునికి తుషతయందు విభుడనే పేరుతో అవతరించి, కౌమార బ్రహ్మచారియై, ఎనభై అయిదు మంది మునులచే వ్రతాన్ని ఆచరింపజేశాడు.
• సప్తర్షులు - ఊర్జుడు,స్తంభుడు,ప్రాణుడు,దత్తోళి,ఋషభుడు,నీవారుడు,అరివంతుడు
• ఇంద్రుడు - విపశ్చింతుడు
• సురలు - తుషితాదులు
• సురత చక్రవర్తి వృత్తాంతము
ఉత్తమ మన్వంతరము
• మనువు - ప్రియవ్రతుని కొడుకు ఉత్తముడు.
• మనువు పుత్రులు - భావనుడు, సృంజయుడు, యజ్ఞహోత్రుడు
• భగవంతుని అవతారాలు - సత్య సేనుడు - ధర్మునికి సూనృత యందు సత్యసేనుడనే పేర అవతరించి సత్యవ్రతం అనుష్టించి దుష్టులను సంహరించి సత్యజితునికి సుఖాన్ని కూర్చాడు.
• సప్తర్షులు - ప్రమాదాదులు (వశిష్టుని సుతులు)
• ఇంద్రుడు - సత్యజితుడు
• సురలు - సత్యదేవ శృతభద్రులు
తామస మన్వంతరము
• మనువు - ఉత్తముని సోదరుడు తామసుడు.
• మనువు పుత్రులు - వృషాఖ్యాతి, నరుడు, కేతువు మొదలైన పదుగురు పుత్రులు
• భగవంతుని అవతారాలు - హరి - హరిమేధసునికి హరిణియందు హరి యను పేరిట అవతరించి మకరగ్రస్తుడైన గజేంద్రుని రక్షించాడు. (గజేంద్ర మోక్షము)
• సప్తర్షులు - జ్యోతిర్వ్యోమాదులు
• ఇంద్రుడు - త్రిశిఖుడు
• సురలు - విధృతి తనయులు వైధృతులు (వేదరాశి నశించినపుడు ఆ తేజస్సును తమలో జీర్ణం చేసుకొన్నవారు)
రైవత మన్వంతరము
• మనువు - తామసుని సోదరుడు రైవతుడు
• మనువు పుత్రులు - అర్జున ప్రతినింద్యాదులు
• భగవంతుని అవతారాలు - వైకుంఠుడు - శుభ్రునకు వికుంఠయందు వైకుంఠునిగా అవతరించాడు. రమాదేవి ప్రార్ధనను మన్నించి వైకుంఠాన్ని నిర్మించాడు.
• సప్తర్షులు - హిరణ్య, రోమ, వేదశిర, ఊర్ధ్వబాహు ప్రముఖులు
• ఇంద్రుడు - విభుడు
• సురలు - భూత దయాదులు
చాక్షుష మన్వంతరము
• మనువు - చక్షుసుని పుత్రుడు చాక్షుసుడు
• మనువు పుత్రులు - పురువు, పురుషుడు, సుద్యుమ్నుడు మొదలైనవారు
• భగవంతుని అవతారాలు - అజితుడు, కూర్మావతారం - వైరాజునికి సంభూతియందు అజితుడనే పేర అవతరించాడు. ఇదే మన్వంతరంలో దేవతలు, రాక్షసులు కలిసి అమృతము కొరకై క్షీరసాగర మథనము చేశారు. భగవంతుడు కూర్మావతారుడై మందరగిరిని నిలిపాడు. శివుడు కాలకూట విషము మింగాడు. లక్ష్మీ దేవి అవతరించింది. సాగర మధనం చివర ధన్వంతరి అమృతంతో వచ్చాడు. మోహినీరూపుడై భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందజేశాడు.
• సప్తర్షులు - హవిష్మ దీరకాదులు
• ఇంద్రుడు - మంత్రద్యుమ్నుడు
• సురలు - ఆప్యాదులు
వైవస్వత (ప్రస్తుత) మన్వంతరము
ఇది ప్రస్తుతం జరుగుతున్న మన్వంతరము. చాక్షుష మన్వంతరం చివర కల్పాంత ప్రళయకాలంలో భగవానుడు మత్స్యావతారుడై జలరాశినుండి జనులను, ఓషధులను దరిజేర్చాడు. వేదాలను కాపాడాడు.
• మనువు - వివస్వంతుని పుత్రుడు వైవస్వతుడు. అతనికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది.
• మనువు పుత్రులు - ఇక్ష్వాకుడు, నృగుడు, ధృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూశుడు, పృషధ్రుడు, వసుమంతుడు.
• మనువు పుత్రికలు - ఇల(సుద్యుమ్నుడు).
• భగవంతుని అవతారాలు - కశ్యపునకు అదితి యందు వామనుడిగా జన్మించి బలి చక్రవర్తి నుండి మూడడుగుల నేల యాచించి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
• సప్తర్షులు - కశ్యపుడు, అత్రి, వశిష్టుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు
• ఇంద్రుడు - ఓజస్వి
• సురులు - వసువు, రుద్రుడు, ఆదిత్యుడు, విశ్వదేవుడు, నాసత్యుడు, మరుత్తు
ఈ మన్వంతరమున పరశురామ, శ్రీ రామ, బలరామ, శ్రీ కృష్ణ మరియు బుద్ద అవతారములు జరిగినవి, మరియు కల్కి అవతరిస్తారు.
(సూర్య) సావర్ణి మన్వంతరము
రాబోయే మన్వంతరము
• మనువు - సావర్ణి - విశ్వకర్మకు సంజ్ఞ, ఛాయ అను ఇద్దరు పుత్రికలు. వీరు వివస్వంతుని భార్యలయ్యారు. వివస్వంతునికి బడబ అనే మూడవ భార్య కూడా ఉన్నదంటారు. సంజ్ఞకు యముడు, యమి, శ్రాద్ధదేవుడు జనించారు. ఛాయకు సావర్ణి, తపతి, శనైశ్చరుడు కలిగారు. బడబకు అశ్వినులు జనించారు. వీరిలో సావర్ణియే కాబోయే ఎనిమిదవ మనువు.
• మనువు పుత్రులు - నిర్మోహ విరజస్కాదులు
• భగవంతుని అవతారాలు - సార్వభౌముడు - వేదగుహ్య అయిన సరస్వతి యందు సార్వభౌముడనే పేర అవతరిస్తాడు. ఇంద్ర పదవిని పురందరుని నుండి బలికి అప్పగిస్తాడు. వైవస్వత మన్వంతరంలో వామనునికి మూడడుగుల వేల దానమిచ్చినందుకు ప్రతిఫలంగా బలికి ముల్లోకాల సార్వభౌమత్వం సిద్ధించనుంది. బలి ఇప్పుడు సుతల లోకంలో ఉన్నాడు.
• సప్తర్షులు - గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, ఋష్యశృంగుడు, బాదరాయణుడు (వీరందరూ ఇప్పుడు ఆత్మయోగనిష్ఠులై తమతమ ఆశ్రమాలలో ఉన్నారు)
• ఇంద్రుడు - విరోచన సుతుడైన బలి
సురలు - సుతపసులు, విజులు, అమృత ప్రభులు
సూర్య సావర్ణిక మనవు

సూర్య సావర్ణిక మనవునే సావర్ణి మనువు అని కూడ అంటారు.హిందూ పురాణాలు ప్రకారం 14 మంది మనవులు ఉన్నారు. మనవు పరిపాలన కాలాన్ని మన్వంతరం అంటారు. అందులో 8 వ మనవే సూర్య సావర్ణిక మనవు.పురాణ లెఖ్కల ప్రాకారం ఇప్పట్టి వరకు 7 మన్వంతరాలు గడచినాయి. రాబోయేది 8 వదిఅయిన సూర్య సావర్ణిక మన్వంతరం.పురాణ గ్రంథాల సారాంశానుసారం, ప్రతి మనవు ఒక్క జన్మ విశేషాలు ముందుగానే తెలుపబడ్డాయి. ఉదాహరణకు ప్రస్తుత 7 వ మనవైన వైవస్వత మనవు యొక్క తల్లి తండ్రులు పేర్లు విషశ్వంతుడు,శ్రద్దాదేవి.అలాగే ప్రతి మన్వంతరంలో పరమాత్మ కూడ మానవ రూపంలో జన్మిస్తాడని చెప్పబడింది. 7 వ మన్వంతర కాలంలో అలా జన్మించిన పరమాత్మ స్వరూపమే వామనావతారం. కొంతమంది పండితుల ప్రకారం మనవు సాక్షాతు పరమాత్మ స్వరూపం.రాబోయే 8 వ మనువైన సూర్య సావర్ణిక మనవు తల్లితండ్రులు దేవగుహ్యుడు, సరస్వతి. అలాగే అతని పరమాత్మ స్వరూపం నామం సార్వబౌముడు. మనవు యొక్క నిర్దేశిత కార్యములు ఏమనగ, ప్రజలకు ధర్మ మార్గంలో చరించే విదంగా "మనుస్మ్రితి" ని రచించి వారికి అందించడం. ప్రజలందరు అట్టి మనుస్మ్రుతినే ప్రామాణికంగా బావించి ఆ మన్వంతర పర్యంతం దాని ప్రాకారం జీవనం కొనసాగించవలేను. అలా చెయ్యనివారిని పాలకులు మనుస్మ్రితి లో చెప్పిన విదంగా శిక్షలు విదించేదరు. అంతే కాక మనవు తన జీవన కాలములో తానే అటు రాజుగ రాజ్య భారం వహిస్తు, ఇటు మనవుగా ధర్మనిర్దేశకుడిగ ఉంటాడు. కావుననే ఆయనే పరమాత్మ ప్రతినిది అయిన రాజు మరియు ధర్మ శాస్త్రకారుడైన మనువు.
సూర్య సావర్ణిక మనవు ఆశ్రమము.
• భారత దేశంలో ఈ మనవు పేరుతో ఏకైక ఆశ్రమం కలదు. అది ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో ఏనుకూరు మండలంలోని గార్లఒడ్డు గ్రామంలో ఉంది. దీని వ్యవస్తాపకులు శ్రి మద్దిగుంట నరసింహా రావు.దర్మ శాస్త్రకారుడైన మనవు పెరుతో స్తాపించబడిన ఈ ఆశ్రమం ఉద్దేశ్యాలు ఏమనగ హిందువులలో సంస్కర్నాత్మకమైన భావాలను వ్యాప్తి చెయ్యడం.ఇది ఖమ్మం నుండి కొత్తగూడెం పోవు మార్గంలో 45 కిలోమీటర్ల దూరములో ఉంది.
• 
దక్షసావర్ణి మన్వంతరము
• మనువు - వరుణుని పుత్రుడు దక్ష సావర్ణి
• మనువు పుత్రులు - ధృతకేతువు, దీప్తి కేతువు మొదలైనవారు.
• భగవంతుని అవతారాలు - (ధర్మసేవ్యుడు?) భగవంతుడు ఆయుష్మంతునికి అంబుధార వలన ఋషభుడనే పేర అవతరించి అద్భుతునికి ఇంద్ర పదవిని ప్రసాదిస్తాడు.
• సప్తర్షులు - ద్యుతిమంతాదులు
• ఇంద్రుడు - అద్భుతుడు
• సురలు - పరమరీచి గర్గాదులు
బ్రహ్మసావర్ణి మన్వంతరము
• మనువు - ఉపశ్లోకుని సుతుడు బ్రహ్మసావర్ణి
• మనువు పుత్రులు- భూరిషేణుడు మొదలైనవారు
• భగవంతుని అవతారాలు - భగవంతుని అంశచే విశ్వసృజునికి విషూచియందు జనించి ఇంద్రునిగా ఉంటాడు. శంభునికి శక్తినిస్తాడు.
• సప్తర్షులు - హవిష్మంతుడు మున్నగువారు
• ఇంద్రుడు - శంభుడు
• సురలు - విభుదాదులు
ధర్మసావర్ణి మన్వంతరము
మనువు - ధర్మసావర్ణి
• మనువు పుత్రులు - సత్య ధర్మాదులు పదిమంది.
• భగవంతుని అవతారాలు - సూర్యునికి ధర్మసేతువనే పేర జన్మించి వైధృతునికి త్రైలోక్య సామ్రాజ్యాన్నిస్తాడు.
• సప్తర్షులు - అరుణాదులు
• ఇంద్రుడు - వైధృతుడు
• సురలు - విహంగమాదులు
భద్రసావర్ణి మన్వంతరము
• మనువు - భద్ర సావర్ణి
• మనువు పుత్రులు - దేవసుతాదులు
• భగవంతుని అవతారాలు - సత్య తాపసుడు - సత్యతపసునికి సూనృత యందు అవతరిస్తాడు.
• సప్తర్షులు - తపోమూర్త్యాదులు
• ఇంద్రుడు - ఋతధాముడు
• సురలు - పరితారులు
దేవసావర్ణి మన్వంతరము
మనువు - దేవసావర్ణి
• మనువు పుత్రులు - విచిత్ర సేనాదులు
• భగవంతుని అవతారాలు - దేవహోత్రునికి బృహతియందు దైవహోత్రుడు అనుపేర అవతరిస్తాడు. దివస్పతికి ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు.
• సప్తర్షులు - నిర్మోహ తత్వదర్శనాదులు
• ఇంద్రుడు - దివస్పతి
• సురలు - సుకర్మాదులు
ఇంద్రసావర్ణి మన్వంతరము
• మనువు - ఇంద్ర సావర్ణి
• మనువు పుత్రులు - గంభీరాదులు
• భగవంతుని అవతారాలు - సత్రాయణునకు బృహద్భానుడు అను పుత్రునిగా జన్మిస్తాడు.
• సప్తర్షులు - అగ్నిబాహ్యాదులు
• ఇంద్రుడు - శుచి
• సురలు - పవిత్రాదులు

--
kishore always with u....!


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML