కార్తీకే దేవయజనం సర్వభోగప్రదం భవేత్!
వ్యాధీనాం హరణం చైవ భవేత్ భూతగ్రహ క్షయః!!
కార్తిక మాసంలో దేవతలను పూజించినట్లయితే సర్వ భోగములు లభిస్తాయి. వ్యాధులు తొలగుతాయి. బాధించే భూతాలు, గ్రహాలు నశిస్తాయి.
వారాది దేవయజనం కార్తికే హి విశిష్యతే!!
కార్తికంలో ఏవారంలో ఏదేవతను పూజించాలో తెలుసుకొని ఆరాధించడం శ్రేష్ఠం.
కార్తికమాసంలో ఆదివారాలలో సూర్యారాధనమ్ ఆదిత్యహృదయస్తోత్ర పారాయణ ఆరోగ్యప్రదాలు. ఆదిత్యారాధనచేసి తైలాన్ని, నేతవస్త్రాలను దానం చేస్తే కుష్టు మొదలైన రోగాలు తొలగిపోతాయి. హరీతకి(కరక్కాయ), మిరియాలు, వస్త్రాలు, పాలు మొదలైనవి దానం చేస్తే క్షయాది రోగాలు నశిస్తాయి. దీపాన్ని ఆవాలను దానం చేస్తే అపస్మారం, మానసిక వ్యాధులు తొలగుతాయి.
కృత్తికా సోమవారేషు శివస్య యజనం నృణామ్!
మహాదారిద్ర్య శమనం సర్వ సంపత్కరం భవేత్!!(శివపురాణం)
కార్తిక సోమవారాలలో నియమంగా శివపూజ చేసినట్లయితే మహాదారిద్ర్యాలు తొలగుతాయి. అన్ని సంపదలు లభిస్తాయి. ఈరోజున గృహాన్నిగానీ, భూమినిగానీ, ఇంటిలో పనికివచ్చే సామగ్రిని దానం చేయడం మంచిది.
కార్తికమాసం మంగళవారాలలో కుమారస్వామిని పూజించడం మహిమాన్వితం. ఈరోజున సుబ్రహ్మణ్యారాధన చేసి దీపం, ఘంట మొదలైన వాటిని దానం చేయడం వలన శీఘ్రంగా వాక్సిద్ధి లభిస్తుంది.
కార్తిక బుధవారాలలో విష్ణ్వారాధన అభీష్ట సిద్ధినిస్తుంది. నారాయణుని పూజించి, పెరుగును నివేదించితే సంతానకరం. నివేదించిన పెరుగన్నాన్నిక్ దానం చేయడం కూడా సిద్ధిప్రదం.
కార్తిక గురువారాలలో గురువులను ఆరాధించడం శ్రేష్ఠం. శ్రీదక్షిణామూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ, సరస్వతీ దేవతలను గురుస్వరూపాలుగా తెలిసి ఆరాధించాలి. తేనె, సువర్ణం, నెయ్యి, ఈరోజున దానం చేస్తే భోగాలు వృద్ధిచెందుతాయి.
కార్తిక శుక్రవారాలలో గణపతిని పూజించడం ఫలవంతమైనది. ఆటంకాలను తొలగించి, ఐశ్వర్యాలను అందించే శక్తి ఈరోజున గణపతి ఆరాధనలో ఉంది. గణేశుని ఆరాధించి గంధపుష్పాలను, అన్నాన్ని దానం చేసేవారికి భోగాలు వృద్ధిచెందుతాయి. బంగారం, వెండి ఈరోజున దానం చేస్తే సత్సంతానం చేకూరుతుంది.
కార్తిక శనివారాలలో దిక్పాలకుల నామాలను స్మరించి నమస్కరించడం రోగహరణం, ఆరోగ్యకరం. దిక్పాలకులను, దిగ్గజాలను, నాగదేవతలను, ధన్వంతరిని, అశ్వనీదేవతలను పూజిస్తే రోగాలు, అపమృత్యువు తొలగుతాయి. వ్యాధులు తొందరగా శాంతిస్తాయి. ఈరోజున ఉప్పు, ఇనుము, నూనె, మినుములు, త్రికటుకాలు(శొంఠి, అల్లం, మిరియాలు), గంధం, జలం మొదలైనవి దానం చేయడం మంచిది.
No comments:
Post a Comment