కందళి.................
బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండంలో సాంసారిక జీవితానికి సంబంధించిన సందేశాన్ని ఇచ్చే కథ ఇది. పురాణాలలోనూ, ఇతిహాసాలలోనూ, దుర్వాసమహాముని అంటే తెలియని వారుండరు. మహాముని అయినప్పటికీ కోపానికి పెట్టింది పేరుగా దుర్వాసుడు ఉండేవాడు. అంతటి మహామునికి అంతకంటే గయ్యాళిగా ఉండే ఒక భార్య ప్రాప్తించిన సంఘటన ఒకసారి జరిగింది. ఒకసారి దుర్వాస మహార్షి గంధమాదన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ ప్రశాంత ప్రకృతిలో దైవసంకల్పానుసారంగా అప్సరసకాంత అయిన తిలోత్తమ సాహసి అనేవాడితో విహరించసాగింది. ఎదురుగా మునిని పెట్టుకుని ఏమాత్రం జంకు లేకుండా విహరిస్తున్న ఆ ఇద్దరినీ చూసి దుర్వాసుడికి కోపం వచ్చింది. వెంటనే ఆ ఇద్దరినీ రాక్షసులుగా జన్మించమని శపించాడు. ఆ శాపానుసారంగా సాహసి గార్ధభరూపంతో రాక్షసుడిగా జన్మించి శ్రీకృష్ణుడి చేతిలో హతమై మళ్లీ సాహసిగా మారాడు. తిలోత్తమ భూలోకంలో ఉష అనే పేరుతో జన్మించి శ్రీకృష్ణుడి కుమారుడైన అనిరుద్ధుడిని వివాహమాడి మరికొంత కాలానికి శాపవిముక్తిని పొంది స్వర్గానికి వెళ్లింది. అయితే సాహసి తిలోత్తమల శృంగార చేష్టలను కళ్ళారా చూసిన దుర్వాస మహామునికి మనసు చలించింది. వివాహంపై ఆలోచన కలిగింది. అదే సమయానికి ఔర్వుడు తన కుమార్తె అయిన కందళిని వెంటపెట్టుకుని దుర్వాసుడి దగ్గరకు వచ్చాడు. ఎంతో అందగత్తె అయిన కందళి దుర్వాసుడిని గురించి ఆ నోటా ఆ నోటా విని ఎలాగైనా అతడినే పెళ్లాడుతానని పట్టుబట్టి కూర్చుందని ఔర్వుడు దుర్వాసుడికి చెప్పాడు. అంతేకాక తన కుమార్తె ఎంతో అందగత్తె అని సుగుణాల రాశి అని వివరించి చెబుతూ ఆమెలో ఒకేఒక్క దుర్లక్షణం ఉందని ఎటువంటి మొహమాటం లేకుండా అప్పుడప్పుడు తీవ్రంగా దుర్భాషలాడుతుంటుందని చెప్పాడు. అయినా అంత అందం ఎంతో మంచి గుణాలు ఉన్నాయి కనుక దయతో తన కుమార్తెను పెళ్లాడమని ఔర్వుడు దుర్వాసుడిని బతిమలాడాడు. ఒకపక్క తిలోత్తమ, సాహసికుల శృంగార చేష్టల వల్ల కలిగిన మదనతాపం, ఎదురుగా అతిలోక సౌందర్యవతిగా ఉన్న కందళి, ఔర్వమహాముని వినయపూర్వక విజ్ఞప్తులు అన్నీ కలిసి దుర్వాసుడి మనస్సును కరిగించాయి. వెంటనే వివాహానికి ఒప్పుకున్నాడు. కానీ ఒక నియమం మాత్రం తాను పెడతానన్నాడు. కందళి నూరు దుర్భాషలు ఆడే వరకు మాత్రమే తాను సహించనున్నట్లు, అందుకు ఇష్టమైతే వివాహానికి తగిన ఏర్పాట్లను చేయమని దుర్వాసుడు చెప్పాడు. ఔర్వుడు అందుకు సంసిద్ధుడై వివాహం జరిపించాడు. ఆ నూతన వధూవరుల దాంపత్యం కొంతకాలం బాగానే గడిచింది. కందళిలో ఉన్న సద్గుణాలు ఆమె అందం దుర్వాసుడిని బాగా మురిపిస్తున్నా కందళి ఎప్పుడు పడితే అప్పుడు తనను ఎలా పడితే అలా దుర్భాషలాడే తీరు మాత్రం దుర్వాసుడికి నచ్చలేదు. నూరుసార్లు ఆమె అలా మాట్లాడగానే ఇక నిగ్రహించుకోలేకపోయాడు. ఒకరోజున కందళి తన సహజధోరణిలో దుర్వాసుడిని దూషించింది. దాంతో తీవ్రఆగ్రహానికి గురై అతడిచ్చిన శాపంతో ఆమె భస్మమైంది. ఆ తరువాత కానీ ఆమెకు తన తప్పేంటో తెలిసిరాలేదు. ఆత్మరూపంలో అప్పుడు కందళి తన భర్తను క్షమించమని వేడుకుంది. కానీ అప్పటికే చేయిదాటిపోయింది. మితిమీరిన కోపంతో తీవ్రంగా తన భార్యను శపించి భస్మం చేసినందుకు బాధపడుతూ దుర్వాసుడు మూర్చపోయాడు. కొద్ది సమయం తరువాత అక్కడికి ఒక విప్రుడు వచ్చి స్త్రీ వ్యామోహానికి గురై తపశ్శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్న దుర్వాసుడికి కర్తవ్య దీక్షను వివరించాడు. ఈ కథలో దుర్వాసుడంతటి ముని కామ వికారానికి గురయ్యాడు. సిగ్గువిడిచి ఆయన ఎదుట శృంగార చేష్టలు చేసిన సాహసి తిలోత్తమ శాపాలను పొందారు. అందుకే పెద్దల ముందు మహాత్ముల ముందు ఎవరూ అసభ్యంగా ప్రవర్తించకూడదనే నీతి కనిపిస్తుంది. అలాగే ముని అయినవాడు యోగనిష్టతో తపశ్శక్తి సాధనలో నిమగ్నం కావాలి కానీ కామ వికారానికిలోనై వివాహం చేసుకునే ఆలోచనకు త్వరపడి రాకూడదని ఎంత అందం, మరెన్ని మంచి గుణాలు ఉన్నా నోటి దురుసుతనం అయిన దానికీ కాని దానికీ అనవసరంగా భర్తను దుర్భాషలాడటం మంచిదికాదనే సందేశాన్ని కూడా ఈ కథ అందిస్తుంది.

ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

No comments:
Post a Comment