What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 28 August 2014

గజముఖుని తర్వాత పార్వతీ పరమేశ్వరులకు ఆరుముఖాలతో కుమారస్వామి జన్మించాడు

గజముఖుని తర్వాత పార్వతీ పరమేశ్వరులకు ఆరుముఖాలతో కుమారస్వామి జన్మించాడు. ఆరుముఖాలు కలవాడు కనుక షణ్ముఖుడనీ, కృత్తికా నక్షత్రంలో జన్మించాడు కనుక కార్తికేయుడనీ.., కుమారస్వామిని అంటారు. గజముఖుడు లంబోదరుడు, మరుగుజ్జువాడు. కుమారస్వామి మన్మధుని మించిన అందగాడు. ఒకసారి దేవతలు, మహర్షులు పరమేశ్వరుని సందర్శించి, సేవించి..ఇలా అడిగారు. ‘పరమేశ్వరా..., సర్వదేవగణాలకూ అధిపతిగా మహేంద్రుడు ఉన్నాడు. యక్షగణాలకు అధాపతిగా కుబేరుడు ఉన్నాడు. పక్షిగణాలకు అధిపతిగా గరుత్మంతుడు, పన్నగ గణాలకు అధిపతిగా వాసుకి ఉన్నారు. అలాగే ఋషిగణాలకూ, సిద్ధ, సాధ్య,కిన్నర, కింపురుష గణాలకూ అధిపతులున్నారు. ఇక ప్రమథ, పిశాచగణాలలకు అధిపతిగా సాక్షాత్తు తమరే ఉన్నారు. కానీ, విఘ్నగణాలకు నేటి వరకూ అధిపతి లేడు. కనుక తమ కుమారులలో ఎవరో ఒకరిని విఘ్నగణాలకు అధిపతిగా నియమించండి’ అని ప్రార్థించారు. విఘ్నగణాధిపత్యం విషయంలో గజముఖునికి, కుమారస్వామికి మధ్య గట్టి పోటీ ఏర్పడింది. అన్నయ్య మరుగుజ్జువాడు, అసమర్ధుడు కనుక విఘ్నగణాధిపత్యం తనకే కావాలన్నాడు కుమారస్వామి. నేనే జ్యేష్ఠకుమారుణ్ణి కనుక నాకే విఘ్నగణాధిపత్యం ఇవ్వాలి అన్నాడు గజముఖుడు. అప్పుడు శివుడు తన కుమారుల నద్దేశించి..., ‘మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదీజలాలలో స్నానమాచరించి ముందుగా నా దగ్గరకు వస్తారో వారే ఈ విఘ్నగణాధిపత్యం లభిస్తుంది’ అన్నాడు.

కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం మీద బయలుదేరాడు. గజముఖుడు నిస్సహాయుడై.., ‘తండ్రీ.. లంబోదరుడనూ, మందగమనుడనూ అయిన నేను ఈ పరీక్షలో విజయం సాధించడం కష్టసాధ్యం కనుక తరుణోపాయం మీరే చెప్పండి’ అని శివుని వేడుకున్నాడు. వినాయకుని వినయానికి సంతసించిన పరమశివుడు అతనికి నారాయణ మంత్రం ఉపదేశించాడు. నారములు అంటే జలములు. సృష్టిలోని జలములన్నీ నారాయణుని అధీనములు. ఇక సృష్టికి ప్రతిరూపాలు తల్లిదండ్రులు. ఈ రహస్యం తెలిసిన వినాయకుడు వెంటనే నారాయణ మంత్రం పఠిస్తూ తన తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు ముమ్మారు ప్రదక్షిణం చేసి, తండ్రి పక్కన కూర్చున్నాడు. ఆ మంత్ర ప్రభావాన వినాయకుడే తన కన్న ముందుగా మూడు కోట్ల యాభై లక్షల నదులలో స్నానమాచరించడం కుమారస్వామి చూసి ఆశ్చర్యపడి కైలాసానికి వచ్చాడు. అక్కడ తన తండ్రి ప్రక్కన కూర్చునివున్న వినాయకుని చూసి, తన అఙ్ఞానానికి పశ్చాత్తాపం చెంది, అన్నకు నమస్కరించి, ‘తండ్రీ.. అన్నగారి మహిమ తెలియక విఘ్నగణాధిపత్యం కావాలని అడిగాను, క్షమించండి. పరీక్షలో విజేత అయిన అన్నయ్యకే విఘ్నగణాధిపత్యం ఇవ్వండి’ అన్నాడు. ఆ రోజు వినాయకుని జన్మదినం. తన పుట్టిన రోజునాడే వినాయకుడు విఘ్నగణాధిపతిగా అభిషిక్తుడై సర్వలోక పూజితుడుగా అర్హతను సంపాదించుకున్నాడు. ఆనాటి నుండి వినాయకుని జన్మదినాన్ని ఓ పండుగలా ఆచరించడం మనకు సాంప్రదాయమైంది.

చంద్రునికి శాపం ఎప్పటిలాగే వినాయకుని జన్మదినమైన భాద్రపద శుద్ధ చవితి వచ్చింది. సర్వ ప్రాణికోటి వినాయకుని పూజించి, భక్తిగా కుడుములు, ఉండ్రాళ్లు మొదలైన పిండివంటలు, రకరకాల పండ్లు, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పిచారు. వినాయకుడు వాటన్నింటినీ తృప్తిగా ఆరగించి, కొన్ని తన వాహనమైన ఎలుకకు యిచ్చి, మరికొన్ని చేత ధరించి, సూర్యాస్తమయవేళకు కైలాసం చేరుకుని, తన తల్లిదండ్రులకు సాష్టాంగప్రణామం చేయబోయాడు. లంబోదరుడు కావడంచేత కాళ్లు నేలకానితే చేతులానక., చేతులు నేలకానితే కాళ్లానక వినాయకుడు ఇబ్బంది పడడం, శివుని శిరస్సునందున్న చంద్రుడు చూసి పరిహాసంగా పక్కుమని నవ్వాడు. అంతే.., చంద్రుని దృష్టి సోకి, ఉదరం పగిలి, ఉదరంలోని ఉండ్రాళ్లన్నీ నేలమీద దొర్లుతూండగా వినాయకుడు మరణించాడు. అది చూసి పార్వతి చంద్రుని వంక ఆగ్రహంగా చూస్తూ.. ‘పాపాత్ముడా.., నీ కౄరదృష్టి సోకి నా కుమారుడు మరణించాడు. కాబట్టి నేటినుంచి నిన్ను చూసినవారు ఎవరైనా, పాపాత్ములై, నీలాపనిందలు పొందుదురు గాక’ అని శపించింది. ఆ శాపానికి సమస్త ప్రాణికోటి తల్లడిల్లింది. అంతట దేవతలు, ఋషులు పార్వతిని ఉద్దేశించి ‘తల్లీ.., చంద్ర దర్శనం నిషిద్ధమైతే ఎలా? గ్రహణ సమయాల్లోనూ, పర్వదినాల్లోనూ చంద్ర దర్శనం తప్పనిసరి కదా. నీ శాపంవల్ల ముల్లోకాలకూ కీడు వాటిల్లుతుంది. కనుక మాయందు దయవుంచి నీ శాపాన్ని ఉపసంహరించుకో’ అని ప్రార్థించారు. ప్రసన్నురాలైన పార్వతి ‘వినాయకచవితినాడు తప్ప తక్కిన రోజులలో చంద్రుని చూసినా నీలాపనిందలు అంటవు’ అని తన శాపాన్ని సడలించింది. అంతట బ్రహ్మదేవుడు మరణించిన వినాయకుని బ్రతికించాడు. ఆనాటి వరకు తొలి పూజార్హతను కలిగివున్న శ్రీహరి, ఆ అర్హతను వినాయకునికి వరంగా అనుగ్రహించి, గతంలో తాను గజాసురునికి ఇచ్చిన వరానికి కార్యరూపం కల్పించాడు. నాటినుంచి వినాయకుడు సర్వ కార్యాల ముందు తొలిపూజలందుకుంటూ.., ఆదిపూజ్యుడుగా ప్రసిద్ధినొందాడు

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML