ఆధ్యాత్మికతకు దారిచూపే మార్గళివ్రతం
మాసానాం మార్ఘశీర్షోహాం- అని గీతలో భగవానుడు పేర్కొన్నాడు. భగవంతుని
చేరుకోవడానికి, అతని సాక్షాత్కారం పొందడానికి ఈ మాసం ఎంతో ఉపయుక్తమయినదని
పురాణాలు చెబుతున్నాయి. సర్వజనుల అభ్యుదయానికి దోహదకారి అవుతూ, సంపత్
సౌభాగ్యాలకు మార్గదర్శకంగా నిలుస్తుందీ మాసం. మానసిక బలంతో ఆధ్యాత్మిక
మార్గాన వికసించగల మన స్థైర్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
మృత్యుతత్వం నుంచి అమృత తత్వంవైపు, ఐహిక సుఖాలనుంచి పారమార్థిక తత్వంవైపు,
భగవంతుడివైపు పయనింపచేసే మాసమే ‘్ధనుర్మాసం’. లక్ష్మి అంశగా అవతరించి
జీవిని పరమాత్మతో అనుసంధింపచేయడానికి జన్మించిన తల్లి ‘ఆండాళ్’ లేక
గోదాదేవి. ఆ తల్లి తనని ఓ గోపికగా ఊహించుకుని ఈ వ్రతం సాగించింది. గోదాదేవి
తన వ్రతానికి అనువైన మాసంగా ఈ మాసాన్ని ఎంచుకుంది. భక్తిని మాలగా అల్లి
సువాసనా భరితమైన పుష్పాలతో ఆ భగవానుడిని సేవించి ముక్తిపొందవచ్చని గోదాదేవి
చేసిన తిరుప్పావై వ్రతం రుజువుచేసింది. ఇది ఇహలోక సంపదను,
భగవదైశ్వర్యాన్ని అందిస్తుంది. ఆ కారణంగానే ఆ తల్లి ఉపనిషత్తుల రహస్యాన్ని
నాలుగు వేదాల సారాన్ని, గీతామృత సారాన్ని తన తిరుప్పావై ప్రబంధంలో జోడించి
అందించింది. తిరుప్పావై ప్రబంధంలో మొత్తం 30 పాశురాలున్నాయి. ఇవన్నీ
భక్తుడు, భగవంతుని సులువుగా చేరడానికి ఉద్దేశించినవి. ధనుర్మాసంలో
వైష్ణవులు ఆచరించే మార్గశీర్ష స్నాన వ్రతం, కన్యలు ఆచరించే కాత్యాయనీ వ్రత
విధానాన్ని ‘తిరుప్పావై’ గ్రంథంలో ఆండాళ్ వివరించింది. తిరుప్పావై గ్రంథంలో
ఆండాళ్, తానొక ద్వాపరయుగ గోపికగా, కలియుగ గోదాదేవిగా ద్విపాత్రాభినయం చేసి
అద్వైతాన్ని దర్శించింది. మధుర గానంచేసి ‘పాడిక్కొడుత్తాళ్’గా భగవానుని
మెప్పించి శ్రీరంగనాధుని దేవేరి అయ్యింది. శ్రీవిల్లిపుత్తూరు ఆధ్యాత్మిక
సంపత్తిని, పాడి సమృద్ధిని ఉపమానాలతో తిరుప్పావైని దృశ్యకావ్యంగా మలచి
‘ఆండాళ్’గా ప్రసిద్ధిపొందింది. మార్గశిర మాసం మోక్ష కాలమని, పరమపద
సాధనానికి ఈ మాసం అనువైనదని శ్రీవైష్ణవ ధర్మాన్ని తెలిపిన ఆళ్వారులు, ఈ
మాసాన్ని ధనుర్మాసంగా ప్రత్యేకంగా భక్తితో ప్రవర్తనా విధానాన్ని
అనుసరించారు. దీనినే ‘మార్గళి’ వ్రతంగా గోదాదేవి అభివర్ణించి తిరుప్పావై
రూపంలో భగవానుడ్ని కీర్తించింది. ఈ మార్గశిర మాసంలోనే శ్రీకృష్ణపరమాత్మ
అర్జునునికి గీతోపదేశం చేశాడని, అర్జునికి విశ్వరూప దర్శనమిచ్చాడని పురాణాల
ద్వారా అవగతమవుతుంది. ఆ కారణంగా ఈ మాసం పరమాత్మ విశ్వరూప దర్శనానికి
అనువైన మాసంగా కొనియాడబడుతోంది. ఈ క్రమంలోనే గోదాదేవి రచించిన తిరప్పావై
పాశురాలను దేవాలయాల్లో పారాయణం చేయడం సంప్రదాయంగా వచ్చింది. ఇలా
పరమపవిత్రమైన మార్గశిర మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో మకర సంక్రాంతిని
జరుపుకుంటారు. భీష్ముడు వంటి మహాయోగులు సైతం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంకోసం వేచి
ఉండి తమ శరీరాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని చేరుకున్నట్లు పురాణాలు
చెబుతున్నాయి. ఆండాళ్ అమ్మవారు తాను ఈ వ్రతాన్ని ఆచరించి భగవత్ సాయుజ్యం
పొంది, మనం కూడా దానిని పొంది తరించాలని ప్రబంధరూపంగా ‘తిరుప్పావై’ని
అందించింది. మార్గశిర మాసాన్ని కృష్ణ సమాగమవాంఛను ఫలింపచేసిన కాలం కూడా
పురాణాలు చెబుతున్నాయి. సాక్షత్తు గోపికాస్ర్తిలు ఈ మాసంలోనే శ్రీకృష్ణ
భగవానుని ఆరాధించి, స్వామి కరుణకు పాత్రులయ్యారంటారు. ఈ వ్రతాన్ని ముప్పై
రోజులు ఆచరించలేనివారు, ఉత్తరాయణ పుణ్యకాలంలోనైనా శ్రీహరిపై మనస్సును
లగ్నంచేసి తిరుప్పావై పాశురాలను గానామృతం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ వ్రతాన్ని ఆచరించడానికి ధనధాన్యాలు అక్కర్లేదు. వజ్రవైడూర్యాలు,
ఐశ్వర్యాలు అవసరం లేదు. అయితే కావాల్సిందల్లా నిండైన భక్తి. భక్తి
విశ్వాసాలతో తమ హృదయాలనే పువ్వుగానో, పత్రంగానో చేసి భగవంతుడికి అర్పిస్తే
దయామయుడైన ఆ జగత్‌పతి సంతోషించి, ముక్తిమోక్షాలను అనుగ్రహిస్తాడు.
అంతేకాకుండా జగత్ కళ్యాణకారకుడైన ఆ శ్రీమన్నారాయణుడు తనను నమ్మిన భక్తుల్ని
ఆదరించి అక్కున చేర్చుకుంటాడు. భక్తుల అభీష్టాలను నెరవేర్చి, వారిని
ఆదుకుంటాడు.
ప్రపంచ అధునాతన సకలశాస్త్ర విఙ్నానానికి,అత్యున్నత సంస్క్రుతులకు, సంస్కారానికి , ప్రేమకి, దయకి, కరుణకి,అనురాగాకి, ఆప్యాయతకి,అభిమానానికి అత్యున్నత మానవ సంబంధములకు పుట్టినిల్లయిన దేశమున పుట్టినందుకు మనం గర్వపడాలి. telugubandhu.blogspot తెలుగు ప్రజల అతిపెద్ద ఆధ్యాత్మిక వెబ్ సైట్. అన్ని విషయాలు ఇందులో ఉంచబడినవి.
What's app 7093879327
గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com
. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
No comments:
Post a Comment