హిందూమతం
అనగానే స్వమతస్థులు, విమతస్థులు కూడా ముఖ్యంగా విమర్శించే విషయం, అర్థం
చేసుకోలేకపోయే విషయం ఇందులో అనేక పంథాలుండటం, చాలామంది దేవతలుండటం గూర్చి.
“ఏకం సత్ విప్రా బహుధావిదంతి” (1 – 164 – 46) అని, “ఏకం సన్తం బహుధా
కల్పయన్తి” (10 – 114 – 5) అని ఋగ్వేదం చెప్తోంది. అంటే ఒకే సత్
పదార్థాన్ని పండితులు అనేక విధాల చెప్తున్నారని అర్థం. ఆ ఒకే ఒక్క
సత్యపదార్థమే ఓంకారం. హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఆ ఓంకారంలోనే ఉంది. ఆ
మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వంలోని ఏకాత్మత అర్థమయి
సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు.
ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”.
మూలాన్ని గమనించకుండా చెట్టుకొమ్మలు, రెమ్మలు వేలాదిగా ఉండటం చూచి “అమ్మో!
ఇన్ని భేదాలే!” అని ఆందోళనపడటంలో అర్థం లేదు. అదంతా ఒకే చెట్టు. ఏ కొమ్మ
ఎక్కి అయినా కోసుకునేది ఒక ఫలమే. కనీస పరిఙ్ఞానం కలవారికొక్క విషయం
అర్థమౌతుంది. చెట్టు మూలం ఒకటే అయి, అన్ని కొమ్మల ఫలాలూ ఒకేరకంగా ఉంటే
తప్పకుండా అదంతా ఒకే చెట్టు అని గ్రహిస్తాం. కొమ్మల సమూహాన్ని బట్టి ఎన్నో
చెట్లు అనం. హిందూ మతం ఒక చెట్టు అనుకుంటే దాని మూలం ఓంకార రూప పరబ్రహ్మం.
ఫలం ఏ కొమ్మ నుండి కోసినా ముక్తి ఫలమే. కాబట్టి అదంతా ఒకే చెట్టు.
ఫలస్వరూపంగా అన్నిటినుండీ పొందగలది ముక్తియే. అయినా దానికి వాసనలు
గుబాళించే పుష్పాలు, నోరూరించే పచ్చికాయలు, పూతలు వంటివీ ఉంటాయి. అవే ఐహిక
ప్రయోజనాలన్నీ. ఏ దేవత నుండి అయినా మనం ఆశించేవి భుక్తి, ముక్తి అనేవే కదా!
ఆ వృక్షం అవ్యక్త పరబ్రహ్మమైతే దాని వ్యక్త రూపం ప్రణవం. దీనిని గూర్చి
విపులంగా గ్రహిస్తే తప్ప మనలో ఏర్పడే భేద భావాలు తొలగిపోవు.
No comments:
Post a Comment