What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Friday, 20 September 2013

భక్త తుకారాం

భక్త తుకారాం


తుకారాం ... పాండురంగడి భక్తుడు ... మహారాష్ట్రలోని దేహో గ్రామ నివాసి. 1608 - 1649 మధ్య కాలంలో జీవించిన తుకారం, పాండురంగడిని సేవించడమే తన జీవితానికి పరమార్థంగా భావించాడు. పాండురంగడి ఆదేశం మేరకు అనేక 'అభంగాలు' రచించి వాటిని ఆ స్వామికే అంకితం చేసిన పరమభక్త శిఖామణి. తనకున్న కొద్దిపాటి ఆస్తి పాస్తులను పాండురంగడి సేవకే ధారపోసిన తుకారాం, మానవసేవే మాధవ సేవగా భావించి భక్తి మార్గాన రాగ పరిమళాలు వెదజల్లాడు.

ఒక వైపున భార్యా బిడ్డలు ఆకలితో అలమటించి పోతున్నా, పాండురంగడి గురించి మాత్రమే ఆలోచించిన అనితర సాధ్యమైన భక్తి ప్రపత్తులు ఆయనలో కనిపిస్తాయి. పాండురంగడు ప్రసాదించినది మినహా వేరెవరు ఏది ఇచ్చినా స్వీకరించనంటూ, శివాజీ మహారాజు పంపిన కానుకలను సైతం తిప్పి పంపిన మహనీయుడు ఆయన. తనను అన్ని విధాలుగా పరీక్షించిన పాండురంగడిని, ఒకానొక సమయంలో తుకారాం నిరసించాడు. అలాంటి పరిస్థితుల్లోనే తుకారాంకి పాండురంగడు దర్శనమిచ్చాడు.

ఆ స్వామి ఆదేశం మేరకు ఆయన అభంగాలు రాయడం మొదలు పెట్టగా, ఆయన పనికి ఎలాంటి అంతరాయం కలగకుండా భార్య చూసుకుంది. తుకారం నిస్వార్థమైన భక్తికి మెచ్చిన పాండురంగడు, సశరీరంతో ఆయనను వైకుంఠానికి తీసుకువెళ్లాడు. అలా మహాభక్తుడైన ఆ వాగ్గేయకారుడి జీవితం చరితార్థమైంది. తుకారాం జీవితంలో దైవ లీలలకు సంబంధించిన ఎన్నో అపూర్వమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి. వాటి గురించి మున్ముందు తెలుసుకుందాం.
తుకారాంకి పాండురంగడి ధ్యాస తప్ప మరో ఆలోచన వుండేది కాదు. ఆ స్వామిపై అనేక అభంగాలను రచిస్తూ వాటిని పాడుకుంటూ పరవశించిపోయేవాడు. తనకి మంచి జరిగినా ... చెడు జరిగినా ఆ పాండురంగడి అనుగ్రహంగానే భావిస్తూ నిరంతరం ఆయన సేవలోనే కాలం గడిపేవాడు. అలాంటి తుకారాంకి ఒకసారి ఒక పరీక్ష ఎదురైంది.

తుకారాం పాండురంగడిపై అభంగాలను రాసి పాడుతుండటం ... అవి వింటూ ప్రజలు మైమరచి పోతుండటం, అగ్రవర్ణానికి చెందిన రామేశ్వరభట్టుకి అసూయ కలిగించింది. గ్రామ ప్రజలు తన కంటే తుకారాంనే ఎక్కువగా గౌరవించడాన్ని ఆయన సహించలేకపోయాడు. గ్రామస్తుల సమక్షంలో తుకారాంని దోషిగా నిలబెట్టి, తక్కువ కులంలో పుట్టిన ఆయనకి భగవంతునిపై భజనలు ... కీర్తనలు రాసే అర్హత లేదని చెప్పాడు. ఇక నుంచి ఆ అలవాటు మానుకోవడమే కాకుండా, అంతవరకూ రాసినవి ఇంద్రాణి నదిలో పారేయ్యాలని ఆదేశించాడు.

అది పాండురంగడు తన భక్తికి పెట్టిన పరీక్షగా భావించిన తుకారాం, తాను అభంగాలను రాసిన తాళపత్రాలపై నాపరాతి పలకలు పేర్చి వాటిని గుడ్డలో మూటగట్టి ఇంద్రాణి నదిలో ముంచేశాడు. తనకి ఎంతో ఇష్టమైన అభంగాలను వదిలేసినందుకు బాధతో ... భారమైన మనసుతో ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు నుంచి ఆయన నిద్రాహారాలను మానేశాడు. అలా ఓ 13 రోజులు గడిచిపోయాక తుకారాం ఇంద్రాణి నదిలో ఎక్కడైతే ఆ అభంగాలను ముంచాడో అక్కడే అవి పైకి తేలి గ్రామస్తులకు కనిపించాయి. అవి ప్రవాహానికి కొట్టుకుపోకుండా వుండటం చూసి అంతా ఆశ్చర్య పోయారు.

ఈ విషయం తుకారాంకి తెలియగానే ఆయన నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఆ తాళ పత్రాలు ఆయనున్న దిశగా కొట్టుకువచ్చి ఆగాయి. ఆ పాండురంగడికి తనపై దయ కలిగిందంటూ ఓ బిడ్డను దగ్గరికి తీసుకున్నట్టుగా ఆయన ఆ తాళపత్రాల మూటను ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ దైవలీలను చూసిన వారంతా ఆశ్చర్య చకితులయ్యారు. ఆ నోటా ఈ నోటా ఈ విషయం రామేశ్వర భట్టుకి తెలిసింది. అంతే ఆయన పరుగు పరుగునా వచ్చి తుకారాం పాదాలపై పడ్డాడు. అతని పట్ల అహంకారంతో వ్యవహరించినందుకు మన్నించమంటూ ప్రాధేయపడ్డాడు.

ఈ సంఘటన తరువాత తుకారాం విషయంలో గ్రామస్తుల ప్రవర్తనలో ఎంతో మార్పువచ్చింది. తుకారాం మాత్రం సాధారణమైన వ్యక్తిగా అతి సాధారణమైన జీవితాన్నే గడిపాడు ... ఆ పాండురంగడి సేవలోనే తరించాడు.



No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML