What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Wednesday, 10 April 2013

వికీలీక్స్‌ నిర్ధారణలు

వికీలీక్స్‌ నిర్ధారణలు

ఇందిరాగాంధీ హయాంలో జరిగిన కొన్ని పరిణామాలను గురించి, అమెరికా జోక్యం గురించీ తెలియజేసే రహస్య పత్రాలు వికీలీక్స్‌ ద్వారా వెలుగు చూస్తున్నాయి. ఇందులో విషయాలపై దుమారం రేగుతున్నా నిజానికి ఇవి కొత్తగా తెలిసినవేమీ కాదు. వికీలీక్స్‌ ద్వారా బయిటకు వస్తున్న పత్రాలు అమెరికా రాయబారులు దౌత్య నిపుణులు పంపినవే గనక అందులో అంశాలకు సాధికారిక విలువ వుంటుంది. అదే సమయంలో అవి అమెరికా కోణాన్ని ప్రయోజనాలనూ ప్రతిబింబిస్తాయనడంలో సందేహం లేదు. సోవియట్‌ విచ్చిన్నానికి ముందు దశలో ఒక విధంగానూ తదుపరి మరో విధంగానూ అమెరికా సామ్రాజ్యవాదులు ప్రపంచ వ్యవహారాలను శాసించేందుకు ప్రయత్నిస్తున్న రీత్యా వారి ప్రతినిధుల వర్తమానాలకు చాలా ప్రాధాన్యత వుంటుందనేది నిజమే. దేశ వ్యవహారాలలో అత్యంత శక్తివంతమైన నాయకురాలుగా దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు అధికారం చలాయించిన ఇందిరా గాంధీ పాలనా కాలంపైనా అనేక కథనాలున్నాయి. ఇప్పుడు జూలియస్‌ అసాంజే పుణ్యాన బయిటకు వచ్చిన వికీలీక్స్‌ భారత అమెరికా పాలక వర్గాల కొంతమంది వివాదాస్పద రాజకీయ వేత్తల అసలు స్వరూపాన్ని ఆవిష్కరించడం ఆసక్తికరం.

నాటి ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని బట్టి అమెరికాకు దీటైన శక్తిగా సోవియట్‌ వున్నప్పుడు భారత పాలకవర్గాలు రెండు శిబిరాల మధ్య పబ్బం గడుపుకోవడానికి అలీన విధానాన్ని అనుసరించాయి. పెంపొందుతున్న పెట్టుబడిదారీ దేశాధినేతలుగా వారి ప్రయోజనాలకూ అమెరికా వంటి అగ్ర దేశాలకూ మధ్య సహజంగానే వైరుధ్యం వుండింది. స్వాతంత్ర పోరాట వారసత్వంగా సంక్రమించిన శాంతి, స్వాతంత్ర విధానం వల్ల కూడా సామ్రాజ్యవాదులను నేరుగా బలపర్చే ప్రసక్తీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అలీన దేశాల కూటమిలో ముఖ్యపాత్ర వహించడం కూడా సహించలేని అమెరికా అనేక విధాల మన పట్ల కక్ష కట్టి వ్యవహరించింది. బంగ్లాదేశ్‌ యుద్ధ సమయంలో ఏకంగా నౌకాదళాన్నే తరలించేందుకు ప్రయత్నిస్తే సోవియట్‌ ఆదుకున్నది. అప్పటి నుంచి భారత సోవియట్‌ మైత్రి ప్రపంచ వ్యవహారాలలో కీలకాంశమైంది. అయితే మరో వైపున మన పాలకులు అమెరికాను అన్ని వేళలా వ్యతిరేకించారనీ, అభ్యుదయంగానే వున్నారనీ అనుకోవడం పొరబాటు. కుట్రలూ కుత్సితాలకు మారుపేరైన సిఐఎతో కూడా చేతులు కలిపిన సందర్బాలున్నాయి. కేరళలో మొదటి సారి నంబూద్రిపాద్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమెరికా తదితర దేశాలకు చాలా ఆందోళన పట్టుకుంది. అందుకే ఎన్నికల్లో కమ్యూనిస్టులను ఓడించేందుకు సిఐఎ నిధులు సమకూర్చిందని అమెరికా రాయబారి మొయిన్‌ హాన్‌ తన జ్ఞాపకాలలో రాశాడు.ఇటీవల మమతా బెనర్జీని కూడా అమెరికా నేతలు ఎంతగా అక్కున చేర్చుకున్నదీ విదితమే. వామపక్ష ప్రభుత్వం వుండగా పురులియాలో ఆయుధాలు జారవిడిచిన బ్రిటిష్‌ దేశస్తున్ని క్షమాభిక్షతో వదిలిపెట్టడం కూడా తెలిసిందే. అలాగే చైనాపై నిఘా వేసేందుకు గాను హిమాలయ శిఖరాలలో అణు పరికరం నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. తర్వాత అది కరిగిపోవడం కలవరం కలిగించింది. ఈ మధ్యన కూడా సోనియా గాంధీపై అమెరికా ప్రతినిధులు వత్తిడి తెచ్చారని వికీలీక్స్‌లో వెల్లడైన పత్రాలు చెబుతున్నాయి. ప్రపంచ పోలీసుగా భావించుకునే అమెరికా చొరబాటుకు ఇవన్నీ నిదర్శనాలు. కాగా సోషలిస్టు నాయకుడుగా అగ్గి బరాటాగా అమిత ప్రచారం పొందిన జార్జి ఫెర్నాండెజ్‌ కూడా సిఐఎ నిధుల కోసం అర్రులు జాచాడన్న సమాచారం మరింత కీలకమైంది. ప్రపంచ వ్యాపితంగా రకరకాల రూపాల్లో కమ్యూనిస్టు వ్యతిరేకులు సంచరిస్తుంటారని ఈ ఉదంతం వెల్లడిస్తుంది. అమెరికాను నిరంతరం ఖండిస్తూనే చేతులు కలిపేందుకు ఇందిరాగాంధీ యత్నించడం, ఆమెను వ్యతిరేకించే పేరిట ఫెర్నాండెజ్‌ వంటివారు ఆ దేశపు వత్తాసుకోసం ప్రయత్నించడం సూత్రరహిత రాజకీయాలకు తార్కాణాలు.
ఇక రాజీవ్‌, సంజరు గాంధీలు ఇందిర హయాంలోనే ఆయుధ కంపెనీల విమాన కంపెనీల దళారులుగా బేరసారాలలో తలదూర్చారన్న సమాచారం గాంధీ కుటుంబానికి మరింత అప్రతిష్టాకరమైంది. రాజీవ్‌ గాంధీ అయిష్టంగా రాజకీయాల్లోకి వచ్చాడంటున్న కథనాలు నిజం కాదని అంతకు ముందే తెరవెనక జరిగిన తతంగాలను బట్టి తేలిపోతుంది. సంజరు తర్వాత ఎమర్జన్సీ కాలంలో నేరుగానే రాజకీయాల్లో పెత్తనం చేసి విమర్శలు మూటకట్టుకున్నాడు. ఆ కుటుంబానికి మొదటి నుంచి అధికార వారసత్వంతో పాటు ఆర్థిక వ్యవహారాలలోనూ పాత్ర వుందనేది స్పష్టమవుతున్నది. ఇటీవల సోనియా అల్లుడు రాబర్ట్‌ వడేరాపై ఆరోపణలు వచ్చినపుడు కూడా వెలికి తీసిన అధికారులను శిక్షించారే తప్ప అతన్ని అంటుకున్న పాపాన పోలేదు.బిజెపి నేతలు ఈ వ్యవహారంపై చాలా గగ్గోలు చేస్తున్నారు గాని వారి హయాంలోనూ ఇలాటివే జరిగిన ఉదాహరణలున్నాయి. హవాలా ఆరోపణలూ వున్నాయి.ఏతావాతా ఇవన్నీ మన పాలక పార్టీల నేతల మేడిపండు స్వరూపానికి అద్దం పడుతున్నాయి. ఇలాటివాటి వల్ల ఆర్థిక నష్టంతో పాటు దేశ భద్రతకు సార్వభౌమత్వానికి కూడా ముప్పు రావచ్చన్నది అసలు సమస్య. ఇప్పుడు ఆ అమెరికాతోనే రక్షణ ఒడంబడికలు చేసుకుంటున్నప్పుడు తప్పక పరిశీలించాల్సిన అంశాలివి. అదే వికీలీక్స్‌లో విశేషం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML