అద్వైత సిద్ధాంత ప్రవక్త ఆదిశంకరులు
జగద్గురువు
శ్రీ శంకర భగవత్పాదుల వారి లీలామృతం అమోఘం. అఖండం. ఈ భూమీద ఉదయించిన
మహానీయులలో, మహాజ్ఞానులలో ఆదిశంకరాచార్యులవారు ఒకరు. ఆయన జన్మించిన రోజే
వైశాఖ శుద్ధ పంచమి. ఇది శంకర జయంతిగా ప్రసిద్ధి. కేరళ రాష్ట్రంలోని
త్రిచూర్ సమీపంలోని ‘కాలడి’గ్రామంలో శివగురు, ఆర్మాంబ దంపతులకు లేకలేక
కల్గిన సంతానం శంకరులు. ఆ దంపతులు పుత్రునికోసం ఎన్నో పూజలు చేశారు. శివుని
నిత్యం అర్చిస్తూ, శివుని కటాక్షానికి పాత్రులయ్యారు. శివుడే, ఆ దంపతులకు
బిడ్డగా జన్మించాడని, ఆయనే శంకరాచార్యుల వారని హిందువుల విశ్వాసం. ముప్పై
రెండేళ్ళకాలంలోనే అనల్పమైన అవతార కార్యం ముగించుకున్న అవతార పురుషుడు శ్రీ
శంకరాచార్యులవారు. అన్ని మతాల సారాంశం అద్వైతమని ప్రచారంచేసి లోకోద్ధరణ
చేసిన మహోన్నతుడు ఆదిశంకరులు. నామరూపాలు అశాశ్వతమనీ, ఆత్మ ఒక్కటే
శాశ్వతమని, అదే భగవత్ స్వరూపమని చాటిచెప్పిన మహనీయుడాయన. ఈ చరాచర సృష్టిలో
అనేక వస్తువులు ప్రాణులూ వున్నా వాటిని బంధించే మూలసూత్రం ఒక్కటేనన్న
సత్యాన్ని గ్రహించి అద్వైత సిద్ధాంతమనే పేరుతో మనలోని అజ్ఞాన పొరలను
తొలగించిన మహనీయుడాయన. హరిహరులకు భేదంలేదని చాటిచెప్పిన యోగి పుంగవుడాయన.
సాక్షాత్తు పరమశివుని అవతారంగా చెప్పబడ్తున్న శ్రీ ఆదిశంకరుల శక్తి అనన్య
సామాన్యమైంది.
గురుకుల సంప్రదాయం ప్రకారం
బ్రహ్మచారిగాఉంటూ భిక్షాటనంచేస్తూ శంకరులవారు ఒక రోజు ఓ పేద మహిళ ఇంటికి
వెళ్ళి భిక్షను అర్ధించారు. ఆ ఇంట్లో ఎండిన ఉసిరి కాయ తప్ప మరేదీ
లేకపోవడంతో ఆ ఇల్లాలు దానినే స్వామికి భిక్షగా వేసింది. ఆ మహాసాధ్వి
నిస్వార్థ దాన గుణానికి ఆశ్చర్య చకితుడైన శంకరులవారు ముగ్ధులై, అక్కడే
లక్ష్మీదేవి స్తోత్రం అశువుగా చెప్పారు. దాంతో శ్రీ మహాలక్ష్మి
ప్రసన్నురాలై ఆ మహిళ ఇంట్లో బంగారాన్ని వర్షింపచేసిందట. శ్రీ శంకరుల వారి
శక్తికి ఈ సంఘటన ఓ మచ్చుతునక. శంకరుడు తపసిద్ధినొందిన ప్రదేశం పాలధార,
పంచధారగా శ్రీశైలంలో ప్రసిద్ధి పొందింది. ఆదిశంకరాచార్యులవారు తన దేహాన్ని
విడిచిన చోటు కేదారనాథ్. హిమాలయ పర్వత సాణువుల్లో ఉన్న ఈ మహిమాన్విత
జ్యోతిర్లింగ క్షేత్రంలోనే ఆదిశంకరాచార్యులవారు పరమ పదించారని చెబుతారు.
ఇప్పటికే కేదారనాథ్‌లోని కేదారేశ్వరస్వామివారి ఆలయానికి నాలుగు పర్లాంగుల
దూరంలో ఆదిశంకరాచార్యులవారి సమాధి మందిరం ఉంది. అద్వైత సిద్ధాంతాన్ని
ప్రచారంచేసి లోకోద్ధరణ చేసిన మహనీయుడు శ్రీ శంకరాచార్యులవారు. ఆ గురుదేవుని
కృపాకటాక్షం అందరిమీదా వెల్లివిరియాలని ఆకాంక్షిద్దాం.

No comments:
Post a Comment