ప్రతిమారాధన వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం ::
ప్రతిమారాధన లేక భగవధారాధనలో ప్రతిమయందు భగవంతుని ఆవాహన చేసి ఆరాధిస్తాం. ప్రతి దేవతకు ఒక దివ్యాకృతి ఉంటుంది. ఋషులు దానిని దర్శించి వర్ణించారు. ఈ ప్రతిమలను యంత్ర, మంత్ర, హోమ విజ్ఞానంతో ప్రతిష్ఠించడం, జలాధివాస, ధాన్యాధివాస శయ్యాధివాస, క్షీరాధివాసాల వంటి ఆగమ ప్రక్రియలు జరపడం విగ్రహారాధనలో కనబడుతుంది. విగ్రహ నిర్మాణంలో, ప్రతిష్ఠలో శాస్త్ర పద్ధతులున్నాయి. విగ్రం లేక ప్రతిమలో మంత్రం ద్వారా, భావన ద్వారా దైవశక్తి ప్రవేశించి వ్యాపిస్తుంది. ద్రవ్యాలతో చేసే అర్చన భగవంతునికే చెందుతుంది. మంత్రంతో, అర్చనతో, భావనతో ప్రతిమకు సంక్రమించిన దివ్యత్వం దర్శించిన వారిని, ఆ పరిసరాలని, ప్రభావితం చేస్తుంది. ఆధ్యాత్మిక సాధనకు, జ్ఞానానికి ప్రతిబంధకాలైన పాపడి దోషాలను తొలగించడంలో విగ్రహార్చన ప్రధానంగా సహకరిస్తుంది. దుష్ఠ శక్తులను దూరం చేయడంలో కూదా శాస్త్రీయంగా నిర్మించబడిన విగ్రహం పని చేస్తుంది. బాహ్యారాధన వల్ల భావారాధన బలపడుతుంది. భావనతో, ధ్యానంతో, బాహ్య విషయాలను అనుభవిస్తూ, భగవంతుని తలచుకున్నా ఫలితం ఉంటుంది.
ప్రతిమారాధనలో బహు ప్రయోజనాలున్నాయి కనుకనే, లోతుగా ఆలోచించిన మహాత్ములు, జ్ఞానులు ఆ వ్యవస్థను నిలిపారు మరియు పటిష్టపరచారు. "ప్రతిమలో దేవుని ఆరాధించవచ్చు, కానీ ప్రతిమయే దేవుడు అనుకోరాదు" అని వివేకానంద వచనం. "భావములోనా బాహ్యమునందును" అని అన్నమయ్య మాట.
ఆరాధించబదిన ప్రతిమ నుండి ప్రసరించే సూక్ష్మ దివ్యశక్తి అనిర్వచనీయం, అధ్భుతం.
No comments:
Post a Comment