*అమ్మవారి ముఖాన్ని అష్టమి చంద్రుడితో ఎందుకు పోల్చుతారు ?*
*చంద్రుని యొక్క అష్టమ కళ ఏ తిధిన ఉంటుందో అది అష్టమి తిధి అనబడుతుంది.*
అష్టమిరోజున చంద్రుడు సమంగా ఉంటాడు. అంటే అర్ధచంద్రుడు. అగ్నిపురాణంలో అర్ధచంద్రాకారమైన నొసటి ప్రదేశంతో ప్రకాశించే పరమేశ్వరి అని చెప్పబడింది.
*చంద్రుడికి పదహారు కళలున్నాయి. పాడ్యమి దగ్గరనుంచి పూర్ణిమ వరకు తిథులు పదిహేను. పదహారవకళ సాక్షాత్తూ సచ్చిదానందస్వరూపిణి అయి ఉన్నది.*
చంద్రుని యొక్క పదహారుకళలు సూర్యునిలో దాగి ఉంటాయి. శుద్ధ పాడ్యమి అంటే అమావాస్య తరువాత పాడ్యమి నుంచి ప్రతిరోజు ఒక కళ సూర్యుడి నుంచి వచ్చి చంద్రునిలో ప్రవేశిస్తుంది. ఆరకంగా పదిహేను కళలు వచ్చి చంద్రునిలో చేరిన రోజును పూర్ణిమ అంటారు.
ఆ తరువాత ప్రతిరోజూ ఒక్కొక్క కళ చంద్రుని నుంచి విడిపోయి సూర్యునిలో చేరిపోతుంది. ఈ రకంగా పదిహేను కళలు చంద్రుని వదలి వెళ్ళిపోయిన రోజును అమావాస్య అంటారు. ఆ రోజు చంద్రుడు కళావిహీనుడు.
ఇవే శుక్ల కృష్ణ పక్షాలు. ఈ రెండింటిలోనూ కూడా అష్టమి నాడు చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు. అందుచేతనే అష్టమి చంద్రుణ్ణి సమచంద్రుడు అంటారు. ఇతడే అర్ధచంద్రుడు.
తిథులు నిత్యాస్వరూపాలు. నిత్యలు కళాస్వరూపాలు. నిత్యలు మొత్తం పదహారు. వీటిని గురించి వసిష్టసంహితలో వివరించబడింది.
ఈ నిత్యల గురించి వామకేశ్వరతంత్రంలోని ఖడ్గమాలలో కూడా చెప్పబడింది.
*కామేశ్వరి, భగమాలినీ, నిత్యక్లిన్న భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి,శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలినీ, విచిత్ర, మహానిత్య* ఇవి పదహారునిత్యలు.
ఈ నిత్యలు కళల రూపంలో తిరుగుతుండటం చేతనే చంద్రుడికి వృద్ధి క్షయాలు కలుగుతున్నాయి. శుక్ల కృష్ణ పక్షాలయందున్న తిధులు-నిత్యలు ఈ దిగువ ఇవ్వబడ్డాయి.
1. *పాడ్యమి*
కామేశ్వరి - చిత్ర
2. *విదియ*
భగమాలిని - జ్వాలామాలిని
3. *తదియ*
నిత్యక్షిన్న - సర్వమంగళ
4. *చవితి*
భేరుండ - విజయ
5. *పంచమి*
వహ్నివాసిని - నీలపతాక
6. *షష్టి*
మహావజ్రేశ్వరి - నిత్య
7. *సప్తమి*
శివదూతి - కులసుందరి
8. *అష్టమి*
*త్వరిత - త్వరిత*
9. *నవమి*
కులసుందరి - శివదూతి
10. *దశమి*
నిత్య - మహావజ్రేేశ్వరి
11. *ఏకాదశి*
నీలపతాక - వహ్నివాసిని
12. *ద్వాదశి*
విజయ - భేరుండా
13. *త్రయోదశి*
సర్వమంగళ - నిత్యకిన్న
14. *చతుర్దశి*
జ్వాలామాలిని - భగమాలిని
15. *పూర్ణిమ*
చిత్ర - కామేశ్వరి
చంద్రుని యొక్క కళలు ఈ రకంగా మారినప్పుడు తిథి ఒకటే అయినప్పటికీ శుక్ల కృష్ణ పక్షాలలో *నిత్యాదేవతలు* వేరుగా ఉంటాయి. ఆ విషయం పైన పట్టిక చూస్తే తెలుస్తుంది.
కాని, రెండు పక్షాల యందు అష్టమినాడు మాత్రం *"త్వరిత"* అనబడే నిత్యాదేవతయే ఉంటుంది. దాన్నే *త్వరితాకళ* అని కూడా అంటారు. అనగా ఎటువంటి మార్పు లేనివాడు అష్టమినాటి చంద్రుడు. అందుచేతనే, *అష్టమినాటి చంద్రునితో దేవి ముఖాన్ని పోల్చటం జరిగింది.*
గుండ్రని ముఖానికి పైన కిరీటము పెట్టటంచేత, దేవి యొక్క లలాటము అర్థచంద్రాకారంగా అష్టమినాటి చంద్రునిలాగా కనిపిస్తుంది.
*శ్రీ మాత్రే నమః*
🙏
No comments:
Post a Comment