What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 23 November 2014

ముండకోపనిషత్తు ఏ వేదంలో ఉంది? ముండకోపనిషత్తు అథర్వణ వేదంలో ఉంది.



ముండకోపనిషత్తు

ముండకోపనిషత్తు ఏ వేదంలో ఉంది?

ముండకోపనిషత్తు అథర్వణ వేదంలో ఉంది.



ముండకోపనిషత్తు అనే పేరు ఎందుకు వచ్చింది?

ముండనం అంటే శిరసుపై జుట్టును తొలగించుట అని అర్థం. ముండనం చేయించుకోవడం ద్వారా, అన్ని కోరికలను పరిత్యజించి, మోక్షప్రాప్తికి ప్రయత్నం ప్రారంభించడం, దీని కొరకు సన్న్యాసాన్ని స్వీకరించడం అనేది సంకేత రూపంలో తెలుప బడింది. అటువంటి మోక్షేచ్చ కలవారికి ఉపదేశాన్ని అందించే ఉపనిషత్తు గనుక ముండకోపనిషత్తు అని పేరు వచ్చింది.

ఈ ఉపనిషత్తులో ఎన్ని మంత్రాలున్నాయి? ఎన్ని అధ్యాయాలుగా ఉన్నాయి?

ఈ ఉపనిషత్తులో 64 మంత్రాలు మూడు అధ్యాలుగా ఉన్నాయి.

ఈ ఉపనిషత్తులో శౌనకమహర్షి అడిగిన ప్రశ్న ఏమిటి?

"దేనిని తెలుసుకుంటే సమస్తమూ అవగతమవుతాయో, అది ఏమిటి?"

పైన ప్రస్తావించబడిన ప్రశ్నకు అంగిరస మహర్షి ఇచ్చిన సమాధానం ఏమిటి?

"పరబ్రహ్మమును అనుభూతిపూర్వకంగా తెలుసుకుంటే, సమస్తమూ అవగతమవుతాయి".

ఈ ఉపనిషత్తులో వివరింపబడిన సృష్టిక్రమం ఏమిటి?

అక్షర పరబ్రహ్మమే మూలకారణమని (material cause), దానినుండే నామరూపాత్మకమైన ఆవిర్భావించినదని (effect), మళ్ళీ అందులోనే లయం అవుతుందని, అది ఇంద్రియ గోచరము కాదని,సృష్టిక్రమాన్ని వివరిస్తుంది.

సద్గురువునాశ్రయించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలని ఉపదేశించి, ఉత్తమ గురువు లక్షణాలను కూడా ఈ ఉపనిషత్తు వర్ణిస్తుంది.

విద్యలు ఎన్ని రకాలు? అవి ఏమిటి?

విద్యలు రెండు రకాలు - అపరా విద్య (lower knowledge), పరా విద్య(higher knowledge). వేద వేదాంగాలు అపరావిద్యే! అందులో నిర్దేశించిన రీతిలో సాధన చేసి బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుంటే ఆ అనుభవమే పరావిద్య. కేవలం పుస్తక పరిజ్ఞానానికి ఉపనిషత్తులు ప్రాధాన్యం ఇయ్యవు.

యజ్ఞ యాగాదులు (ఇష్టములు), పుణ్య కార్యాలు (పూర్తములు) చెయ్యడం వలన ఏమి పొందగాల్గుతారు? ఏమి పొందలేరు?

యజ్ఞ యాగాదులు, పుణ్యకార్యాలు చెయ్యడం వలన పుణ్యాన్ని సంపాదించుకొని, దాని ద్వారా, ఈ లోకంలో అఖండమైన కీర్తిని, భోగభాగ్యాలను, పరలోకంలో స్వర్గాది సుఖాలను పొందగల్గుతారు. కాని వీటి ద్వారా మోక్షాన్ని పొందలేరు.

మోక్షం దేనివలన లభిస్తుంది?

ధ్యానమార్గం ద్వారానే మోక్షం లభిస్తుంది.

జన్మ రాహిత్యం లేక మోక్షం అంటే ఏమిటి?

జీవునికి సూక్ష్మ శరీరం ఉంటుంది. దీనినే లింగ శరీరం అని కూడా అంటారు. జీవుడు చేసే ప్రతి కర్మకూ, కర్మఫలం ఉంటుంది. అది పుణ్య రూపంలోనో, పాపరూపంలోనో ఉంటుంది. కర్మఫలాన్ని ఈ జన్మలో కొంత అనుభవించడం జరుగుతుంది. మిగిలిన కర్మఫలాన్ని అనుభవించడానికి ఇంకా కొన్ని జన్మలను ధరించవలసి వస్తుంది. ఆ జన్మలలో మరల క్రొత్త కర్మ ఫలాన్ని సేకరించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా జీవుడు జన్మ పరంపరలో చిక్కుకొని ఉంటాడు.

చివరకు ఏదో ఒక జన్మలో ధ్యాన మార్గాన్ని ఆశ్రయించి పరబ్రహ్మను గూర్చి తెలుసుకోవడం ప్రారంభించవచ్చు. అపుడు కర్మ ఫలం క్షీణించడం ప్రారంభమవుతుంది . మొత్తం కర్మఫలం క్షయమైనప్పుడు ఇంక జన్మ ఉండదు. దీనినే జన్మ రాహిత్యం, లేక మోక్షం అంటారు.

ఆత్మను ఎవరు ప్రకాశింప జేస్తున్నారు?

ఆత్మ స్వయం ప్రకాశకుడు అని ఈ ఉపనిషత్తు ఉద్ఘోషిస్తుంది.

సూర్యుడు స్వయంప్రకాశకుడు, ఆయన కాంతి చంద్రుని మీద వ్యాపించి చంద్రుడు ప్రకాశిస్తున్నాడని మనం అనుకుంటున్నాం (కారణం ఇది మన కంటికి కనిపిస్తుంది గనుక). కాని మన చర్మ చక్షువుకు గోచరం కాని అసలు సత్యం దీనికి విరుద్ధమైనదని మనం తెలుసుకోవాలి. బ్రహ్మమొక్కడే స్వయంప్రకాశకుడు. ఆయన శక్తితోనే నక్షత్రాలతో సహా ఈ గోళాలన్నీ ప్రకాశావంతమవుతున్నాయి. మనం దేవతా మూర్తులుగా భావించే ఈ గోళాలకే స్వయంప్రకాశకత్వం లేనప్పుడు అగ్నికి స్వయం ప్రకాశం ఎక్కడ? అన్నింటినీ చైతన్యవంతం చేసేది భాసింపజేసేది బ్రహ్మమే అని తాత్పర్యం. ఈ మంత్రం కఠొపనిషత్తులోను, శ్వెతాశ్వతరోపనిషత్తు లోనూ కూడా ఉంది.

ఆత్మా సాక్షాత్కారం ఎవనికి సాధ్యం?

సాధన చేసే వానికే ఆత్మసాక్షాత్కారం సాధ్యము.

ఆత్మ సాక్షాత్కారం బలహీనునికి, ఐహిక వాంఛలలో ఉండే వానికి సాధ్యం కాదు (ప్రమాదం ఇదే). విద్వాంసుడై ఉండి నిరంతర సాధన చేసే వ్యక్తికి మాత్రమే ఇది సాధ్యం అవుతుంది.

జీవాత్మ పరమాత్మలను వర్ణించిన మంత్రం ఏది?

ఆ మంత్రం ఇది:

ద్వా సుపర్ణా సయుజా సఖాయా

సమానం వృక్షం పరిషస్వజాతే

తయోరన్యః పిప్పలం స్వాద్వత్తి

అనశ్నన్నన్యో అభిచాకశీతి (3.1.1)

ఎంతో అన్యోన్యంగా ఉండే రెండు పక్షులు ఒకే చెట్టుమీద కూర్చున్నాయి. అందులో ఒకటి పళ్ళని ఆస్వాదిస్తూంది. రెండవది నిర్లిప్తంగా చూస్తుంది. ఈ రెండు పక్షులు జీవాత్మ పరమాత్మలకు ప్రతీకలు. చెట్టు శరీరానికి ప్రతీక. జీవాత్మ కర్మ ఫలాలను అనుభవిస్తుంది. దీనికి భిన్నుడు పరమాత్మ. ఆయన నిష్క్రియుడు. కర్మలను చెయ్యడం గాని, అనుభవించడం గాని ఆయనకు ఉండదు. ఆయన స్సాక్షి మాత్రమే. ప్రసిద్ధమైన ఈ మంత్రం ఈ తత్వానికి రూపకల్పన చేసింది.

ఆత్మజ్ఞానం సిద్ధించినపుడు ఏమి జరుగుతుంది?

ఆత్మజ్ఞానం సిద్ధించినపుడు కోరికలు, సంశయాలు నశిస్తాయి.

ఆత్మసాక్షాత్కారం అయిన వ్యక్తికి కోరికలు, సంశయాలు, కర్మలు నశిస్తాయి. తన స్వస్వరూపం తెలుసుకున్న వాని స్తితిని ఈ మంత్రం హృద్యంగా వర్ణిస్తుంది.

అజ్ఞానుల పరిస్థితి ఏమిటి?

విద్యాగర్వంతో విర్రవీగడం అజ్ఞానుల ప్రధాన లక్షణం.

తాము బ్రహ్మజ్ఞానులమనుకొని విర్రవీగే మూర్ఖులు ఒక గ్రుడ్డి వానిచే తీసుకొని వెళ్ళబడే ఇంకొక గ్రుడ్డివాడు చిక్కుల్లో పడినట్లుగా జరామరణాలతో కూడిన జననమరణ వలయంలో తిరుగుతూ ఉంటారు.

భారత ప్రభుత్వ అధికార ముద్రలో ఉన్న 'సత్యమేవ జయతే' అనే వచనం ఎక్కడిది? పూర్తి వాక్యాన్ని, దాని అర్థాన్ని వివరించండి.

ఈ వచనం ముండకోపనిషత్తులోనిది. వివరాలు ఇవి

సత్యమేవ జయతే నానృతం

సత్యేన పంథా వితతో దేవయానః (3.1.6)

సత్యమే గెలుస్తుంది. అసత్యం ఎప్పటికీ గెలవదు. సత్యవ్రతాన్ని నిష్ఠతో అనుష్టించిన వారు దేవయానంతో ప్రయాణించి పునర్జన్మ రహితమైన సత్యలోకం చేరుకుంటారు. ఈ ఉపనిషత్తులోని 'సత్యమేవజయతే' అనే ఈ సూక్తి భారత ప్రభుత్వ అధికార ముద్రలో ఉండడం భారతజాతి గర్వించదగిన విషయం.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML