What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Thursday, 29 October 2015

ఆదిశంకరులు ఈ భువిపై జీవించినది కేవలం 32 సంవత్సరాలే.



ఆదిశంకరులు ఈ భువిపై జీవించినది కేవలం 32 సంవత్సరాలే. అయినా ఎన్నో వేల సంవత్సరాలకు సరిపడా ఆధ్యాత్మిక సంపదను ప్రపంచానికి అందించి చిరస్మరణీయులయ్యారు. ఒకవైపు బౌద్ధమత వ్యాప్తి, మరొకవైపు శైవులు, వైష్ణవులు తాము గొప్పంటే తాము గొప్పని వాదించుకునే రోజుల్లో ఆదిశంకరులు ఈ నేలపై అవతరించారు. పుట్టింది కేరళ రాష్ట్రంలోని కాలడి గ్రామంలో. ఆసేతు హిమాచలం మూడుసార్లు పర్యటించి, తన బోధలతో ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. భారతదేశంలో శైవులు, వైష్ణవులతో పాటు శాక్తేయులు, గాణాపత్యులు, సూర్యోపాసకులు సైతం ఉండేవారు. వారు ప్రాంతాలవారీగా చీలిపోయి ఒకరిని ఒకరు దూషించుకుంటూ, కొట్లాడుకొంటూ కాలాన్ని వృథాపరచడం చూసి శంకరులు తీవ్రంగా వ్యధ చెందారు.
ఆ తరుణంలోనే శంకరాచార్యులు అద్వైతమతాన్ని స్థాపించారు. అహం బ్రహ్మాస్మి, తత్వమసి సిద్ధాంత భావజాలం వ్యాప్తిచేసి, తనలో ఉన్న దైవాన్ని ముందు దర్శించి, ఎదుటివారిలోనూ దైవాన్ని దర్శించి తరించమనే బోధతో పలువురిని ఆకట్టుకున్నారు. పరమశివుడు, మహావిష్ణువు వేరు కాదు. వివిధ రూపాల్లో కనిపించినా ఇరువురూ ఒక్కరే అని చాటిచెప్పి, 'శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే' అని ప్రబో ధించారు. అజ్ఞానాన్ని పారదోలి వివేకవంతులను చేశారు. సూర్యుణ్ని, గణపతిని, అమ్మవారిని, పరమశివుణ్ని, మహావిష్ణువును ఆరాధ్యదేవతలుగా, ఇష్టదైవాలుగా నమ్మి పూజించే ఎవరినీ నిరాశపరచకుండా, ఏ దైవాన్నీ ద్వేషించకుండా అందర్నీ ఒక పీఠంపైనే కూర్చోబెట్టి పూజ చేయవచ్చని నచ్చజెప్పి పంచాయతన పూజను ప్రోత్సహించారు.


పంచాయతన పూజలో ఇష్టదైవాన్ని పీఠంపై మధ్య భాగాన ప్రతిష్ఠించి పూజిస్తారు. ఉదాహరణకు శ్రీ మహావిష్ణువు ప్రీతి అయినవారు విష్ణువును మధ్యలో ఉంచి మిగతా నాలుగు మూలలా అంబికను, పరమశివుని, సూర్యనారాయణమూర్తిని, గణపతిని ప్రతిష్ఠించి, పూజించమని బోధించారు. శివుడు ఆరాధ్యదైవమైతే మధ్యలో శివుణ్ని, అలాగే గణపతి, అంబిక, సూర్యుణ్ని కూడా ఉంచి పూజించవచ్చని తెలియజేసి అందర్నీ శాంతింపజేశారు. ఆదిశంకరులు దూరదృష్టితో ఈ పంచాయతన పూజను ప్రోత్సహించారు. ఏ దేవతను పూజించినా భక్తి ప్రధానమని, నదులన్నీ చివరకు సాగరాన్ని చేరినట్లు మనం చేసే పూజలూ ఇష్టదైవానికే చెంది భగవంతుడు అందరినీ అనుగ్రహిస్తాడని చెప్పి పలువురి కనులు తెరిపించి జగద్గురువులుగా ప్రసిద్దిచెందారు.

ఆది శంకరాచార్యులు ఉపనిషత్తులకు భాష్యం చెప్పడమే కాకుండా పలు దేవతాస్తోత్రాలు రచించారు. తన వాక్చాతుర్యంతో మేధస్సుతో, పెక్కుమంది పండితులతో వాదించి వారిని ఓడించి శిష్యులను చేసుకున్నారు. అద్వైత మతాన్ని దేశవ్యాప్తంచేసి, హిందూ ధర్మాన్ని నిలబెట్టి భారతీయులకు, ఈ విశ్వానికి ఎనలేని సేవ చేశారు. దేశంలో ఎన్నో దేవాలయాలను పునరుద్ధరింపజేసి, పూజాదికాలు సక్రమంగా జరిగేటట్లు ఏర్పాట్లు చేశారు. శివానందలహరి, సౌందర్యలహరి, భజగోవిందం వంటి మహద్గ్రంథాలను లోకాలకు అందించారు.

ఆది శంకరులు దూరదృష్టితో ఆలోచించి దేశం నలుమూలలా నాలుగు పీఠాలను ఏర్పాటు చేసి, హిందూధర్మం శాశ్వతంగా నిలిచేటట్లు చేశారు. దేశంలో నాలుగు దిక్కులా- ఉత్తరాన హిమాలయాల దగ్గర బదరీనాథ్‌లో, పశ్చిమాన ద్వారకలో, తూర్పున పూరీజగన్నాథ్‌లో, దక్షిణాదిన శృంగేరిలో పీఠాలు నెలకొల్పారు. తన ముఖ్య శిష్యులను పీఠాధిపతులు చేశారు. మానవాళి ధర్మపథంలో నడవడానికి మార్గదర్శకులుగా వ్యవహరించారు. ఇది మానవాళి తరించడానికి ఆదిశంకరులు పెట్టిన భిక్ష!

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML