సత్పురుషుల సహవాసం చేయండి - శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం నుండి
సత్పురుషుల సహవాసం చేయండి - శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం నుండి
ఆదిశంకర భగవత్పాదులు ఈ దేశంలో జన్మించినటువంటి మహోత్కృష్టమైన దార్శనికులు.
ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని అవతార స్వరూపం. ఒక కాలంలో మనదేశంలో ధర్మం
క్షీణించిపోయిన సమయంలో దేవతల ప్రార్థన మేరకు ఆ పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల
రూపంలో అవతారం చేయడం జరిగింది. ఆయన కేరళ దేశంలో కాలడి అనే గ్రామంలో
అవతరించారు. కేవలం చిరు వయస్సులోనే సకల వేద శాస్త్రములను ఆపోశన
పట్టారు.ఎనిమిది సంవత్సరముల వయస్సులో సన్యాసం తీసుకున్నారు. పదహారు
సంవత్సరముల లోపల అనేక గ్రంధాలను వ్రాశారు. 32 వయస్సులో యావద్భారతంలోనూ
మూడుమార్లు సంచరించి జనులకు ధర్మ ప్రబోధం చేసి అపారమైన లోకోపకారం చేశారు.
అటువంటి వ్యక్తిత్వమును అన్యత్ర ఎక్కడా మనం చూడలేము. అందువలననే ఆయనను మనం
పరమ ఆరాధ్యుడిగా, పరమ పూజ్యుడిగా సేవించుకుంటున్నాము. ఆయనయొక్క పవిత్ర
నామాన్ని అత్యంత భక్తితో ఉచ్చరిస్తున్నాము. అందరినీ భగవంతుడి యొక్క కృపా
పాత్రులను చేయడానికి ఆయన కృషి చేశారు.
ఆయన ఒక చోట ఇలా చెప్పారు- "నాయనలారా! మొట్టమొదట మీయొక్క అహంకారాన్ని దూరం చేసుకోండి.
"మా కురు ధన జన యౌవన గర్వం" మనిషికి అహంకారం అనేది అనేక కారణాల నుంచి
వస్తుంది. కొంతమందికి తాను గొప్ప శ్రీమంతుడను అని, కొంతమందికి తాను
పండితుడను అని, కొంతమందికి తాను మహాబలశాలి అని, అహంకారం. ఈ అహంకారం వచ్చిన
వాడు రావణాసురుని వలె తప్పుడు పనులు చేస్తాడు. సీతాపహరణమనే మహాపరాధం
చేశాడు. ఎంతోమంది రావణాసురుడికి బుద్ధి చెప్పారు. మాతామహులు మాల్యవంతుడు
కూడా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు. పెడచెవిని పెట్టాడు. చివరికి
సర్వనాశనం అయ్యాడు. ఆరంభంలోనే వివేకం తెచ్చుకొని అథవా పెద్ద వాళ్ళు చెప్పిన
మాటలు విని ఆపని చేయకుండా ఉన్నట్లయితే పరిస్థితి వేరుగా ఉండేది.
వీటన్నిటికీ మూల కారణం అహంకారం. అహంకారం మనిషి పతనానికి కారణం. దానిని దూరం
చేసుకోవాలి. భగవంతునికి ఇష్టమైన వాడు ఎవరు అంటే అహంకారం ఇసుమంతైనా
లేనివాడు.
తృణాదపి సునీచేనా తరోరపి సహిష్ణునా
అమానినా మానదేన కీర్తనేయః సదా హరిః!!
ఎవరైతే లవణేశం కూడా అహంకారం లేకుండా ఉంటాడో, ఎవరైతే సదా ఓర్పుతో ఉంటాడో,
వాడు భగవంతునికి ఇష్టమైన వాడు. అందుకే భగవత్పాదులు మనకు చెప్పిన మొట్టమొదటి
మాట "మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వం" నువ్వు వేటిని
చూసి అయితే అహంకార పడుతున్నావో అవి శాశ్వతం కాదు. శాశ్వతమైనది ఒక్కటే
భగవదనుగ్రహం. భగవదనుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాడి జీవనం ఉత్తమంగా, పవిత్రంగా
ఉంటుంది. కేవలం మనయొక్క ఐశ్వర్యం, పాండిత్యం, బలాన్ని నమ్ముకొని
విచ్చలవిడిగా ప్రవర్తిస్తే మన పతనానికి కారణం అవుతుంది.
నువ్వు
ఎల్లప్పుడూ కూడా సత్పురుషుల సహవాసంలో ఉండు అన్నారు భగవత్పాదులు. ఎవరైతే
ఎదుటివారి మంచిని కోరతారో, స్వప్నంలో కూడా ఎదుటి వారికి చెడు తలపెట్టరో,
ఎదుటి వానిలో మంచిని మాత్రమె చూస్తారో వారే సత్పురుషులు. "నేయం సజ్జన సంగే
చిత్తం" అన్నారు భగవత్పాదులు. "గేయం గీతా నామ సహస్రం" భగవంతుని నామాన్ని
జపించు. ఆయన ముఖారవిందం నుంచి వెలువడిన భగవద్గీతను పారాయణ చేయి. మన
జీవితంలో సమయం అమూల్యమైనది. సమయం పొతే తిరిగిరాదు. సమయాన్ని వ్యర్ధం చేయకు.
మానవ జన్మ అపురూపమైనది. ధర్మానుష్టానానికి అనువైన జన్మ. దీనిని వ్యర్ధ
పరచుకోకు అన్నారు భగవత్పాదులు. వాక్కు భగవన్నామోచ్చారణకు ఉపయోగించు.
నీకున్న సకల ఇంద్రియములను భగవత్సేవలో వినియోగించు. ఇహంలోనూ పరంలోనూ
సుఖపడతావు.
" ఆత్మైవహ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః" నీ
మిత్రుడవైనా శత్రువువైనా నీవే. సన్మార్గములో వెళ్లావు అంటే నీకు నీవు
మిత్రుడివి. తప్పుదారిలో వెళ్ళావంటే నీకు నీవు శత్రువువి. కాబట్టి ఎప్పుడూ
నీకు నీవు శత్రువువి కావద్దు. నీకు నీవు మిత్రుడివి కా. సరియైన దారిలో
వెళ్ళావంటే ఎన్నటికీ చ్యుతి అనేది రాదు. ఇహంలోనూ పరంలోనూ సుఖం లభిస్తుంది.
ఎప్పుడు తప్పటడుగులు వేశామో సకల అనర్ధాలు కలుగుతాయి. తప్పుదారి అంటే
అధర్మాన్ని ఆచరించడం. ఇటువంటి ఉపదేశములను ఆదిశంకరుల వారు మనకు విశేషంగా
చేశారు. వాటిని మనం మననం చేయాలి. అదేవిధంగా ఆచరణ చేయాలి. ఈవిధమైన
మహోపదేశాన్ని చేసి లోకానికి మహోపకారం చేసిన ఆదిశంకరులు సదా స్మరణీయులు,
వందనీయులు, పరమ ఆరాధనీయులు. ఈ ధర్మప్రభోధం ఎల్లప్పుడూ జరగాలి అనే
ఉద్దేశ్యంతో నాలుగు పీఠాలు స్థాపించారు.ఇక్కడ ఉండే పీఠాధిపతులు దేశసంచారం
చేస్తూ, లోకానికి ధర్మ ప్రబోధం చేస్తూ, అందరికీ ఆశీర్వాదం చేస్తూ శారదా
చంద్ర మౌళీశ్వరులను ఆరాధించి తద్వారా లోకక్షేమాన్ని కోరుతూ ఉండాలి అని
ఆజ్ఞాపించారు
No comments:
Post a Comment