వైశాఖ శుద్ద తదియ - అక్షయ తృతీయా / తదియ 𝕝𝕝卐𝕝𝕝_*
*≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*
*_అక్షయ తృతీయా విశిష్టత_*
*━❀꧁ 🔆 ꧂❀━*
వైశాఖ శుద్ద తదియ నాడు ఈ పండుగను ఆచరిస్తారు. వైశాఖ శుక్లపక్ష తదియ కృతయుగానికి ప్రారంభమని విష్ణు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ అక్షయ తదియ నాడు రోహిణి నక్షత్రముంటే మరింత పుణ్యప్రదమని చెబుతారు. ఈరోజు చేసేటటువంటి హోమం, దానం, పితృదేవతలకు చేసే పూజ అక్షయమవుతుంది గనుక ఇది "అక్షయ తదియ" అనబడింది. శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఎంతో పవిత్రమైన ఈ రోజున ఏ కార్యాన్నైనా మొదలు పెడితే అది అక్షయంగా ఉంటూ వృద్ది చెందుతుంది. ఈ అక్షయ తదియ బుధవారం లేదా సోమవారం నాడు వస్తే మరీ విశేషం గా చెప్పబడింది.
కొన్ని ప్రాంతాలలో గౌరీదేవీకి డోలోత్సవం, కృష్ణునికి డోలోత్సవం చేస్తారు. ముత్తైదువులు, కన్యలు ఈ పూజలో పాల్గొంటారు. పూజ అయ్యాక పండ్లు, తీపి పదార్దాలు నాన వేసిన సెనగలను వాయనమిస్తారు. ఈ రోజు అక్షయ తదియ వ్రతాన్ని చేసుకొనే వారు ఉప్పును మానేసి చక్కర కలిపిన పేలపిండిని భుజిస్తారు. బదరీనారాయణ మందిర ద్వారము ఈ రోజే తెరుస్తారు. ఇంతవరకు అక్కడ మంచు పేరుకుని ఉంటుంది. పరశురాముని జయంతి కూడా ఈరోజు జరుపుకొంటారు. ధనానికి మూలంగా చెప్పే కుబేరుడికి ధనాధిపతిగా శివుని యొక్క అనుగ్రహం వరం లభించిన రోజు. శివుడు అన్నపూర్ణ దేవి దగ్గర గుప్త రూపం లో బిక్ష స్వీకరించిన రోజు కూడా ఈ రోజే అని చెప్పబడింది.
ఈరోజు చేసే మంచి పనులు కోట్ల రెట్ల ఫలితం ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని ఈ రోజే వ్రాయడం మొదలు పెట్టాడు, దీనివలన అక్షయమైన పురాణ జ్ఞానాన్ని ఈరోజుకీ పొందగలుగుతున్నాం. శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఈరోజే అక్షయ పాత్రని అనుగ్రహించిన రోజు. కుచేలుడు శ్రీ కృష్ణునికి అటుకులు సమర్పించి అంతులేని సంపదను పొందగలిగాడు.
బంగారు వెండి ని కొనాలాని ఎక్కడ కుడా శాస్త్రవచనం లేదు. ఈరోజు చేయవలసిన మంచిపనులు దానాలు గురించే ప్రస్తావించబడింది. భగవంతున్ని ఆశ్రయించి మంచి పనులు చేసేవారికి, అలాగే వారికున్నదానిలో నలుగురి మంచి కోరి ఒకరికి సహాయం చేసే వారికి బీదవారికి తమ చేతనైన సహాయం చేసేవారికి భగవంతుని కృపతో అంతకి కోటి రెట్ల రూపంలో మనకి చేరుతుందని తెలుస్తుంది.
కృతయుగానికి ఆది అయిన ఈ రోజు ఉదయాన్నే స్నానాదులు ఆచరించాలి. సూర్యోదయం ముందు నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్య ఫలం లభిస్తుంది. ఆ తర్వాత ఉదక ఘటమును అనగా నీటికుండను వేసవిలో పండే పంటలు, యవలు, గోధుమలు, సెనగలు మొదలైనవి మరియు పెరుగు అన్నం దానం చేయాలి. అలా చేస్తే శివ సాయుజ్యం లభిస్తుందని భవిష్య పురాణం, దేవీపురాణం తెలియజేస్తున్నాయి. శ్రీ మహావిష్ణువికి చందనం లేపనం చేయడం వల్ల ,నారాయణ మందిర వాసం లభిస్తుందని చెబుతారు. సింహాచల క్షేత్రం లో స్వామి వారికి సంవత్సరానికి ఒకసారి చందనం పూత పూసి అలంకరిస్తారు. మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ నాడు మటుకే చందనం తీసి మళ్ళీ అలంకరిస్తారు. ఈ రోజు పితరులకు పిండరహితమైన శ్రాద్ధమును చేయాలి. ఈ వైశాఖ శుక్లతదియ రోజున గొడుగు, పాదరక్షలు, గోవ, భూమి, బంగారం, వస్త్రములు, నీటితో నిండిన కుండను దానమివ్వడం మహా పుణ్యమని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.
ఈ రోజు సూర్య చంద్రులిద్దరు తేజోవంతంగా ఉంటారు కావున దానాలుకు చాలా మంచి సమయమని చెప్పవచ్చు అలాగే ఈ రోజు ప్రతి ఘడియ కుడా ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయడం వలన అనంత ఫలం పొందగలం.
తులసి ఆకులతో విష్ణుసహస్రనామ పారాయణ చేయడం అనంత పుణ్య ఫలం లభిస్తుంది.
గోధుమలు దానం చేస్తే ఇంద్రుడు యొక్క అనుకూలత తో వర్షాలు చక్కగా కురిసి అన్నాదులకు లోటు కలగదు.
పానకం వడపప్పు మామిడి పళ్ళు శ్రీ మహా విష్ణువుకి నివేదించడం మంచిది. మామిడి పళ్ళు విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.
గోధుమలు, నెయ్యి, ఉప్పు, పండ్లు, కూరగాయలు, చింతపండు కూడా దానం చేసినట్లైతే వారికి అన్ని విధాల మంచి ఫలితాలు కలుగుతాయి.
కంచు గిన్నెలో నీటిని పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, తులసి, వక్క, దక్షిణతో సహా దానమిస్తే గయాలో శ్రాద్ధ చేసిన ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కావాలనుకొనే వారు, పితృ శాపాలు ఉన్న వారు చేస్తేమంచి ఫలితం లభిస్తుంది.
ముఖ్యంగా ఈరోజు చెట్లని నాటడం అనంత ఫలాన్నిస్తుంది, ఎప్పటికి తరిగిపోని పచ్చదనం భూమిపై పెరుగుతుంది. ప్రకృతిని పూజించి ఔషద మొక్కలను ఈ రోజు నాటి నట్లైతే అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అందుబాటులో ఉంటాయని ప్రతీతి.
*అక్షయ తృతీయ. దాని ప్రాముఖ్యత*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
కేవలం దాన ధర్మాలకు, ఆధ్యాతిక చింతనకు, సేవా దృక్పథానికి ప్రత్యేకత కలిగినదే అక్షయ తృతీయ. రోగులకు సేవ, పేదలకు అన్నదానం, గోవులు, పశు పక్ష్యాదులకు దాణా, తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి. బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఏర్పాటుచేయడం ఎంతో పుణ్యఫలం. దైవ పూజ - వ్రతం, మంత్ర సాధన చేస్తూ భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక సందేశాలు వినడం ఉత్తమం. ఓ రెండు ముద్దలు పక్షులకు పెడితే పితరులకు, యముడు, శని, కాలభైరవునికి పెట్టినట్టే. ఈ పుణ్యకార్యాల వల్ల భవిష్యత్తు బంగారంగా మారుతుంది. అక్షయ తృతీయనాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేకరెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి.
అంతేగాని…
బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు. అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు అత్యంత ధనవంతులయ్యే దానికి వాళ్ళు అల్లిన కృత్రిమ ప్రచారం.
*అక్షయతృతీయ శుభాకాంక్షలు*

No comments:
Post a Comment