What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Sunday, 19 April 2026

మహానంది


*కర్నూలు జిల్లా*


*మహానంది -2* 


*'చెక్కిలి చుక్క’*


ఈ ఆలయం నిర్మింపబడిన పరిసరాలలోని ప్రకృతి దృశ్యాలను బట్టి యాత్రీకులకు మహానంది యాత్రాస్థలమే కాకుండా విహార యాత్రాస్థలము అవుతోంది. కొండల చేరికవల్లా ఏటికి ఏడాది పొడవునా ఎడతెగక గుడి చుట్టూ పారే నీటి బుగ్గల చలవ వల్ల నిసర్గసిద్ధమైన ఏకాంత పావనత్వం వల్లా ఈప్రదేశం యాత్రికుల

ను సర్వకాలాలలోనూ ఆకర్షిస్తూనే వుంటుంది. నల్లమల కొండల ప్రకృతి సౌందర్యానికి యీ ప్రదేశాన్ని 'చెక్కిలి చుక్క' అంటారు. ఈ ఆలయ తీర్థం తన ఔషధీ గుణంచేత ప్రసిద్ధికెక్కింది. ఈ ధాతు జలం ఏడాది పొడుగునా కవోష్టంగానే ఉంటుంది. 


ప్రధాన తీర్థం ఆలయ ముఖమంటపం ముందు వుంది. ఇది అరవై అడుగుల చదరపు తొట్టె! మధ్యలో ఒక మంటపం ఉంటుంది. యాత్రికులు మునగడానికి వీలుగా ఎప్పుడూ అయిదు అడుగుల లోతు నీరు వుండేటట్లు యీ తొట్టి యొక్క జలనిస్పరణ, ప్రసరణ మార్గములు అమర్చబడి ఉన్నాయి. ఈ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియదు. తొట్టెలోనికి నీటి పారుదల కనిపిస్తుందే కాని సరిగ్గా తూములు ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఈ తీర్థంలోకి నీరు అయిదు బుగ్గల్లో నుంచి వస్తోంది. వాటిని శ్రీశైలధార, సరసింహధార, దైవేదినీ తీర్థం, నంది తీర్థము, కైలాస తీర్థమని పిలుస్తారు. స్ఫటిక నిర్మలమైన ఈ నీరు ఎప్పుడూ కవోష్ణమై (గోరువెచ్చని) ఉంటుంది.


లింగాకారమై ఉన్న ఇచ్చటి మూలవిరాట్టు భారతదేశంలోని ఇతర లింగాలకంటే విలక్షణమై అసదృశమై వుంది. ఇది రెండు చోట్ల సొట్టలు పడిన పుట్టుశిల! కాని వైష్ణవులకు కూడా ప్రతిపత్తి విషయములైన సాలగ్రామములతో కూడి యున్నందువల్ల యీ లింగము యొక్క మహిమ అమేయమని భావించబడుతోంది. శ్రీశైలంలో మాదిరిగానే లింగం ఇక్కడ కూడా పీఠత్రయ విరహితయై భూమికి ఉపరితలం మీదనే కానవస్తుంది. అక్కడ మాదిరిగానే ఇక్కడా స్వామి ని అందరూ ముట్టుకోవచ్చును. మనసారా, చేతులారా పూజించుకోవచ్చును.

📖


ప్రస్తుతం ఈ విధమైన లింగాకారాన్ని గూర్చి ఇచ్చటి స్థలపురాణంలో నచ్చిక కలిగించే గాధ ఒకటి ఇలా ఉన్నది. పూర్వం నవనంది మండలాన్ని సందుడనే మహారాజు ఏలుతున్నాడు. మహానంది ఆ నవనంది మండలంలో చేరికయై ఉంది. ఆ మహారాజునకు ఒక తలంపు కలిగింది. స్వామి విగ్రహానికి తైలాభ్యంజనం చేసి పాలతో అభిషేకం చెయ్యాలని! ఎక్కడెక్కడి ఆవుల మందలను రప్పించాడు. గోపవరం అనే పల్లె నుండి వచ్చిన మందలో ఒక కట్టి ఆవు ఉంది. ఆ రాజుచేసే అభిషేకంలో ఎక్కువగా ఆ కట్టి ఆవుపాలే ఎక్కువగా ఉపయోగపడేవి. ఆ ఆవు అడవులలో స్వేచ్ఛగా తిరుగుతూ మేస్తూండేది. కొన్నాళ్ళకు అది అడవిలో చాలాసేపు కనపడకుండా వుండటం చాలా పర్యాయాలు గమనించారు. అభిషేకంలో వినియోగపడే దాని పాలు క్రమంగా తరిగిపోవటం గమనించారు. ఇలా పాలెందుకు తరిగిపోతున్నాయో గమనించడానికి ఒకనాడు గొల్లవాడు ఆవు వెంట అడవికి వెళ్లాడు. ఒక చీమల పుట్ట చుట్టూ తిరుగుతూ ఆవు మేయడం గమనించాడు. కొంచెంసేపటికి ఆవు పుట్టమీద నిలబడింది. ధారగా పాలు పుట్టలోనికి కారుతున్నాయి. చివరికి కృష్ణుని రూపంలో వున్న ఒక శిశువు చీమల పుట్టలో నుంచి పైకి తొంగి చూచి ఆవుకు దర్శనమిచ్చాడు. తరువాత నెమ్మదిగా ఆవు మందలోకి వచ్చింది. గొల్లడు ఈ సంగతి రాజుతో చెప్పాడు. తన విశ్వాసాన్ని పరీక్షించడానికి పరమేశ్వరుడే అలా శిశువు రూపంలో వచ్చాడని రాజు సూటిగా ఊహించాడు. 


మరునాడు రాజు కూడా ఆవు వెంట అడవికి వెళ్ళి ఒక దట్టమయిన పొదలో దాగి ధ్యాన నిమగ్నుడై పరమేశ్వరుని దర్శనక్షణం కోసం ఎదురుచూస్తూ వున్నాడు. ఆవు పుట్టను సమీపించి చుట్టూ తిరిగి భక్తి నిశ్చలయై నిలబడి వుంది. పరమేశ్వరుడు శిశువుగా కనబడి ఆవు పాలు ఆరగించాడు. అద్భుతాక్రాంతుడైన రాజు రాట్రిల్లడంలో ఎండుటాకులు మరమరలాడాయి. ఆ సవ్వడికి మనసు చెదరి ఆవు బెదరి భయ భ్రాంతమై పుట్టను గిట్టలతో మట్టగించింది. శిశువు అదృశ్యమైపోయినాడు. పుట్ట మట్టి తేమగా వున్నందువల్ల ఆవు గిట్టల అచ్చు దానిమీద అత్తుకుంది. తలవని తలంపుగా జరిగిన యీ దైవాపచారానికి రాజు భయపడి పరమేశ్వరుణ్ణి క్షమించమని ప్రార్థించాడు. రాజు ప్రార్థనకు సంతుష్టుడై ఆవు మట్టగించిన ఆ చీమల పుట్ట తేమ ఆరి తనంతట మహానంది వద్ద స్వయం భూలింగమై వెలిసేటట్లు పరమేశ్వరుడు సంకల్పించాడు. అందువల్లనే గిట్టల రెండు గుర్తులూ మహానంది లింగంమీద నేటికీ కనిపిస్తాయి.

📖


ఆలయం ముందు పెద్ద నంది వున్నది. బహుశః యీ ప్రదేశానికి 'మహానంది' అనే వాడుక ఆ నంది వల్లనే వచ్చి వుంటుంది. ఆలయం వెనుక వున్న చెరువును 'రుద్రగుండం' అంటారు. అచ్చట విష్ణు గుండమనీ, బ్రహ్మగుండమనీ ఇంకా రెండు చెరువులున్నాయి.


ప్రధానాలయం ప్రక్కన అమ్మవారి ఆలయం వుంది. అమ్మవారి ముందున్న శ్రీ చక్రం ఆదిశంకరులు ప్రతిష్ఠించినదంటారు. అమ్మవారి కన్నుల ఎదుట ఏకనాగ్రంగా పరమేశ్వరుణ్ణి ధ్యానించినవారికి వారి సంస్కారానుభూతమై దర్శనం కలుగుతుందని యిచ్చటి జనప్రచురమైన విశ్వాసం. అమ్మవారి ముందున్న ముఖమంటపం ఇటీవల భైరవ జ్యోస్యుల మహానందయ్యగారు కట్టించినది.


ప్రధానాలయం వెనుక మూడు చిన్న గుడులు వున్నాయి. ఒక్కొక్క లింగంలో ఈ మూడు లింగాలను ఆరాధించినట్లయితే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు అతీతమైన స్థితి సిద్ధిస్తుందని ప్రసిద్ధి.


మహానందికి చుట్టూ పదిమైళ్ళ వలయంలో తొమ్మిది నంది అలయములున్నాయి. వాటి పేర్లివి: 1) పద్మనంది. 2) నాగనంది, 3) వినాయక నంది, 4) గరుడనంది, 5) బ్రహ్మనంది, 6) సూర్యనంది, 7) విష్ణునంది, 8) సోమనంది 9) శివనంది. 


నిజానికి ఇది 'నంద్యాల' అనే నంద్యాలయము నకు తద్భవ రూపమే.


ఇచ్చటి ఉత్సవాలలో శివరాత్రి చాలా ముఖ్యమైన ఉత్సవం. శ్రీశైలానికి వచ్చే యాత్రీకులందరూ సామాన్యంగా యిచ్చటికే వస్తారు. కార్తీక మాసం లో శ్రద్ధాన్వితులైన యాత్రికులు ఉషఃకాలంలో ప్రప్రథమంగా మల్లికార్జున స్వామిని సేవించి యిచ్చటికి రెండు మైళ్ళ దూరంలో వున్న పద్మ నందిని సేవించి యిచ్చటికి రెండు మైళ్ళ దూరం లో పడమరగా ఉన్న నాగనందిని సేవించి చేరువనే ఉన్న బ్రహ్మనందినీ, సోమనందినీ, శివనందినీ సేవించుకొని, అచ్చటికి ఈశాన్యంగా మూడు మైళ్ళలో వున్న విష్ణునందిని సేవించి యాత్ర ముగిస్తారు. ఈ నవనందుల సేవ సూర్యుడస్తమించేలోగా పూర్తిచేసుకోవాలని సంప్రదాయజ్ఞులంటారు.

📖


ఈ ప్రదేశం 'నవనంది'గా మారటానికి జన ప్రసిద్ధములైన గాథలు రెండు ఉన్నాయి. ఒకటి కృతయుగంలో పర్వతుడనే మహర్షికి ఇద్దరు కొడుకులు. శిలాదుడని, నంది అని. పెద్దవాడైన శిలాదుడు తన తీవ్ర తపశ్చర్యవల్లనే పేరు పొందాడు. ఏమంటే ఆయన రాళ్ళు తిని తపస్సు చేశాడు. ఆ విధమైన తపస్సుకు సంతుష్టుడై పరమేశ్వరుడు శిలాదుణ్ణి ఒక పుణ్య పర్వతంగా చేసి దానిమీద నివసించటం మొదలుపెట్టాడు. ఒక శ్రేణిలో సుప్రసిద్ధమైన శ్రీశైలం అదే! 


అదే రీతిగా రెండవ కుమారుడు నంది కూడ పరమేశ్వరుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. శివుడియనను నందిగా మార్చి తనకు వాహనం గా చేసుకొన్నాడు. నంది తపస్సు చేసిన ప్రదేశం లోని భాగమే యిఫ్ఫటి మహానంది ఉన్న ప్రదేశం.


 రెండవ గాథ- ఈ ప్రదేశాన్ని క్రీ.శ.11వ శతాబ్దంలో నందవంశపు రాజులు పరిపాలించారు. వారు తమ కులదైవమైన నందికి అనేకాలయాలు నిర్మించి ఆరాధించారు. ఇచ్చటి నంది ఆలయాలు విజయనగర రాజులతోసహా అనేక రాజవంశాల ఆదరణను పొందాయి.


ఇచ్చట యాత్రికులకు మంచి వసతులున్నాయి. మహానంది యాత్రాస్థలమేకాక ప్రకృతి రమణీయ స్థలం కూడా కావటమే దీనికి కారణం. ఇచ్చటి ప్రధానోత్సవం శివరాత్రి. దసరా, ఉగాదులకు కూడా యిచ్చట ఉత్సవాలు జరుగుతాయి. ఈ దేవాలయం దూర, సమీప ప్రాంత జనాలను సమానంగా ఆకర్షిస్తుంది. దేశకాలముల అలజళ్ళకు చలించని దృఢవిశ్వాసానికి ప్రతీకగా మహానంది నిలిచి ఉంది.


మౌన విలీనమైన అభివ్యక్తితో చక్రనేమిక్రమప్రాప్త ములైన మానవజాతి యొక్క పతనాభ్యుదయ ములకు సాక్షియై మహానంది ప్రణవానుసంధానం చేస్తున్నట్లు వుంటుంది.

🛕

*సశేషం*


No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML