What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .

Saturday, 12 March 2016

చేరమాన్‌ పెరుమాళ్‌ నాయనారు-(శివభక్తులు) చరిత్రలు



చేరమాన్‌ పెరుమాళ్‌ నాయనారు-(శివభక్తులు) చరిత్రలు

ఇప్పటి కేరళ రాష్ట్రమయిన మలైనాడులో చేరమాన్‌ పెరుమాళ్‌నాయనారు కోడున్‌కోలూరులో (మలైనాడు రాజధాని. మహోదయం అనిపేరు గూడా వుంది) - ఉత్తియన్‌ కుటుంబము కొత్తయార్ల రాజ వంశములో జన్మించాడు. చేర వంశస్తులందరికి చేరమాను అనునది సాధారణ నామము. పట్టాభిషిక్తుడైన తర్వాత పెరుమాళ్‌ అని పిలిచేవారు. అసలు పేరు - పెరుమ్‌ -మ-కొత్తయారు. మంచి సంస్కారవంతుడు. బాల్యము నుంచి దైవభక్తి తత్పరతతో నుండెడివాడు. వయస్సు పెరిగిన కొలది దైవభక్తి గూడ పెరుగుతూ వచ్చింది. విచక్షన, నిష్పక్షపాతము ఆయనలో మూర్తీభవించాయి. పరిపాలకుడుగా నుండాలన్న ఇచ్చ ఆయనకు లేనేలేదు. అందుకని వయస్సురాగానే సన్యసించి తిరువంజక్కళముకు చేరి అచ్చట శివపూజాదురంధరుడై యుండెను. దేశాన్ని సెన్‌గోల్‌ పోరయాను (చెంగప్పరుడు) పరిపాలించేవాడు. ఆయన గూడ నిత్యానిత్య వివేకము నెరిగి మోక్షమునకై ప్రపంచ సంబంధాల నుండి వైదొలగి వెళ్ళిపోయాడు. ఆయనకు సంతతి లేదు. సింహాసనం ఖాళీగా వుంది. అందుకని ప్రజలు తిరువంజక్కళమునకు వెళ్ళి పెరుమ్‌-మ-కొత్తయారును సింహాసనమధిష్టించి రాజ్యాన్ని కాపాడమని అర్థించాడు. తన దైవ ఉపాసనకు అడ్డంకియని ముందర రాజ్యమధిష్టించుటకు అంగీకరించలేదు. కాని దైవాజ్ఞ - అతను పరిపాలకడుకావాలని. దేవాలయమునకు వెళ్ళి దేవుని ప్రార్థించాడు. పరమాత్మ అతనిని రాజువుకమ్మని ఆదేశించాడు. నీవు రాజువయితే ప్రజలు నిన్ను అనుసరిస్తారు. రాజువై నీవు శైవాగమమును వ్యాపింపజేయవచ్చును. అందుకని రాజువుకా అని పరమాత్మ ఆదేశించాడు. దైవాజ్ఞ మూలాన సింహాసన మధిష్ఠించి న్యాయవంతముగా పరిపాలన చేశాడు. ఆయనకు అన్ని భాషలు, చివరకు పక్షుల భాష గూడ తెలుసును. దేవుడు అష్టైశ్వర్యాలు, బలం, రాజవాహనాలు అన్ని ఆయనకు ప్రసాదించాడు.

పట్టాభిషిక్తుడై పిదప దేవాలయమునకు వెళ్ళి అర్చించి తిరిగి వస్తుంటే ఒక చాకలివాడు దేహమంతా విభూతితో కనిపించాడు. ఆ దృశ్యము చేరమానుకు సాక్షాత్తు పరమశివుని చూస్తున్నట్లు అనిపించింది. అందుకని ఏనుగుదిగి చాకలిని అతను వారిస్తున్నా వినకుండా మ్రొక్కాడు. చేరమాను యొక్క అనితర భక్తి అందరకు గోచరమైంది.

చేరమాను పవిత్ర జీవనము, భక్తి ప్రపత్తులు పరమశివుని ముగ్ధుణ్ణి చేశాయి. పెరుమాళ్ళు అనేక శివాలయములను దర్శించి పరమశివుని సేవించి స్వస్థలమునకు చేరుకున్నాడు. మధుర సోమసుందరేశ్వరుడు తన భక్తుడైన బాణాపతిరారు (బారాభద్రుడు) నకు సకలైశ్వర్యములు ఒసగదలచి చేరమాను పెరుమాళ్‌ పేరున ఒక చీటీనిచ్చెదను. దానిని తీసుకొనిపోయి అతనికిమ్ము, అతను సకలము నెరవేర్చును అని చెప్పి చీటీ (తాళపత్రము) ఇచ్చెను. ఆ చీటిలో దైవము సోమసుందరారు రచించిన గీతమున్నది. దాని అర్థము ఇలా వుంది. 'కవులను పండితులను సమాదరించే, ప్రజలను న్యాయవంతముగా పరిపాలించే ఓ మహారాజా! నీకు జయము, జయము నీ భక్తి తత్ప్రత, దయార్ద హృదయత, దాతృత్వము నన్ను ఆకట్టుకున్నాయి. ఈ తాళపత్రము గొని తెచ్చునా తని పేరు బాణపతిరారు. గొప్ప సంగీత విద్వాంసుడు. పరమ దైవభక్తి తత్పరుడు. నన్ను గూర్చి అతనికి ఇష్టమైన 'యాజు' (వీణ) మీద నన్ను కీర్తిస్తూ పాడుతూ వుంటాడు. నిన్ను చూడాలని అభిలషిస్తున్నాడు. అతనిని సాదరంగా గౌరవపురస్సరంగా ఆహ్వానించి అనంత పురస్కారములనిచ్చి గౌరవించవలసినది" అని వుంది.

చేరమాను ఆ విద్వాంసుని ప్రేమతో, గౌరవంతో ఆహ్వానించాడు. " సోమసుందరేశ్వరస్వామికి నేటికి నా మీద అనుగ్రహము కలిగినదా" యనుకొని చీటి (తాళపత్రము) సంగతి మంత్రులకు తెలియజేసి "కోశమున సకలమును బాణాపతిరారు ఇంటికి తరలించుడు" అని ఆజ్ఞాపించి బాణాపతిరారు వైపుతిరిగీ "స్వామీ ఈ రాజ్యమును గూడ స్వీకరించి మీసేవ చేయ నంగీకరింపవలయును" అని ప్రార్థించాడు. అందులకు బాణాపతిరారు నిర్ఘాంతపోయాడు.

రాజుగారి పరమ భక్తితత్పరత అర్థమైంది. "ఓరాజా! మీ దర్శనంతో నా జీవితము ధన్యమైంది. నాకు కావలసినంత మాత్రమే మీ దగ్గర నుంచి తీసుకొనగలను. ఆదిదేవుని ఆజ్ఞ కూడా" అని చెప్పి తనకు కావలసినది తీసుకుని రాజుకు వందన మాచరించి తిరిగి వెళ్ళాడు. చేరమాను ఆయనను ఏనుగు మీద ఎక్కించి పంపాడు. తన రాజ్యము పొలిమేరదాక ఆయనతో వెళ్ళి ఆయనను సాగనంపాడు.

చేరమానుకు నటరాజస్వామి యెడ బహు ప్రీతివుంది. తన శరీరము, మనస్సు, ఆత్మను గూడా ఆయనకే అర్పణ మొసగాడు. ప్రతిరోజు ఆయనను అర్చించేవాడు. ఆయన అర్చించే సమయములో నటరాజస్వామి(కనకసభలో) మూవురు ధ్వనులు (కాలందెల) స్వామి నృత్యము చేస్తునట్లు వినిపించేది. ఒక రోజున అర్చన సమయంలో కాలందెల ధ్వని వినబడలేదు. చేరమాను తాను మహాపరాధము చేసితినని భావించి తన ఖడ్గముతో మరణమునకు ఉధ్యుక్తుడయ్యాడు. వెంటనే మూపురధ్వని వినబడింది. ఆకాశము నుండి ఒక వాణి వినిపించింది. 'నా మిత్రుడు సుందరారు తిల్లై వచ్చాడు. ఆయన మధురమైన పాటలను వింటూ తన్మయుడనైనాను. అందుకని నా మూపురుధ్వనులతో నిన్ను ఆశీర్వదించుటకు ఆలస్యమైంది'. పరమశివుడు - సుందరారు, చేరమాను ఇరువురు మిత్రులవ్వాలని వాంఛించాడు. అందుకని సుందరార్‌ గూర్చి గొప్పగా చెప్పాడు. చేరమాను నటరాజును అర్చించుటకును సుందరారును దర్శించుటకును తిల్లైకు వెంటనే బయలుదేరాడు. చేరమాను తిల్లైచేరే సరికే సుందరారు ఆ స్థలము వదిలి వెళ్ళిపోయాడు. అందుకని చేరమాను తిరువారూరు వెళ్ళి అచ్చట సుందరారును కలిసికొన్నాడు. ఒకరికొకరు సాష్టాంగ ప్రణామములు చేసికొన్నారు. తిరువావూరులో చేరమాను విఖ్యాతినందిన "తిరుమమ్మనికోవై" కృతిని దేవదేవుడైన త్యాగరాజు మీద రచించి పాడాడు.

ఇద్దరూ కలిసి వేదారణ్యం వెళ్ళారు. అక్కడ చేరమాను 'తిరూఅంతాది' కృతిని దేవుని మీద పాడాడు. చాల దేవాలయములను సందర్శిస్తూ ఇద్దరూ మధుర చేరుకున్నారు. పాంఢ్యరాజు సాదరముగా వాళ్ళని ఆహ్వానించాడు.

ఆ సమయములో అక్కడ యున్న చోళయువరాజు గూడా వారిని గౌరవించాడు. వాల్లతో కలిసి చాలా దేవాలయములను ఇద్దరూ సందర్శించారు. వారి దగ్గర నుండి సెలవు తీసుకుని చేరమాను, సుందరారు తిరువారూరునకు చేరారు. చేరమాను కోరికపై సుందరారు కొడున్‌కోలూరు చేరమాను వెంట వెళ్ళాడు. అచ్చట చేరమాను సుందరారును ఏనుగుపై వూరేగించి సత్కరించాడు. సుందరారు తిరిగి వస్తూ చేరమానును - రాజ్యమును న్యాయవంతముగ నేర్పుతో పరిపాలించ వలసినదిగా చెప్పాడు. భక్తుని కోరికను చేరమాను తూచాతప్పక పాటించసాగాడు.

మరి ఒకసారి చేరమానుతో సుందరారు కొడున్‌కోలూరులో వున్నప్పుడు - సుందరారు వంటరిగా తిరు అంచైకాలము కోవెలను సందర్శించాడు. అచట తనను సంసార ఇహలోక బాధ్యతలనుండి తప్పించి కైలాసమునకు తీసుకునుపొమ్మని శివుని అర్థించాడు. మహాదేవుడు అతని అభ్యర్థనను మన్నించి తెల్ల ఏనుగుపై కైలాసానికి తెచ్చుటకు ప్రమధగణాన్ని పంపాడు. చేరమానుకు సుందరారు కైలాసానికి చేరుతున్నట్లు తట్టింది. తాను కూడా తన భద్రాశ్వమును అధిరోహించి దాని చెవిలో పంచాక్షరీ మంత్రమునుచ్చరించగా అది చేరమానును సుందరారు వద్దకు తృటిలో చేర్చింది. సుందరారును కలిసికొన్నాడు. ఇద్దరూ కలిసి కైలాసంకు చేరుకున్నారు.

కైలాసంలో ద్వారపాలకులు ఒక్క సుందరారునే లోనికి ఆహ్వానించారు. సుందరారు దేవుని దగ్గరకు వెళ్ళి నుతించాడు. చేరమాను ద్వారం బయటయున్నాడని చెప్పాడు. తన స్నేహితుని మురిపించుటకు పరమశివుడు తన వాహనమైన నందికేశ్వరుని పిలిచి చేరమానును తీసుకొనిరమ్మని పంపాడు. శివుడు చేరమానును తన అనుమతిలేనిదే కైలాసానికి ఎలా రాగలిగావు అని ప్రశ్నించాడు. "సుందరారు కైలాసమునకు బయలుదేరుట చూచాను. అతని వియోగము భరించలేక అతనితో వచ్చాను" అని చేరమాను బదులు చెప్పాడు. శివుడు చేరమానును వాత్సల్యంతో కైలాసానికి ఆహ్వానించాడు.

ఈ సంఘటనలో చేరమాను ఒక మహాసత్యాన్ని వెల్లడించాడు. ఒకడు అనర్హుడైనను గురువు (ఋషికి)కు ఆత్మీయుడవగలిగినచో గురువు తనతోబాటు తన శిష్యునికి గూడా భగవత్‌ సాన్నిధ్యము ఇప్పించ గలడన్న సత్యము ప్రస్ఫుటమైంది.

పరమశివుడు చేరమానును తన ప్రమధ గణాధిపతిగా చేసికొన్నాడు.

No comments:

Post a Comment

Powered By Blogger | Template Created By Lord HTML