What's app 7093879327

గమనిక :: తెలుగుబంధు. బ్లాగ్స్పాట్ . com

. Email: telugubandhu@gmail.com ఎటువంటి సమస్యలకైనా, ప్రశ్నల కైనా, సందేహాలకైనా తెలుగుబంధు లో సమాధానం ఉంచబడినది . ( తెలుగు ప్రజల ఆధ్యాత్మిక విషయాలు, జీవన అభివృద్దికి సూచనలు ). ఫోటో లు స్పష్టం గా కనపడాలంటే, ఫోటో పై నొక్కండి .
Showing posts with label పవిత్ర ప్రార్ధనా స్థలములు. Show all posts
Showing posts with label పవిత్ర ప్రార్ధనా స్థలములు. Show all posts

Tuesday, 7 April 2015

మన రాష్ట్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఎక్కడ ఉంది...?

మన రాష్ట్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం సింహాచలంలో ఉంది. విశాఖపట్నం నగరానికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం ప్రహ్లాదుని భక్తికి, అతనిపై నరసింహస్వామివారికున్న దయకు నిదర్శనంగా నిలిచింది.

శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం దేశంలోని అతి పురాతన ఆలయాలలో ఒకటి. ఇది 11వ శతాబ్దం నుంచి వెలుగులోకి వచ్చింది. ఈ క్షేత్రం సింహం ఆకారంలో ఉన్న కొండపై ఉండడం వల్ల దీనిని సింహాచలం అని పేరు వచ్చిందిని చెబుతారు. పురూరవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించాడని అంటారు. అతి పురాతనమైన ఈ దివ్యాలయ శోభవర్ణనాతీతం.

మనోహరమైన శిల్పాలు, ప్రాకారాలు, అడుగడుగునా దర్శనమిస్తాయి. శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు సంవత్సరమంతా చందనంతో నిండి ఉంటారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రమే చందనం తొలగించిన స్వామివారి నిజస్వరూప దర్శనం కలుగుతుంది. స్వామివారిపై ఉన్న గంధాన్ని తొలగించే ఉత్సవాన్ని చందనోత్సవం అని పిలుస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ వేడుకుల్లో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం చేసుకుంటారు.

ఇదే ఆలయ ప్రాంగణంలో కప్పు స్తంభం ఉంది. ఇది కోర్కెలను తీరుస్తుందని అంటారు. సింహాచలంలో చూడాల్సిన దేవాలయాలు, మందిరాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ భోజన, వసతి సదుపాయాలు ఉన్నాయి. విశాఖపట్నం నుంచి సిటిబస్సులో ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు.
Read More

Thursday, 2 April 2015

మనసున్న తల్లి మహంకాళమ్మ = అమ్మవారిగా కొలువైన ఆలయాలలో ఒకటి హైదరాబాద్ - వనస్థలిపురంలో కనిపిస్తుంది.



మనసున్న తల్లి మహంకాళమ్మ

లోకకల్యాణం కోసం అమ్మవారు అనేక రూపాలను ధరిస్తూ వచ్చింది. అలా వివిధ రూపాలలో కొలువైన అమ్మవారు, అనేక నామాలతో పిలవబడుతోంది. అలాంటి పేర్లలో ఒకటిగా 'మహంకాళి' కనిపిస్తుంది. అమ్మవారికి గల ఈ పేరే ఆ తల్లిని మహాశక్తి స్వరూపిణిగా ఆవిష్కరిస్తూ వుంటుంది. అలా ఆ తల్లి మహంకాళి అమ్మవారిగా కొలువైన ఆలయాలలో ఒకటి హైదరాబాద్ - వనస్థలిపురంలో కనిపిస్తుంది.

ప్రసిద్ధిచెందినటువంటి గణపతి ఆలయానికి సమీపంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది. రహదారి పక్కనే నిర్మించబడిన ఈ ఆలయం, చక్కగా తీర్చిదిద్దబడి వుంటుంది. గర్భాలయంలో మహంకాళి అమ్మవారి మూలమూర్తి తేజస్సుతో వెలిగిపోతూ వుంటుంది. అమ్మవారికి ఎదురుగా .. ఆ తల్లి ఆదేశం కోసం ఎదురు చూస్తున్నట్టుగా సింహవాహనం కనిపిస్తుంది.


ఇక్కడ నిత్య పూజలతో పాటు, వివిధరకాల జపాలు ... శాంతి హోమాలు జరుపుతుంటారు. అమ్మవారు ఎక్కడ కొలువైనా ఆ తల్లి పాదాలను ఆశ్రయించేవారిలో మహిళా భక్తులే ఎక్కువగా వుంటారు. జీవితంలో స్త్రీ కోరుకునే వరాలలో వివాహం ... సంతానం .. సౌభాగ్యం ముఖ్యమైనవిగా చెప్పబడుతూ వుంటాయి. వీటినే శాశ్వతమైన సంపదలుగా భావించి వాళ్లు సంతోష పడుతుంటారు ... సంతృప్తిని పొందుతుంటారు.

అలాంటి వరాలను అందించే తల్లిగా మహంకాళి అమ్మవారు దర్శనమిస్తుంది. స్త్రీలు కోరుకునే జీవితాన్ని అందించడానికి అమ్మవారు అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. అనారోగ్యాలను ... ఆర్ధికపరమైన ఇబ్బందులను తొలగించి, వివాహయోగాన్ని కలిగించడమే కాకుండా సంతాన సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది. అందుకు కృతజ్ఞతగా అమ్మవారిని భక్తులు అనుదినం సేవిస్తుంటారు. ప్రతి శుక్రవారం పూజాభిషేకాలు జరుపుతుంటారు. పర్వదినాల్లో అమ్మవారికి చీరసారెలను సమర్పిస్తుంటారు. ఆ తల్లికి ఇష్టమైన నైవేద్యాలను చేయించి, ఆమె ప్రేమానురాగాలకు పాత్రులవుతుంటారు.
Read More

ఒంటిమిట్ట కోదండరామాలయం



ఒంటిమిట్ట కోదండరామాలయం

అత్యంత పురాతనమైన ఈ ఆలయంలోని సీతారామ లక్ష్మణ విగ్రహాలు విడి విడిగా వున్నా ఏక రాతిలో చెక్కబడినవి.

ఇంకొక విశేషం ఇక్కడ గర్భగుడిలో ఆంజనేయస్వామి వుండరు. ఆయన్ని కలుసుకోవటానికి ముందే సీతారామ లక్ష్మణులు ఇక్కడ సంచరించారనీ, అందుకని ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్టింపబడలేదని అభిజ్ఞుల అభిప్రాయం. వనవాస సమయంలో సీతారామ, లక్ష్మణులు ఇక్కడ సంచరిస్తూ వుండగా సీతమ్మకి దాహం వేసింది. అప్పుడు శ్రీరామచంద్రుడు తన బాణంతో పాతాళ గంగను రప్పించాడు. ఆ తీర్ధం రామ తీర్ధంగా ఇప్పటికీ అక్కడ వున్నది.


ఒక మిట్టమీద నిర్మింపబడ్డ రామాలయం అవటంవల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది. ఈ ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి. అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది.

ఇంకొక కధనం ప్రకారం ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు (వీరు చోరులు అని కూడా అంటారు) ఈ ఆలయాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన తర్వాత వారు తమ జీవితాలని అంతం చేసుకున్నారు. వారి శిలా విగ్రహాలు ఆలయంలో ప్రవేశించటానికి ముందు చూడవచ్చు.

మహా భాగవతకర్త పోతన తాను ఏక శైలపురివాసినని చెప్పుకున్నాడు. భాగవతంలో తానీ ప్రాంతానికి చెందినవాడనే మాటలు కొన్ని వుండటంవల్లకూడా పోతన కొంత కాలం ఇక్కడ నివసించినట్లు భావిస్తారు. పోతన జన్మ స్ధలం గురించి ఎన్నో వివాదాలున్నాయి. అయినా ఆయన రచించిన భాగవతాన్ని అంకితమిచ్చింది కోదండరాముడికే. ఆలయంలో ఈ సహజ కవి విగ్రహాన్ని దర్శించవచ్చు.

తెలుగులో తొలి యాత్రా రచన .. కాశీ యాత్ర చరిత్ర .. లో ఈ గ్రామ ప్రస్తావన వున్నది. ఆ గ్రంధకర్త ఏనుగుల వీరాస్వామి కాశీ యాత్రలో భాగంగా అత్తిరాలనుంచి భకరాపేట వెళ్ళే మార్గంలో ఒంటిమిట్టనుంచి వెళ్ళారు. ఈ గ్రంధ రచన క్రీ.శ. 1830లో జరిగింది. ఆ సమయంలో గ్రామం నాలుగు పక్కల కొండలు మధ్యలో భారీ చెరువున్నది. చెరువుకట్టమీద వున్న బాటమీద ఆయన ప్రయాణం చేశారు. అప్పట్లో అది గ్రామమనీ, గ్రామంలో చక్కటి గుళ్ళు, యాత్రికుల నిలయం వున్నాయని పేర్కొన్నారు.

రామ లక్ష్మణులు చిన్న వయసులోనేకాక సీతా రామ కళ్యాణం తర్వాత కూడా మృకండ మహర్షి, శృంగి మహర్షి కోరికమీద యాగ రక్షణకి, దుష్ట శిక్షణకీ శ్రీరామ లక్ష్మణులు అంబులపొది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశారని ఒక కధనం. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతా రామ లక్ష్మణుల విగ్రహాలను ఏక శిలలో చెక్కించారనీ, తర్వాత జాంబవంతుడు ఈ విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట చేశాడనీ ఇక్కడివారి విశ్వాసం.

సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇంకొకటి ఇమాంబేగ్ బావి. 1640 సం. లో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్. ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడుట. చిత్త శుధ్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన మూడు సార్లు రాముణ్ణి పిలిచారట. అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది. ఆయన ఆశ్చర్య చకితుడై, స్వామి భక్తుడిగా మారి, అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించాడు. ఆయన పేరుమీద ఆ బావిని ఇమాంబేగ్ బావి అటారు. అప్పటినుంచి ఎందరో ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయం సందర్శిస్తూ వుంటారు.

ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ 16 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని దర్శించి, భారత దేశంలో పెద్ద గోపురాలలో ఈ ఆలయ గోపురం ఒకటి అని శ్లాఘించాడు.

ఆలయ నిర్మాణం:

* పొత్తపి చోళులు, విజయనగర రాజులు, మట్టిరాజులు ఈ ఆలయాన్ని మూడు దశలలో నిర్మించారు.

* మూడు గోపురాలతో, విశాలమైన ఆవరణలో అలరారే ఈ ఆలయం ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు.

* ఈ ఆలయంలో మధ్య మండపంలో 32 స్తంబాలున్న రంగమంటపం వున్నది. సందర్శకులను ఆకట్టుకునే ఈ స్తంభాల మీద శిల్ప కళ చోళ, విజయనగర శిల్ప శైలిని పోలి వుంటుంది. ఈ స్తంబాలపై రామాయణ, భారత కధలను చూడచ్చు.

* గుడి ఎదురుగా సంజీవరాయ దేవాలయం, పక్కగా రధశాల, రధం వున్నాయి.

* పోతన, అయ్యల రాజు రామభద్రుడు, ఉప్పు గుండూరు వేంకటకవి, వరకవి మొదలగు ఎందరో స్వామికి కవితార్చన చేసి తరించారు.

* అన్నమాచార్యుడు ఈ ఆలయాన్ని దర్శించి స్వామిమీద కొన్ని కీర్తనలు రచించారు.

* ప్రౌఢ దేవరాయల ఆస్ధానంలో అయ్యల తిప్పరాజు ఈ ప్రాంతవాసి. ఈయన స్వామిపై ... శ్రీ రఘువీర శతకాన్ని రచించారు. ఇతని మనవడే అష్ట దిగ్గజాల్లో ఒకరయిన అయ్యల రాజు రామభద్రుడు.

వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి, ఆంధ్ర వాల్మీకిగా పేరుపొందిన శ్రీ వావిలకొలను సుబ్బారావు (1863 – 1936) రెవెన్యూ ఉద్యోగి. ఈయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి తన జీవితాన్ని ఈ ఆలయ పునరుధ్ధరణకి అంకితం చేశారు. ఊరూరా భిక్షమెత్తి ఈ ఆలయానికి భూములు, భవనాలు, స్వామికి విలువైన ఆభరణాలు ఏర్పాటు చేశారు. ఈయన రామాయణాన్ని తెలుగులో రచించి దానికి “మందరం” అనే పేరుతో వ్యాఖ్యానం కూడా రాశారు.

మార్గము:
కడపనుంచి రాజం పేట వెళ్ళే మార్గంలో కడపకి 27 కి.మీ. ల దూరంలో వున్నది. కడపనుంచి బస్సు సౌకర్యం వున్నది.

ఉత్సవాలు:
చైత్ర శుధ్ధ నవమినుండి బహుళ విదియ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో చతుర్దశినాడు కళ్యాణం, పౌర్ణమినాడు రధోత్సవం, నవమినాడు పోతన జయంతి జరుగుతాయి.

Read More

Saturday, 28 March 2015

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది



తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు.

ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది.

ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు. అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు.
ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.

ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే ..... అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రములో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.

సుబ్రహ్మణ్య భుజంగం

సదా బాలరూపాzపి విఘ్నాద్రిహంత్రీ - మహాదంతివక్త్రాzపి పంచాస్యమాన్యా |
విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే - విధత్తాం శ్రియం కాzపి కల్యాణమూర్తిః || ౧ ||

న జానామి శబ్దం న జానామి చార్థం - న జానామి పద్యం న జానామి గద్యమ్ |
చిదేకా షడాస్య హృది ద్యోతతే మే - ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ || ౨ ||

మయూరాధిరూఢం మహావాక్యగూఢం - మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ |
మహీదేవదేవం మహావేదభావం - మహాదేవబాలం భజే లోకపాలమ్ || ౩ ||

యదా సంనిధానం గతా మానవా మే - భవాంభోధిపారం గతాస్తే తదైవ |
ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే - తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ || ౪ ||

యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగాస్తథైవాపదః సంనిధౌ సేవతాం మే |
ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం - సదా భావయే హృత్సరోజే గుహం తమ్ || ౫ ||

గిరౌ మన్నివాసే నరా యేzధిరూఢాస్తదా పర్వతే రాజతే తేzధిరూఢాః |
ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః - స దేవో ముదే మే సదా షణ్ముఖోzస్తు || ౬ ||

మహాంభోధితీరే మహాపాపచోరే - మునింద్రానుకూలే సుగంధాఖ్యశైలే |
గుహాయాం వసంతం స్వభాసా లసంతం - జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ || ౭ ||

లసత్స్వర్ణగేహే నృణాం కామదోహే - సుమస్తోమసంఛన్నమాణిక్యమంచే |
సముద్యత్సహస్రార్కతుల్యప్రకాశం - సదా భావయే కార్తికేయం సురేశమ్ || ౮ ||

రణద్ధంసకే మంజులేzత్యంతశోణే - మనోహారిలావణ్యపీయూషపూర్ణే |
మనఃషట్పదో మే భవక్లేశతప్తః - సదా మోదతాం స్కంద తే పాదపద్మే || ౯ ||

సువర్ణాభదివ్యాంబరైర్భాసమానాం - క్వణత్కింకిణీమేఖలాశోభమానామ్ |
లసద్ధేమపట్టేన విద్యోతమానాం - కటిం భావయే స్కంద తే దీప్యమానామ్ || ౧౦ ||

పులిందేశకన్యాఘనాభోగతుంగస్తనాలింగనాసక్తకాశ్మీరరాగమ్ |
నమస్యామహం తారకారే తవోరః - స్వభక్తావనే సర్వదా సానురాగమ్ || ౧౧ ||

విధౌ క్లృప్తదండాన్స్వలీలాధృతాండాన్నిరస్తేభశుండాన్ద్విషత్కాలదండాన్ |
హతేంద్రారిషండాంజగత్రాణశౌండాన్సదా తే ప్రచండాన్శ్రయే బాహుదండాన్ || ౧౨ ||

సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః - సముద్యంత ఏవ స్థితాశ్చేత్సమంతాత్ |
సదా పూర్ణబింబాః కళంకైశ్చ హీనాస్తదా త్వన్ముఖానాం బ్రువే స్కంద సామ్యమ్ || ౧౩ ||

స్ఫురన్మందహాసైః సహంసాని చంచత్కటాక్షావలీభృంగసంఘోజ్జ్వలాని |
సుధాస్యందిబింబాధరాణీశసూనో - తవాలోకయే షణ్ముఖాంభోరుహాణి || ౧౪ ||

విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం - దయాస్యందిషు ద్వాదశస్వీక్షణేషు |
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేద్భవేత్తే దయాశీల కా నామ హానిః || ౧౫ ||

సుతాంగోద్భవో మేzసి జీవేతి షడ్ధా - జపన్మంత్రమీశో ముదా జిఘ్రతే యాన్ |
జగద్భారభృద్భ్యో జగన్నాథ తేభ్యః - కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః || ౧౬ ||

స్ఫురద్రత్నకేయూరహారాభిరామశ్చలత్కుండలశ్రీలసద్గండభాగః |
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః - పురస్తాన్మమాస్తాం పురారేస్తనూజః || ౧౭ ||

ఇహాయాహి వత్సేతి హస్తాన్ప్రసార్యాహ్వయత్యాదరాచ్ఛంకరే మాతురంకాత్ |
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం - హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ || ౧౮ ||

కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణే మయూరాధిరూఢ |
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్ - ప్రభో తారకారే సదా రక్ష మాం త్వమ్ || ౧౯ ||

ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే - కఫోద్గారివక్త్రే భయోత్కమ్పిగాత్రే |
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం - ద్రుతం మే దయాలో భవాగ్రే గుహ త్వమ్ || ౨౦ ||

కృతాంతస్య దూతేషు చండేషు కోపాద్దహచ్ఛింధి భింధీతి మాం తర్జయత్సు |
మయూరం సమారుహ్య మా భైరితి త్వం - పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రమ్ || ౨౧ ||

ప్రణమ్యాసకృత్పాదయోస్తే పతిత్వా - ప్రసాద్య ప్రభో ప్రార్థయేzనేకవారమ్ |
న వక్తుం క్షమోzహం తదానీం కృపాబ్ధే - న కార్యాంతకాలే మనాగప్యుపేక్షా || ౨౨ ||

సహస్రాండభోక్తా త్వయా శూరనామా - హతస్తారకః సింహవక్త్రశ్చ దైత్యః |
మమాంతర్హృదిస్థం మనఃక్లేశమేకం - న హంసి ప్రభో కిం కరోమి క్వ యామి || ౨౩ ||

అహం సర్వదా దుఃఖభారావసన్నో - భవాందీనబంధుస్త్వదన్యం న యాచే |
భవద్భక్తిరోధం సదా క్లృప్తబాధం - మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ || ౨౪ ||

అపస్మారకుష్టక్షయార్శః ప్రమేహజ్వరోన్మాదగుల్మాదిరోగా మహాంతః |
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం - విలోక్య క్షణాత్తారకారే ద్రవంతే || ౨౫ ||

దృశి స్కందమూర్తిః శ్రుతౌ స్కందకీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ |
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం - గుహే సంతు లీనా మమాశేషభావాః || ౨౬ ||

మునీనాముతాహో నృణాం భక్తిభాజామభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః |
నృణామంత్యజానామపి స్వార్థదానే - గుహాద్దేవమన్యం న జానే న జానే || ౨౭ ||

కలత్రం సుతా బంధువర్గః పశుర్వా - నరో వాథ నారీ గృహే యే మదీయాః |
యజంతో నమంతః స్తువంతో భవంతం - స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార || ౨౮ ||

మృగాః పక్షిణో దంశకా యే చ దుష్టాస్తథా వ్యాధయో బాధకా యే మదంగే |
భవచ్ఛక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే - వినశ్యంతు తే చూర్ణితక్రౌంచశైల || ౨౯ ||

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం - సహేతే న కిం దేవసేనాధినాథ |
అహం చాతిబాలో భవాన్ లోకతాతః - క్షమస్వాపరాధం సమస్తం మహేశ || ౩౦ ||

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం - నమశ్ఛాగ తుభ్యం నమః కుక్కుటాయ |
నమః సింధవే సింధుదేశాయ తుభ్యం - పునః స్కందమూర్తే నమస్తే నమోzస్తు || ౩౧ ||

జయానందభూమం జయాపారధామం - జయామోఘకీర్తే జయానందమూర్తే |
జయానందసింధో జయాశేషబంధో - జయ త్వం సదా ముక్తిదానేశసూనో || ౩౨ ||

భుజంగాఖ్యవృత్తేన క్లృప్తం స్తవం యః - పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య |
సుపుత్రాన్కలత్రం ధనం దీర్ఘమాయుర్లభేత్స్కందసాయుజ్యమంతే నరః సః || ౩౩ ||
Read More

శ్రీశైల క్షేత్రమునందలి ప్రధాన స్థానములు



శ్రీశైల క్షేత్రమునందలి ప్రధాన స్థానములు - మధూక కుండము, పాలధార, పంచధారలు, హాటకేశ్వరము, ఆరామ వీరభద్ర స్థానము, బ్రహ్మగిరి, ఘంటాసిద్ధేశ్వరము, బోగేశ్వరము, ఇష్టకామేశ్వరము, సప్తమాతృకలు, కదళీవనము మొదలైనవి. పార్వతీ ప్రాణ వల్లభుడు మదనాంతకుడైన మల్లికార్జున స్వామి విడువక ఈ పర్వతమునందు నివసించి ఉంటాడు. ఈ క్షేత్ర మహిమను ప్రస్తుతించుట బ్రహ్మకైనను వశము కాదు. ఈ కొండయందలి గండశిలలన్నియును శివలింగములు. ఇచ్చటి చెంచులందరును సిద్ధమునులు. చావనిదే యెవ్వరికిని కాశీక్షేత్రము ముక్తులనీయదు. ఈ శ్రీశైలము శిఖరసందర్శన మాత్రముననే ఎల్లరకును ముక్తులనిచ్చును.


శ్రీశైలాది తీర్థముల వలన ముక్తి కలుగునని పురాణములు చెప్పుచున్నవి. ముక్తి కారణములని చెప్పబడిన సకలతీర్థములయొక్క ప్రశస్తి విషయములో రెండవయూహ లేదు. నిస్సంశయముగా అవియన్నియుని ముక్తి ప్రదములు. ఎట్లనగా వానిని సేవించినందువల్ల కలిగెడు సుకృతఫలమువల్లనే కాశీప్రాప్తి కలుగును. ఇట్లు కాశీప్రాప్తికి కారణములైనందువల్లనే వానిని పురాణములు కైవల్యప్రదములని వర్ణించినవి. అవి కాశీప్రాప్తి ద్వారా పరంపరాసంబంధము చేత ముక్తిప్రదములు. కాశీక్షేత్రము సాక్షాత్తుగా మోక్షకారణము. త్రివేణీ సంగమం, నైమిశారణ్యం, సరస్వతీనది ప్రవహించిన ప్రదేశము (కురుక్షేత్రము), హిమాలయమునుండి గంగానది దిగినచోటు, ఉజ్జయిని, అయోధ్యానగరం, ఉత్తర మధుర, బృందావన ప్రాంతము శ్రీకృష్ణ జన్మస్థానము, దక్షిణ మధుర, పాండ్యుల రాజధాని శ్రీమీనాక్షీ సుందరేశ్వరుల నివాసము (మధుర), ద్వారక(సముద్రములో విలీనమైనది), సరస్వతీనది - అంతః ప్రవాహిని, సహ్యపర్వతము - కృష్ణానది పుట్టిన పర్వతము, గంగాసాగర సంగమము, కామాక్షీ నిలయము, నాసికా త్రయంబకము - గోదావరి పుట్టినచోటు, దాక్షారామము, బదరికాశ్రమము (నరనారాయణులు తపస్సు చేసిన చోటు) హిమాయలములలోనిది, నర్మదాతీరములోని ఓంకారు, పూరీజగన్నాథము, దక్షిణ సముద్రతీరములోని గోకర్ణము, శ్రీశైలము - ఇవి మోక్షహేతువులైన గొప్ప తీర్థములు.

శివానుగ్రహము సమకూరని నాడు మనస్సులో తీర్థయాత్ర చేయవలయుననెడి సంకల్పమే యుదయించదు. తీర్థయాత్రయందు శ్రద్ధలేని నాడు ప్రతిబంధకములైన పాపములు తొలగిపోవు. పాపములు తొలగిపోని నాడు కాశికి పోవలెనన్న యుత్సాహమే పుట్టదు. కాశీ క్షేత్ర నివాసము లేనినాడు విజ్ఞాన దీపము తన కాంతిని విస్తరింపజేయదు. జ్ఞానమువలన గాని కైవల్యము సంభవించదు. జ్ఞానమనగా ఉపనిషద్వాక్యములచేత సంభవించునది. దానినే విజ్ఞానమనీ అందురు.
Read More

శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం ఒంటిమిట్ట. ఏకశిలానగరంగా రాష్ట్రంలో ఉన్న శ్రీరాముని పురాతన ఆలయాలలో ఒకటిగా దేశంలో ఉన్న శ్రీరాముని ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈదివ్య క్షేత్రంలో సాక్షాత్తూ కోదండరామ స్వామి వారు సీతాలక్ష్మణ సహితంగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు

శ్రీరాఘవం దాశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం!
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి!!
అంటూ శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం ఒంటిమిట్ట. ఏకశిలానగరంగా రాష్ట్రంలో ఉన్న శ్రీరాముని పురాతన ఆలయాలలో ఒకటిగా దేశంలో ఉన్న శ్రీరాముని ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈదివ్య క్షేత్రంలో సాక్షాత్తూ కోదండరామ స్వామి వారు సీతాలక్ష్మణ సహితంగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అత్యంత పురాతనమైన ఈ దివ్యాలయానికి 11వ శతాబ్దం నాటి చోళరాజులు, విద్యానగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒంటిమిట్టకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ సమీపంలోని రామతీర్థానికి చేరుకొని స్నానాదికాలు చేస్తారు. అత్యంత మహిమాన్వితమైన ఈ రామతీర్థాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడు తన బాణంతో ఏర్పాటు చేశాడని చెప్తారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ప్రకృతి అందాలను ఆవిష్కరించే ఈ రామతీర్థంలో స్నానమాచరించే భక్తుల ఈతిబాధలన్నీ మటుమాయం అవుతాయని చెప్తారు. ఈ రామతీర్థంలో లక్ష్మణ తీర్థం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. రామలక్ష్మణ తీర్థాలను ఆనుకొని బమ్మెర పోతనామాత్యునికి చెందినవిగా చెప్పబడుతున్న పంటపొలాలు దర్శనమిస్తాయి. సుప్రసిద్ధ కవిపండితులు బమ్మెర పోతనామాత్యులు ఈక్షేత్రంలోనే భాగవత రచన చేసి ఇక్కడ కొలువైన కోదండ రామునికి అంకితమిచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమౌతోంది.
అతి పురాతనమైన ఈ ఆలయాన్ని మూడు దఫాలుగా నిర్మించినట్లు శాసనాలద్వారా అవగతమౌతోంది. చోళరాజులు, విద్యానగర రాజులు, మట్టి రాజుల పరిపాలనలో ఈ ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విద్యారణ్య ప్రభువులు, సదాశివ రాయలు, చోళ రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయం విశాలమైన ప్రాంగణంలో దర్శనమిస్తుంది. మనోహరమైన శిల్ప రాజాలను దర్శింపజేస్తుంది. ఈ ఆలయ ప్రాకారం, గోపురాలపై చోళుల నాటి శిల్పకళా వైభవాన్ని భక్తులు తనివితీరా దర్శించుకుంటారు. విశాలంగా, ప్రశాంతంగా ఉన్న ప్రధాన ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి ముందు భాగంలో ఆ కాలంనాటి ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. దీని దర్శనభాగ్యం చేతనే సమస్త భాగ్యాలూ సొంతమౌతాయని భక్తులు విశ్వసిస్తూ ధ్వజస్తంభాన్ని భక్తితో పూజిస్తారు. అనంతరం ముఖమండపంలోకి ప్రవేశిస్తారు.
ఈ క్షేత్రానికి సంబంధించి ఓ జానపద గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒండుడు, మిట్టుడు అనే ఇద్దరు సోదరులైన దొంగలు ఈ పరిసర గ్రామంలో దోపిడీ చేసేవారట. వారు దొంగిలించిన వస్తువులను ఈక్షేత్రంలో ఉన్న గుహలలో దాచేసేవారట. అప్పుడు ఈ గుహలో శిలపై ఉన్న సీతారామ లక్ష్మణులు ఆ దొంగలకు హితోపదేశం చేసి నిజాయితీగా బ్రతకమని ఆదేశించారట. దాంతో మనస్సు మార్చుకున్న ఆ దొంగలు ఆ విగ్రహాలకు గర్భగుడి, అంతరాలయం నిర్మించారట. ఆకారణంగా ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆలయ ముఖ మండపం భక్తులను మైమరిపిస్తుంది. మనోహరమైన శిల్పరాజాలతో కూడిన స్తంభాలు, ప్రాకారాలు, కుడ్యాలు ఈ ముఖమండపంలో భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా ప్రాకారాలు స్తంభాలపై రామాయణ మహాభారత గాథలు, దశావతార ఘట్టాలకు చెందిన మనోహరమైన శిల్పరాజాలెన్నో భక్తులకు దర్శనమిచ్చి మైమరపిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఆలయానికి ముందు కుడివైపునున్న పోతనామాత్యుని మందిరానికి చేరుకొని ఆయనను భక్తితో దర్శించుకుంటారు. బమ్మెర పోతన ఈ క్షేత్రంలోనే మహాభాగవత రచన చేస్తూ గజేంద్రమోక్షంలో “అల వైకుంఠపురంబులో” అనే పద్యంలోని కొన్ని చరణాలు గుర్తుకు రాక నిలిపివేయగా శ్రీరామచంద్రుడు వచ్చి తాళపత్రగ్రంథాలను పూర్తిచేశాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగానే పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట;” అని భాగవతాన్ని శ్రీరామునికి అంకితమిచ్చారని తెలుస్తోంది.
జాంబవంతుడు ఒకేరాతిపై ఉన్న సీతారామలక్ష్మణ మూర్తులను ప్రాణప్రతిష్ఠ చేసినట్లు పురాణాలద్వారా అవగతమౌతోంది. పోతనామాత్యుని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపల వున్న జయవిజయులను దర్శించుకొని ఆ తర్వాత గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయానికి ముందున్న అంతరాలయంలో ఓ ప్రక్క శ్రీమన్నారాయణుడు, ఒక ప్రక్క ఆంజనేయస్వామి వారు దర్శనమిస్తారు. ఇంకోప్రక్క ఆళ్వార్ స్వాములు దర్శనమిస్తారు.
త్రేతాయుగంలో ఇక్కడ మృకండు మహాముని, శృంగి మహాముని యాగాలు, క్రతువులు చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చి ఆటంక పరుస్తుండగా ఈ దండకారణ్య ప్రాంతానికి రాముల వారు కోదండము, పిడిబాకు, అమ్ములపొదితో వచ్చారు కనుక కోదండరామ స్వామి అని అంటారు. అప్పటికింకా సీతాపహరణం జరుగలేదు. ఆంజనేయస్వామి కనపడకముందే రాముల వారు వచ్చారు కనుక అంజనేయుల వారు గర్భగుడిలో లేరు. ఇక్కడి స్వయంభూ విగ్రహాలను ద్వాపరయుగంలో జాంబవంతుడు ప్రతిష్ఠ చేసి పూజలు చేశాడని చెప్తారు.
అయ్యలరాజు తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఉప్పుగుండూరు వేంకటకవి, ఈమాం బేగ్, మాల ఓబన్న వంటి ఎందఱో మహనీయులు స్వామివారి ఆశీస్సులు తీసుకొని తరించారని తెలుస్తోంది.
భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న రామలింగేశ్వర స్వామిని చేరుకొని స్వామిని భక్తితో పూజిస్తారు. అనంతరం ఆలయం బయట స్వామి ఆలయానికి ఎదురుగా మాలఓబన్న మండపం భక్తులకు దర్శనమిస్తుంది. పూర్వం మాల ఓబన్న అనే భక్తుడు తన భక్తితో స్వామివారిని మెప్పించి ఆయన సాక్షాత్కారానికి పాత్రుడయ్యాడు అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆతరువాత భక్తులు సమీపంలో ఉన్న సంజీవరాయుని మందిరానికి చేరుకుంటారు. అతిపురాతనమైన ఈ ఆలయంలో ఆంజనేయస్వామి వారు ముకుళిత హస్తుడై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే స్వామి ఇక్కడ సంజీవరాయునిగా భక్తులచేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. సంజీవరాయుని దర్శించుకున్న భక్తులు అనంతరం సమీపంలో కొండపై ఉన్న వావిలి కొలను సుబ్బారావు మందిరానికి చేరుకుంటారు. శ్రీరామ భక్తుడైన సుబ్బారావు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులయ్యారని చెప్తారు. గర్భాలయంలో సుబ్బారావు శిలా ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది.


Read More

Tuesday, 24 March 2015

ఈ విశ్వకర్మ తామ్ర విగ్రహాన్ని చూసారా

విశ్వకర్మ కళాకారులు ,,,,, ఈ విశ్వకర్మ తామ్ర విగ్రహాన్ని చూసారా ,,,,, ఈ విశ్వకర్మ విగ్రహాన్ని తయారు చేసింది,,, దేవతా తామ్ర విగ్రహాలు తయారు చేసే విశ్వకర్మ కళాకారులే, ఎంత బాగా తయారు చేసారో కదా ,,,,, బ్రహ్మాండంగా ఉంది కదా మిత్రులారా ...



Read More

Monday, 23 March 2015

హేమాచల క్షేత్రం..



హేమాచల క్షేత్రం..

వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం మల్లూరు గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో హేమాచల క్షేత్రం ఉంటుంది. ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనర్సింహస్వామి ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాడు. జిల్లా కేంద్రానికి 135 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది తీర ప్రాంతంలో ఏటూరునాగారం – భద్రాచలం ప్రధాన రహదారిని అనుకొని ఈ క్షేత్రం ఉంది. ఈ హేమాచల క్షేత్రంలో అనేక విశేషాలు ఉన్నాయి. హిమాలయాల్లో మాదిరిగానే ఈ క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రం పై తపస్సు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆరవ శతాబ్దానికి పూర్వం నుంచే ఈ క్షేత్రం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని అంటుంటారు. ఈ క్షేత్రమంతా అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆశ్రిత జన రక్షకుడు భక్తుల కల్ప తరువు లక్ష్మీనర్సింహస్వామి ఈ క్షేత్రంపై స్వయంభూగా వెలిశాడ‌ని ప్ర‌తీతి.

శాతవాహన శక ప్రభువు దిలీపకర్ణి మహారాజుకు స్వామివారు సాక్షాత్కరించి గుహాంతర భాగంలో ఉన్నానని సెలవిచ్చినారట. మహారాజు 76 వేల సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలోకి గుచ్చుకుంది. ఆ నాభి నుంచే ప్రస్తుతం ద్రవం వెలువడుతున్నది. ఈ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభి చందనంగా పిలుస్తున్నారు. స్వామి వారికి ఆదిలక్ష్మీ, చెంచులక్ష్మీ అను ఇద్దరు భార్యలు(దేవేరులు) ఉన్నారు. క్షేత్రపాలకునిగా పంచముఖాంజనేయ స్వామి.. క్షేత్రానికి పశ్చిమాన వేణుగోపాలస్వామి, తూర్పు భాగంలో కోనేరు, దక్షిణాన నార నర్సింహ క్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీనర్సింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారు. ఇచట స్వామికి నాభియందు దెబ్బతగలడం వల్ల అక్కడి నుంచి వచ్చే ద్రవానికి చందనం పెట్టి సంతానం లేనివారికి, కుజ, రాహు, కేతువు గ్రహ దోషముల నివారణకు ఈ చందనాన్ని ఇస్తారు.

కాకతీయ రాణి రుద్రమదేవి త‌న కాలంలో మల్లూరు హేమాచల క్షేత్రాన్ని సంద‌ర్మించిద‌ని.. ఇక్కడ ఉన్న జలపాతానికి చింతామణి అని నామకరణం చేసినట్లు చరిత్రకారులు చెబుతారు. ఓరుగల్లు రాజధానిగా పరిపాలనను సాగించిన కాకతీయ రాజుల ఏలుబడిలోనే ఈ హేమాచల క్షేత్ర ప్రాంతం ఉండేది. ఈ హేమాచల క్షేత్రం పై గోన గన్నారెడ్డి నేతృత్వంలో సైనిక స్థావరం నిర్వహించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాకతీయుల పాలన అంతమైన తర్వాత ముస్లిం రాజుల దండయాత్రలు పెరిగిన క్రమంలో 17వ శతాబ్దంలో గజనీ మహ్మద్ ఈ ఆలయాన్ని దర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. వెయ్యి స్థంభాల గుడి, రామప్ప, కోటగుళ్ల లాంటి దేవాలయాలను ధ్వంసం చేసిన గజనీ మహ్మద్ సైన్యాలు హేమాచల క్షేత్రాన్ని మాత్రం ముట్టుకోలేదు. పైగా బంగారు బిస్కెట్లు ఆలయానికి కానుకలుగా సమర్పించినట్లు చెబుతున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే అర్ధ చంద్ర నెలవంకను ఈ క్షేత్రం పోలి ఉండడమే ఇందుకు కారణం.

ఇక్క‌డి చింతామణి జలపాతం (అక్కధార – చెల్లెధార)

సర్వరోగనివారిణిగా పనిచేస్తోంది. కాశీ, గంగలో దొరికే జలాల కంటే ఇక్కడి జలాలు పవిత్రమైనవి నమ్ముతారు భ‌క్తులు. వంద రోజుల పాటు ఈ జలాలు నిత్యం సేవిస్తే రోగాలన్ని నయమవుతాయట. ఇక్కడి జలపాతంలో స్నానం చేస్తే చర్మవ్యాధులు తగ్గుతాయ‌ని భ‌క్తుల చెపుతున్నారు. హేమాచల క్షేత్ర అడుగు భాగంలో చెట్ల బెరడుల మధ్య నుంచి వనమూలికలతో కూడిన జలపాతం యేడాది పొడవునా పారుతూనే ఉంటుంది. హేమాచల క్షేత్రదర్శనం కోసం ఎంతమంది ఎక్కువ భక్తులు వస్తే జలపాతం అంత వేగం పుంజుకుంటుంది. ఈ క్షేత్రం పై భక్తుల ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల భూమి పై ఒత్తిడి పెరిగి అడుగు నుంచి జలాలు ఎక్కువగా ఉబికి వస్తాయట.

రామబంటు ఆంజనేయుడి విగ్రహం ఎక్కడా లేని విధంగా ఇక్కడ క్షేత్రపాలకుడిగా ఉన్న షిఖాంజనేయుడి విగ్రహం భక్తులకు దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయానికి పశ్చిమ భాగంలో కిలోమీటర్ దూరంలో ఈ షిఖాంజనేయ మహా విగ్రహం భక్తులను ఆశ్చర్యముఖులను చేస్తుంది. షిఖాంజనేయుడి పాదాలు, గోర్లు పొడవుగా ఉంటాయి. గంభీరమైన, భీకరమైన, తేజోవంతమైన రూపంతో ఆంజనేయ స్వామి విగ్రహం అతివీర భయంకరంగా ఉంటుంది. దీనికి తోడు ఆలయ ప్రాంగణంలో పంచముఖ ఆంజనేయుడు, ఎద్దు ముక్కు ఆంజనేయుడు, జలాంజనేయుడు రూపాల్లో దర్శనమిస్తాడు.


Read More

Sunday, 22 March 2015

ప్రపంచంలోనే అతి పురాతనమైన అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం.



ప్రపంచంలోనే అతి పురాతనమైన అత్యంత పెద్దదైన హిందూ దేవాలయం.

హిందూ సంస్కృతి ఆనవాళ్ళు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో
ఉన్నట్టు ఇప్పటికే ఋజువులున్నాయి.ఎన్నో ఏళ్ల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూలలా ఫరిఢవిల్లింది.నాటి హిందూ రాజులు మన సంస్కృతిని విశ్వ వ్యాప్తం చేశారు.మన సంప్రదాయాలు, శిల్ప కళా నైపు ణ్యం విదేశాల్లో ఇప్పటికీ వేనోళ్ళపొగడ్తలందుకుంటూనే ఉంది.హిందూ దేవాలయ సంప్రదా యం కేవలం మన భారతదేశంలోనే కాకుండా అనేక దేశాల్లో కూడా వ్యాపించింది.
జైన, బౌద్ధ మతాల కన్నా హిందూ మతం బాగా పరిఢవిల్లిం దనడం అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనమే ఈ కంబోడియా లోని కొన్ని వం దల సంవత్సరాల క్రితం నిర్మించిన విష్ణూదేవు ని ఆలయం ‘ఆంగ్కోర్ వాట్’. ఆంగ్కోర్ వాట్ దేవాలయం కంబోడియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

హిందూ సంస్కృతీసంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం ఇక్కడ కనిపిస్తుంది. భారతీయ ఇతిహాసాలను తనలో ఇముడ్చుకుని అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు ఈ దేవాల యం ఆ దేశ జాతీయ పతాకంలో కూడా స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖ్మేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురా ర్పణ జరిగింది.
క్రీశ 12వ శతాబ్దకాలంలో ఆంగ్ కోర్ వాట్ను రాజధానిగా చేసుకుని పాలించిన రెండవ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి నట్లు చరిత్ర చెబుతోంది.
దీన్ని నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఈ దేవాలయ నిర్మాణం మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి వుంటాయి.
తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి.
అయితే ఈ దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయం తో ఆహ్లాద భరితంగా ఉంటుంది.మనదేశంలో కూడా లేదు..!భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదనే చెప్పాలి. అద్భుతమైన ఆర్కి టెక్చర్తో ఈ దేవాలయాన్ని రూపొందించారు.
కులేన్ పర్వత శ్రేణుల పాదాల చెంత నిర్మించబడ్డ ఈ దేవాలయం ప్రపచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణు మూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. ఇందులోని ఆలయాలన్నీ హిందూ సంస్కృ తికి దగ్గరగా ఉంటాయి.అత్యత్భుత సాంకేతిక నైపుణ్యం... ఖ్మేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు అద్భుత మైన టెక్నాలజీని ఉపయో గించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించేదట.
అదే టెక్నాలజీని ఆంగ్ కోర్ వాట్ దేవాలయంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమయ్యిందనే విషయం అందర్నీఆశ్చర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటి న్నర మైలు వెడల్పు తో విశాలమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ ‘బారే’లు అంటారు) నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం.
ఈ రిజర్వాయర్లను వ్యవ సాయ అవసరాలకు కూడా ఉపయోగించే వారట. ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వా యర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచారు.

నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారం:

నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధ నలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయట అద్భుతమైన దృశ్యాలు ముఖద్వారం నుండి దేవాలయం లోపలికి వెళ్లగానే చుట్టూ పచ్చని పచ్చికతో అక్కడి వాతావరణమంతా ఆహ్లాదభరితంగా ఉంటుంది. ముఖద్వారం నుండే మూడు పెద్ద పెద్ద గోపురాలు దర్శనమిస్తాయి.

ఇందులో మధ్య గోపురం నుండి లోపలికి వెళ్తే అనేక గోపురాలు కనిపిస్తాయి. ఈ దేవాలయంలో ముఖ్యంగా చెప్పకోవాల్సింది సూర్యోదయం. ఉషోదయ వేళ ఆలయ దర్శనం అద్భుతంగా ఉంటుంది. పొద్దున లేచి గోపురం వెనుక నుండి ఉదయ భానుడు మెల్లిగా నులి వెచ్చని లేలేత కిరణాల్ని ప్రసరింపజేస్తున్నప్పుడు గుడి గోపురాన్ని చూస్తే చాలు... ఎంతసేపైనా ఆ దృశ్యాన్ని అలాగే చూస్తూ ఉండి పోవాలనిపిస్తుంది. ఎండ వేడెక్కి చుర్రుమనిపించే వరకు అలాగే ఉండిపోతారు కూడా.ఎటు చూసినా హిందూ పురాణాలే..! కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి.

ఇక దక్షిణ మండపంలో ఆల యాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్యవర్మన్ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యాలు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర కింపురు షాధి అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్కోర్ వాట్ ఆలయ గోడలపై
సాక్షాత్కరిస్తాయి.
ఈ పేరెలా వచ్చిందంటే...ఇదంతా చదివిన తర్వాత భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంబోడియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు నిర్మించారనే ప్రశ్న తలెత్తే ఉంటుంది కదా? అసలు విషయానికొస్తే పూర్వకాలంలో ‘కాంబోజ దేశం’ అని పిలిచేవారు.

సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరోపియన్లు, కాంబోజదేశాన్ని కంబోడియాగా మార్చేశారు. యూరోపియన్ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంబోజ దేశం కాలక్రమంలో కంబోడియాగా మారిపోయింది.
కంబ ోడియా చరిత్ర...పూర్వకాలంలో కాంబోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది.
9-15 శతా బ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మన్తో పాటు అనేకమంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది.

చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉంది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్ సాప్ నదీ పరివాహక ప్రాంతాన్ని ఏలుతున్న ‘నాగ’ అనే రాకుమార్తెను వివాహం చేసుకుని
ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్ సామ్రాజ్య పురాణగాథల ప్రకారం ఖ్మేర్ సామ్రాజ్యాధినేత అయిన ‘కాము’తో భరత ఖం డానికి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతా బ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సం స్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయా లుగా వెలుగొందాయి. జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాల నుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్కోర్ వాట్
దేవాలయం ఒకటి.మరో అద్భుతం ఆంగ్కోర్ థోమ్...ఆంగ్కోర్ వాట్ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం లో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్కోర్ థోమ్. ఖ్మేర్ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన ‘జయవర్మన్ - 6 ఆంగ్కోర్ థోమ్ను రాజధానిగా చేసుకుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారిత్రక ఆధారాలున్నాయి. దీనినే ‘గ్రేట్ సిటీ’ great city అని కూడా అంటారు.

9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధమత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏను గుల మిద్దెలు, లెపర్ రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత.
ఆంగ్కోర్ థోమ్ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్ టవర్ (బెయాన్) ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.
54 అంతస్తులతో నిర్మించిన బెయాన్ (బుద్ధుని) దేవాలయంలో ఆంగ్కోర్ థోమ్కి ఆకర్షణీయంగానిలుస్తుంది.ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూ చియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ,బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొందాయి.

జీవిత కాలంలోకనీసం ఒక్కసారైనా ఇంత పెద్ద విష్ణుమూర్తి దేవాలయాన్నిదర్శించలనడం అతిశయోక్తి కాదు. ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఆంగ్కోర్ వాట్ వంటి అద్భుత కళాసౌరభం ప్రపంచ వింతల్లో ఒకటిగా చేరకపోవడం బాధాకరం.


Read More

భద్రాచలం పట్టణం (ఖమ్మం జిల్లా)



భద్రాచలం పట్టణం (ఖమ్మం జిల్లా)

భద్రాచలక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలోని , ఖమ్మం జిల్లాలో, గోదావరినది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం. భద్రాచలం పేరు వినగానే మొదటిగా గుర్తుకు వచ్చేది రామాలయం. ఫ్రతిరోజు ఈ పుణ్యక్షేత్రాన్ని వేలాదిమంది రామభక్తులు సందర్శిస్తుంటారు. ముఖ్యంగా పండుగ సమయాల్లో ఈ పట్టణం సుదూరప్రాంతాలనుండి వచ్చే యాత్రికులతో సందడిగా, శోభాయమానంగా ఉంటుంది.

జిల్లాకేంద్రమైన ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణం, భక్త రామదాసు నిర్మించిన రామాలయానికి ప్రసిద్ధి చెందింది. జిల్లాలోని ప్రముఖ పారిశ్రామిక కేంద్రాలైన పాల్వంచ 27 కి.మీ., మణుగూరు 35 కి.మీ.,కొత్తగూడెం 35 కి.మీ. దూరంలోను ఉన్నాయి.
రామాలయ ప్రశస్తి:

పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడుకి తపస్సు చేసి, తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు స్థిరపడింది.

గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానీషా పాలనా కాలంలో భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న అనబడే రామభక్తుడు ఉండేవాడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను(6 లక్షల రూపాయలు) సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశంలోఈ రామాలయాన్ని నిర్మించాడు. దేవునికి రకరకాల నగలు – చింతాకుపతకం, పచ్చలపతకం మొదలైనవి చేయించాడు.

ఆ సొమ్ము విషయమై తానీషా గోపన్నను గోల్కొండ కోటలోబంధించగా, ఆ చెరసాల నుండి తనను విముక్తి చెయ్యమని గోపన్న రాముణ్ణి ప్రార్ధించాడు. ఆ సందర్భంలో రామునిపై పాటలు రచించి తానే పాడాడు. ఇవే రామదాసు కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. గోపన్న కీర్తనలకు కరిగిపోయిన రాముడు, దేవాలయ నిర్మాణానికి ఉపయోగించిన ప్రభుత్వ సొమ్మును తానీషాకు చెల్లించి, గోపన్నకు చెరసాల నుండి విముక్తి ప్రసాదించాడని భక్తుల నమ్మకం. ఆ విధంగా కంచెర్ల గోపన్నకు రామదాసు అనే పేరు వచ్చింది.

దేవాలయంలో సీతా, లక్ష్మణ, హనుమంత సమేతంగా శ్రీరామచంద్రుడు ఇక్కడ అత్మారాముని రూపంలో కొలువుతీరి ఉన్నాడు. సీత, రాముని తొడపై కూర్చొని ఉన్నట్లు ఇక్కడి విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. మరే దేవస్థానంలోనూ లేని ప్రత్యేకత ఇది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా వైభవంగా జరిగే సీతారామ కళ్యాణ ఉత్సవానికి అశేష ప్రజానీకం తరలి వస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కళ్యాణోత్సవానికి ముత్యపు తలంబ్రాలు, పట్టు వస్త్రాలు పంపించడం సాంప్రదాయం. ప్రతి 60 సంవత్సరాలకు ఒకసారి, ఇక్కడ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. రామదాసు చేయించిన వివిధరకాల నగలు దేవస్థానపు ప్రదర్శనశాలలో ప్రదర్శనకు ఉంచారు.

భధ్రాచలంలోని శ్రీరాముడిని వైకుంఠ రాముడు అని అంటారు. ఎందుకంటే ఇక్కడి రాముడు వైకుంఠమునకు వెళ్ళిన తరువాత మరల భూమి మీదకి వచ్చి, తన భక్తుడైన భద్రుడి కోరిక తీర్చి భద్ర పర్వతంపై నిలిచినాడు.
రవాణా సౌకర్యాలు:

మండలకేంద్రమైన భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడనుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెంమీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లునుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్డు స్టేషను అతి దగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి రెండు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.

గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.

వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్ సౌకర్యం కలదు దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్ ఆలయ గాలిగోపురం ముందుకు చేరుస్తుంది.
Read More

యాదగిరి గుట్ట



యాదగిరి గుట్ట

దేశంలోనే ఏకైక నరనారసింహ క్షేత్రం అహోబలం. ఆ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న క్షేత్రం యాదగిరిగుట్ట. ఎందుకంటే ఇది పంచనారసింహ క్షేత్రం.

సృష్టికి పూర్వం శ్రీమహావిష్ణువు నరసింహ రూపంలోనే బ్రహ్మకు దర్శనం ఇచ్చారట.

'ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్ముత్యం నమాన్యహం'

అని మంత్రోపదేశం చేశారట. దీని వల్లే బ్రహ్మకు వేద దర్శనమై, ఆ తరువాత సృష్టి మొదలుపెట్టారట. అంతటి ప్రాముఖ్యం ఉన్న అవతారం నృసింహావతారం. అలాంటి నారసింహుడు వెలసిన పవిత్ర క్షేత్రం యాదగిరి.

స్థలపురాణం

యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే మాదర్షి అంటారు. చిన్నపట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి 'నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠినంగా తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు' అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరారట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి 'ఏం కావాలో కోరుకో' అని అడిగాడు స్వామి.

'నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో' అని కోరారట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి ప్రత్యక్షమైయ్యాడు.

'నా రూపాలన్నీ నువ్వు చూడలేవు' అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చారు. జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి...తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నారట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది.

దేవాలయ విశిష్ఠత

ఆ తరువాత దాని గురించి ఎవరికీ తెలియదు. యాదగిరి ప్రాంతమంతా సామాన్యులు చొరబడలేని ఆరణ్యప్రాంతం కావడంతో ఇటీవల వరకు అనగా 19వ శతాబ్దం వరకు స్వామికి నిత్యధూపదీప నైవేద్యాలు జరిగే అవకాశం లేకపోయింది. శ్రీకృష్ణదేవరాయలు దర్శించుకొని వెళ్లిన తర్వాత కూడా చాలా కాలం వరకు దుర్గమమై ఉన్నందున ఈక్షేత్రాన్ని ప్రజలు మరచిపోయే వరకు వచ్చింది. కాగా సుమారు రెండు వందల సంవత్సరాల క్రిందట ఒకరోజు రాత్రి ఈ ప్రాంత గ్రామాధికారికి స్వామి కలలో కనిపించి తాను ఈ ప్రాంతంలోనే నాలుగు రూపాల్లో ఉన్నానని గుర్తులు చెప్పారట. గ్రామాధికారి వెళ్ళి రేఖామాత్రంగా ఉన్న స్వామిరూపాలనూ, గుహనూ, ఆంజనేయుణ్ణీ కనుగొన్నారట. అప్పట్నుంచీ స్వామికి పూజాదికాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గుల్లపల్లి రామభట్టును నియమించారు. వారి సంతతి వారే వంశపరపరంగా ఈక్షేత్రాన్ని అంటి పెట్టుకొని సేవలు చేస్తున్నారు.

గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి. లక్ష్మీనరసింహ స్వాములను చూడొచ్చు.

గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కిందన ఉన్న పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం కనిపిస్తాయి.

ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. దీనినే "విష్ణుకుండం" అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది.

భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈక్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరబాద్‌ వాస్తవ్యుడైన రాజామోతీలాల్‌ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించాడు. స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుచుతూ వచ్చారు. ప్రస్తుతం ఈక్షేత్ర యాజమాన్యం దేవాదయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరిలక్ష్మీనర్సింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్నది.

ఈ క్షేత్రంలో' ప్రదక్షిణల మొక్కు' ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్థమడలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు. ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు శత్ర చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు.

బ్రహ్మోత్సవాలు

సత్యనారాయణస్వామి వ్రతాలకు అన్నవరం తర్వాత అంత ప్రసిద్ధి చెందిన క్షేత్రం యాదగిరిగుట్ట. రోజులో నాలుగుసార్లు ఈ వ్రతాలు జరుగుతాయి.

శ్రీ యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా ఫాల్గుణశుద్ధ విదియ నుంచి మొదలై ద్వాదశి వరకు 11 రోజుల పాటు కన్నుల పండవగా కొనసాగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని విశేష అలంకారాలు, సేవలు నిర్వహిస్తారు. 11 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఎదుర్కోళ్ళు, కళ్యాణం, రథోత్సవం ముఖ్యమైనవి. బ్రహ్మాత్సవాలలో భాగంగా స్వామి జగన్మోహిని , రామ, కృష్ణ, నరసింహ అవతరాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఉదయం పూట అలంకారాలు, సాయంత్రం పూట సేవలు నిర్వహిస్తారు. బ్రహ్మాత్సవాలను పురస్కరించుకొని స్వామి వారికి కేశవాహాన సేవ, అన్నవాహాన సేవ, కల్పవృక్షం, గరుడసేవ, అశ్వవాహాన సేవలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సేవల సందర్భంగా స్వామి అమ్మవారులను పట్టుపీతాంబరాలు, వివిధ బంగారు ఆభరణాలు, పూలతో శోభాయమానంగా అలంకరించి పుర వీధులలో ఊరేగిస్తారు. ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేందుకు 75 మంది రుత్వికులతో రామాయణం, మహాభారతం, భాగవతం, విష్ణుసహాస్రనామాలు, సుందరకాండ పారాయణాలు చేస్తారు.

మార్గం

యాదగిరి గుట్ట హైదరాబాద్‌ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులున్నాయి. హైదరాబాద్‌ - వరంగల్‌ జాతియ రహదారిలో రామగిరిక్రాస్‌ రోడ్డు నుంచి రావొచ్చు. రైలుమార్గంలో భవనగిరి, రాయగిరి, ఆలేరు రైల్వేషేషన్లలో దిగి స్వామి సన్నిధికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ నుంచి సరికొత్తగా 'యాదగిరి రోడ్డు' పేరిట 8 లైన్ల రహదారి నిర్మాణపనులు చేపట్టారు.

వసతి విషయానికి వస్తే...ఆలయాన్ని ఆనుకునే అనేక వందల గదులు గల ఎన్నో సత్రాలు ఉంటాయి. ఇందులో కొన్ని ఉచితంగా ఇచ్చే గదులు కూడా ఉంటాయి. అద్దె గదులు వంద రూపాయలలోపు దొరుకుతుంటాయి. ఇక భోజన సౌకర్యం కోసం ఈ ప్రాంతంలోనే భక్తులను, పర్యాటకులను ఆకర్షించే విధంగా పలు రకాల హోటళ్లు ఉన్నాయి.
Read More

మురుడేశ్వర క్షేత్రం



మురుడేశ్వర క్షేత్రం

మురుడేశ్వరం 17వ నంబరు జాతీయ రహదారిలో కర్ణాటకరాష్ట్రంలోని ఉత్తర కన్నడజిల్లాలో బత్కల్‌ తాలూకాలో ఉంది. ఇక్కడికి కర్ణాటకలో ముఖ్య నగరాలైన బెంగుళూరు, మంగళూరు, హుబ్లీ, ధర్మస్థల మొదలయిన నగరాలనుండి బస్సులు ఉన్నాయి. మురుడేశ్వరానికి రైలుమార్గం కూడా ఉంది. కొంకొణ రైల్వేవిభాగంలో మురుడేశ్వర రైల్వేస్టేషన్‌ ఉంది. గోకర్ణం నుంచి మురుడేశ్వరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.

స్థలపురాణం:

రావణాసురుడు కైలాసం నుండి పరమేశ్వరుడిని వేడుకుని తెచ్చిన ఆత్మలింగానికి, మురుడేశ్వర క్షేత్రంలోంలోని లింగానికి సంబంధం ఉంది. రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగాన్ని గోకర్ణక్షేత్రంలో బ్రాహ్మణవటువు రూపంలో వచ్చిన గణపతి భూమిమీద పెడతాడు. వెంటనే ఆత్మలింగం భూమినుండి బయటకి తీసుకురావడానికి వీలుకాకుండా భూస్థాపితమయింది. సాయంసమయాన ఆర్ఘ్యాన్ని వదలడానికి వెళ్ళిన రావణాసురుడు భూమిలో నుండి బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఆత్మలింగం బయటకు రాదు. అప్పుడు రావణాసురుడు ఆగ్రహంతో ఆత్మలింగంపై ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరిపారేస్తాడు. ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో, అక్కడ శివలింగాలు ఉద్భవించి, ఆ ప్రదేశాలు మహామహిమాన్వితమయిన పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. ఆప్రదేశాలు, గోకర్ణక్షేత్రం దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వరాలు. గోకర్ణక్షేత్రంతో కలిపి ఈ క్షేత్రాలన్నీ పంచక్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి. ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరివేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం మురుడేశ్వరం అయింది. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. అంటే సంతోషం అనే అర్థం కూడా ఉంది. అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడున్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం మురుడేశ్వరం అయిందని కూడా అంటారు.

పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు ఐదుక్షేత్రాలను దర్శించి, అక్కడి శివలింగాలను పూజించారట. పార్వతీ పరమేశ్వరులు ఈ ఐదుక్షేత్రాలలో ఒక్కొక్కచోట వారం రోజులపాటు ఉండి పూజలు చేశారట. ఇక్కడికి దేవతలతో పాటు ఋషులు, మునులు కూడా వచ్చి పూజలు చేశారట.

మురుడేశ్వరంలో ఉద్భవించిన శివలింగానికి పానవట్టాన్ని తయారు చేయడానికి, దేవశిల్పి విశ్వకర్మను పరమేశ్వరుడు పిలిపించి అభ్యర్థించగా, విశ్వకర్మ పానవట్టాన్ని తయారుచేశారట. మురుడేశ్వరక్షేత్రం, కందూక పర్వతం మీద అరేబియా సముద్రతీరంలో ఉంది. ఈ పర్వతం బంతి మాదిరిగా (కందూకం అంటే బంతి అని అర్థం) ఉంది కాబట్టి, ఈ పర్వతానికి కందూక పర్వతం అనే పేరు వచ్చింది. ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలన్నీ నెరవేరి, మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. మురుడేశ్వరస్వామికి, శివరాత్రినాడు, బిల్వపత్రంతో పూజలు చేసిన వారికి మరణభయం లేకుండా స్వర్గప్రవేశం కలుగుతుందని స్థల పురాణం తెలియజేస్తోంది.

ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీదేవత, తూర్పున మహాదుర్గదేవత, ఇతర దేవతలందరూ మిగతా దిక్కులలో కొలువైఉండి, రక్షిస్తున్నారట. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పత్రాలు, పూలు, పండ్లతో పూజిస్తాడట. బ్రహ్మదేవుడు ఇక్కడి పరమేశ్వరుడి విగ్రహంపై కమండలంతో చల్లిన నీళ్లతో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సుగా ఏర్పడిందట.

ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారట. అప్పుడు ధర్మరాజు, భీముడిని మురుడేశ్వరుడికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడానికి గంగాజలాన్ని వెంటనే తెమ్మన్నాడు. అప్పుడు పరమేశ్వరుడిని ధ్యానిస్తే గంగాజలం వెంటనే లభిస్తుందనుకున్న భీముడు పరమేశ్వరుడిని ధ్యానం చేసాడు. కానీ, పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. అప్పుడు భీముడు తన తలను భూమిమీద కొట్టుకున్నాడు. వెంటనే పరమశివుడు అనుగ్రహించి గంగామాతని హిమతీర్థంగా సృష్టించాడు. భీముడు తన నెత్తిని నేలపై కొట్టిన స్థలమే ప్రస్తుతం భీమతీర్థంగా పిలువబడుతోంది.

బ్రహ్మహత్యా పాతకానికి శిక్షను తప్పించుకోవడానికి, ఇంద్రుడు స్వర్గాన్ని వదలి, మురుడేశ్వరానికి వచ్చి ఇక్కడ మురుడేశ్వరస్వామి అనుగ్రహానికి పాత్రుడు కావడానికి పూజలు చేశాడు. ఇక్కడ ఇంద్రుడు ఉన్నప్పుడు, దేవతలందరూ వచ్చి మురుడేశ్వరస్వామిని పూజించారట. కోండమీద సముద్ర సమీపంలో ఉన్న మురుడేశ్వరస్వామి దేవాలయానికి సహజమైన సౌందర్యం, ఆకర్షణ ఉన్నాయి.

దేవాలయ విశిష్టత:

ఇక్కడికి దేశంలో అన్ని ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామికి పూజలు చేస్తూంటారు. స్వామిని దర్శించి పూజించడం వల్ల తమ కోరికలన్నీ తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. దేవాలయంలో అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలయిన ఆరాధనలు జరుగుతాయి. ఈ క్షేత్రంలో రకరకాల ఆర్జిత సేవలు చేయబడుతున్నాయి. అన్నసంతర్పణ సేవ, నిత్యసేవ, నందదీపసేవ, ఒక రోజు అన్నసంతర్పణం, సర్వదేవపూజ అంటూ సుమారు 50 రకాల పూజావిధానాలున్నాయి. ఈ పూజకు 5000 రూపాయల నుంచి 10 రూపాయల వరకు రుసుము వసూలు చేయబడుతోంది. శివరాత్రి ఉత్సవములు, పుష్యమాసంలో రథీత్సవం ఇక్కడ వైభవంగా జరుగుతాయి. ఈ ఉత్సవములను చూసేందుకు దూరప్రాంతాల నుంచి కొన్ని లక్షలమంది భక్తులు వస్తుంటారు.

మురుడేశ్వర దేవాలయం, ఆధునిక కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, విశేషప్రతిభకు ఒక ప్రముఖ నిదర్శనం. ఎత్తైన దేవాలయాన్ని (18 అంతస్తులు) చూసినవారు, ఇటువంటి నిర్మాణం ఎలా సాధ్యమయిందని ఆశ్చర్యపోతారు. దేవాలయ పునర్నిర్మాణం పూర్తిగా విశిష్టమయిన పాలరాతితో జరిగింది. మురుడేశ్వర దేవాలయ ఆవరణలో కనబడే ఎత్తైన శివుని పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ భారీ విగ్రహాన్ని నిర్మించడానికి సుమారు రెండు సంవత్సరాల సమయం పట్టింది. మురుడేశ్వర విగ్రహ ఆవిర్భావానికి సంబంధించిన కథలను తెలియజేసే శిల్పాలు, చిత్రాలు, ఆధునిక భారతదేశంలో అత్యుత్తమ శిల్పకళకు నిదర్శనాలు.

ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. ప్రాచీనకాలం నాటి ఈ దేవాలయం కాల ప్రవాహంలో శిథిలావస్థకు చేరుకుంది. ఆ శిథిలావస్థ నుండి, అందరి ప్రశంసలను అభినందనలను అందుకునే స్థితికి రావడానికి ఆర్‌.ఎన్‌. శెట్టీ అనే భక్తుడు ముఖ్య కారకుడు. అతని అకుంఠిత దీక్ష, భక్తి, పట్టుదల వల్ల ఈ మురుడేశ్వర దేవాలయ పునర్నిర్మాణం ఎంతో ఘనంగా జరిగింది. 20 అంతస్తులతో కూడిన ఆలయ గాలిగోపురం 249 అడుగుల ఎత్తుతో గంభీరంగా దర్శనమిస్తుంది. గాలి గోపురానికి ఇరుప్రక్కల ఏనుగు ప్రతిమలు నిజమయిన ఏనుగుల వలెనే భ్రమింపజేస్తుంటాయి. ఇప్పుడు ఈ క్షేత్రం ప్రపంచంలోని వారందరినీ ఆకర్షిస్తుంది. అందుకే సంవత్సరమంతా రద్దిగా ఉంటుంది.

మురుడేశ్వరంలో పవిత్రస్నానాలు చేయడానికి అనేక తీర్థాలున్నాయి. బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం, అందులో ముఖ్యమయినవి. ఈ తీర్థాలన్నీ దేవాలయం అవతల నగరంలో వున్నాయి. ఈ తీర్థాలలో, ఇక్కడి సముద్రంలో స్నానం చేయడం వల్ల, ధీర్ఘకాల రోగాలు నయమయి, తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

మురుడేశ్వర ఆలయ ప్రాకారంలోనే, ఇతర దేవతల చిన్న మందిరాలు ఉన్నాయి. వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, అంజనేయ మందిరాలు ముఖ్యమయినవి. ఇక్కడ భక్తులు ప్రతిష్ఠించిన నాగప్రతిమలు కూడా ఉన్నాయి. దేవాలయ ఆవరణలో ధ్వజస్తంభం, నందిమండపం, యజ్ఞమండపం కూడా ఉన్నాయి. దేవాలయమ ప్రాంగణంలోనున్న రావిచెట్టు చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి తమ కోరికలను నెరవేర్చమని, చెట్టుకు ముడుపులు కడుతూంటారు. చెట్టునిండుగా ముడుపులను చూడగలం.

ఇక్కడ యాత్రీకులు ఉండడానికి వసతి గృహాలు, హోటళ్ళూ ఉన్నాయి. మురుడేశ్వరాలయం ప్రతి భారతీయుడికి గర్వకారణం. ప్రతీ భారతీయుడు సందర్శించవలసిన పవిత్ర పుణ్యక్షేత్రం మురుడేశ్వరం.
Read More

అరుణాచలం



అరుణాచలం

తిరువణ్ణామలై(తమిళనాడు)లో తేజోలింగము ఉంది . ఈ స్వామిని "అరుణాచలే్శ్వర స్వామి" అనిపిలుస్తారు. తేజోరూపాన వెలసిన అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతీక.

ఈ క్షేత్రాన్ని భూమికి హృదయ భాగంగా చెప్పుకుంటారు. సృష్టి , స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువులు ఒకసారి తమలో తాము ' ఎవరు గొప్ప ' అన్న విషయమై వాదించుకుంటుండగా ఆ సంవాదాన్ని నివారించేందుకు శివుడు తేజోలింగ రూపంగా వెలసింది ఇక్కడే అని స్థలపురాణం(అదే మహాశివరాత్రి పర్వదినానికి మూలం).అప్పుడు శివుడు కార్తీకమాసంలో అగ్ని లింగంగా దేవతలకు దర్శనమిస్తానని వరమిచ్చారట. అందుకు గుర్తుగా ఏటా తమిళకాలం ప్రకారం కార్తీకమాసంలో ఇక్కడ దీపోత్సవం జరుపుతారు.


అలా ఒకనాడు శివుడు వెలసిన అరుణాచలం చుట్టూ(12కి.మం.దూరం) ప్రదక్షిణ చేయడాన్ని సాక్షాత్తూ ఆ స్వామికే ప్రదక్షిణ చేసినట్లుగా భక్తులు భావిస్తారు. దానిని 'గిరి ప్రదక్షిణం' అంటారు.

కంచిలో పుట్టడం, కాశీలో మరణించడం ఎలా ముక్తినిస్తాయో అలా అరుణాచలం గురించి ఆలోచిస్తే చాలు మోక్షం లబిస్తుందని విశ్వాసం.

అరుణాచల ఆలయ ప్రాంగణంలోని నైరుతిమూల ఉండే పాతాళలింగాన్నే రమణ మహర్షి ఆరాధించారు.

ఇక్కడి విశేషమేమిటంటే .. పంచభూతలింగాల్లో మిగతావైన ఏకాంబరేశ్వర, జంబుకేశ్వర, శ్రీకాళహస్తీశ్వర, చిదంబర లింగాల ఆలయాల నమూనాలను ఈ ప్రాంగణంలోని మూడోప్రాకారంలో దర్శించవచ్చు. అంటే.. అన్ని చోట్లకూ వెళ్ళలేని వారు ఒక్క అరుణాచలాన్ని దర్శిస్తే సరిపోతుందన్నమాట. ఇంక.. చిత్రగుప్తుడికీ ధర్మదేవతకూ కూడా ఆలయాలు ఉండటం ఇక్కడే చూస్తాం. ఇక్కడ అమ్మవారు ఉణ్ణామలై.

25ఎకరాల విస్తీర్ణంలో 217అడుగుల ఎత్తైన 11 అంతస్తుల భారీ రాజగోపురంతో పెద్ద పెద్ద ద్వారాలతో కుండాలు ఏడు ప్రాకారాలతో బాగా ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే పెద్ద కోటలా దర్శనమిచ్చే ఆర్కిటెక్చర్ అద్భుతం అరుణాచలం ఆలయం. ప్రస్తుతమున్న గుడిని పల్లవరాజులు కట్టించారు. అంతకు ముందు ఈ నిర్మాణం గురించి చారిత్రక ఆధారాలు ఎక్కడా లేవు.

ఈ తిరువణ్ణామలై మద్రాసుకు 165కి.మీ దూరంలో ఉంది. విల్లుపురం నుంచి కాట్పాడికి వెళ్లే మార్గంలో ఉంది. విల్లుపురం నుంచి 68కి.మీ


Read More

కాణిపాకం



కాణిపాకం

కాణిపాకం ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన గ్రామము. ఈ పుణ్యక్షేత్రం తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది.

స్థలవిశిష్ఠత:

ఈ కాణిపాకం గ్రామాన్ని పూర్వం 'విహార పురి ' అని పిలిచేవారు. విహరపురి గ్రామంలో పుట్టకతోనే అవిటివాళ్లైన ముగ్గురు సోదరులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరిలో పెద్దవాడు అంధుడు, రెండోవాడు మూగవాడు, మూడోవాడు చెవిటివాడు. విహారపురి పరిసరప్రాంతాలు ఓ ఏడాది వర్షభావాపరిస్థితుల వల్ల తాగునీటికి, సాగునీటికి ఇబ్బంది పడసాగాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలు బ్రతుకు తెరవు కోసం దూరప్రాంతాలకు వలసలు పోయారు. విహారపురి గ్రామస్థులు కూడా నీటికరువుతో పంటలు ఎండిపోయినందున, ఇతర ప్రాంతాలకు జీవనోపాధికై వెళ్లిపోవడం ప్రారంభించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ రోజు , అ ముగ్గురు సోదరులు వలస వెళ్లాలా? లేక అక్కడే ఉండాలా అని తీవ్రంగా తర్జనభర్జన చేశారు. పుట్టుకతోనే అవిటివాళ్లమైన మనం ఒకరిపై ఒకరు అధారపడి ఉన్నందున, వేరే చోటికి వెళ్లే కన్నా ఇక్కడే ఉండి వ్యవసాయం చేసుకుందామని ముగ్గురు సోదరులూ నిర్ణయించుకున్నారు. భగవంతునిపై భారం వేసి వ్యవసాయం చేసుకుందామనుకున్నారు.

తమ వ్యవసాయపు బావిలో పూడిక తీస్తే పంటలకు సరిపోయే నీరు లభించవచ్చని వారు భావించి, పూడిక తీయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. తమ పొలానికి సమీపంలో ఉన్న వరదరాజస్వామి దేవాలయంలో పూజలు చేసి, ఆ సోదరులు బావి దగ్గరకు చేరుకుని, పూడిక తీయడం ప్రారంభించారు. పెద్దవాడైన అంధుడు ఏతం తొక్కగా, చెవిటి, మూగలిద్దరూ బావిలో దిగి పూడిక మట్టిని తవ్వి, తీసి ఏతం బానలో పోస్తున్నారు. ఏతం బానలోని మట్టిని పైనున్న గుడ్డివాడు పైకి చేది, దూరంగా వేస్తున్నాడు. బావిలో పూడిక కోంత లోతు తవ్విన తరువాత , ఓ బండరాయి బయల్పడి పనికి ఆటంకమైంది. సొదరులిద్దరూ ఎంత ప్రయత్నించినప్పటికీ అ రాయిని పెకలించలేకపోయారు. బండరాయి తమ ప్రయత్నానికి అడ్డుపడుతుందనే బాధ, కోపంగా మారడంతో ఓ సోదరుడు చేతిలోని పారతో బండరాతిపై బలంగా మోదాడు. ఆ దెబ్బ తగిలిన చొటి నుంచి, మనిషి తల పగిలితే వచ్చే శబ్దం వచ్చింది. బండరాతి మీద దెబ్బ తగిలిన వెంటనే, ఆకాశంలో వినిపించిన భయంకరమైన ఉరుముల శబ్దనికి బావిపై వున్న గుడ్డివాడు భయంతో వణికిపోతూ ఏమి జరిగిందని తమ్ములను గట్టిగా అడిగాడు. లోపలున్న సోదరులిద్దరికీ ఇవేమీ పట్టలేదు. దెబ్బ తగిలిన రాతి నుండి ధారాళంగా కారుతున్న రక్తాన్ని అశ్చర్యంగా చూస్తున్న మూగవాడు, భయంతో 'కెవ్వున' కేక వేయగా, ఆ కేకను చెవిటివాడు స్పష్టంగా విన్నాడు. బావిలో నుంచి తమ్ములిద్దరి కేకలకూ భీతిల్లిన గుడ్డివాడు పట్టుతప్పి, బావిలోకి జారిపడ్డా డు. గుడ్డివాడు బావిలోని నీటిని తాకగానే అతని 'అంధత్వం' నశించి, చూపు వచ్చింది.

బావి లోపల బండరాతి నుంచి ధారాళంగా స్రవిస్తున్న రక్తాన్ని చూసిన సోదరత్రయం భయంతో కేకలేస్తూ, గ్రామంలోకి పరుగెత్తి, జరిగిన విషయాన్ని గ్రామస్థులందరికీ వివరించారు. సోదరులతో పాటూ బావి వద్దకు చేరుకున్న గ్రామస్థులు బావిలోకి దిగి బండరాతి చుట్టూ ఉన్న మట్టిని పెకలించగా, వారికి ఆ రాయి విఘ్నేశ్వరుడి తల వలె కనిపించింది. అంగవైకల్యాన్ని రూపుమాపిన బండరాతిని వినాయకుడిగా గుర్తించిన గ్రామప్రజలు, ఆ రాతికి గంధ పుష్పాక్షతలతో పూజలు చేసి, అర్చించి, అప్పాలు, పానకం, పిండివంటలతో నైవేద్యం సమర్పించారు. భక్తులు వినాయకునికి భక్తి పూర్వకంగా కొబ్బరికాయలు సమర్పించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో భక్తులు సమర్పించిన నారికేళాల నీరు, దాదాపు "కాణి " పొలం మేర పారాయి. (కాణి అనగా ఎకరం పాతిక భూమి) కొబ్బరి నీటితో, 'కాణిపొలం'లో పారినందున ఈ గ్రామానికి కాణిపారకం అనే పేరు వచ్చింది. ఆ కాణిపారకం కాలక్రమేణా "కాణిపాకం" గా రూపాంతరం చెందింది.

విశేషాలు:

సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉన్నది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామి వారికి 50 సంవత్సరాల క్రితం స్వామికి చేయించిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవటం లేదని చెబుతారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్థి వినాయకునిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామి వారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండుగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారి విగ్రహానికి వెనుక వైపు పార వేటుతో పడిన గాయం గుర్తు, నేటికీ కనిపిస్తుంది. నాడు తల మాత్రమే కనిపించిన వినాయకుని విగ్రహానికి నేడు ఉదరం, మోకాళ్లు కూడా కనిపిస్తున్నాయి.

బావి నీటి ప్రాముఖ్యం:

వరసిద్ధి వినాయకస్వామి వెలసిన బావిలోని నీరు చాలా శ్రేష్ఠమైనదని పండితుల ఉవాచ. వర్షాభావపరిస్థితులు ఎంత తీవ్రమైనప్పటికీ, కరువుకాటకాలు చుట్టుముట్టిన సందర్భాల్లో కూడా ఈ బావిలోని నీరు ఇంకిపోదు. ఈ నీటి స్పర్శతో అంగవైకల్యం నుంచి ముగ్గురు సోదరులు విముక్తి పొందిన విషయం తెలిసిందే కదా! అంతటి మహత్తు కలిగిన నీటిని పూజారులు వినాయకుని తీర్థంగా భక్తులకు నేటికీ ఇస్తున్నారు. ఈ నీటిని సేవించిన భక్తులకు సకల రోగాలూ తొలగిపోయి, మనోభీష్టాలూ పొందుతారని ఇక్కడి ప్రజల నమ్మకం.

" ప్రణమ్యా శివసాదేవం గౌరీపుత్రం వినాయకం..
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే"

అని తలిచిన భక్తులకు ఆపన్నహస్తం అందించి ఆదుకునే దైవంగా, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు ప్రసిద్ధి కెక్కాడు. తన దగ్గర తప్పుడు ప్రమాణాలు చేసిన వారిని శిక్షించి, నిజాయితీగా ఉన్నవారిని రక్షించడం ఈ వినాయకుని విశిష్టత. అందుకే కాణిపాకంలో వెలిసిన వరసిద్ధి వినాయకుడు సాక్షిగణపతిగా కూడా పేరొందినట్లు స్థానికుల వల్ల తెలుస్తోంది.

బ్రహ్మోత్సవాలు:

ప్రతీ ఏడాది భాద్రపద శుద్ధచవితి నుంచి వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలు జరుపుతారు. దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం సంప్రదాయం. ఐతే కాణిపాకంలో మాత్రమే, వరసిద్ధి వినాయకుని బ్రహ్మోత్సవాలను చవితి రోజు మొదలుపెట్టి 21 రోజులు నిర్వహిస్తారు. హంస, నెమలి, మూషికం, శేషవాహనం, వృషభం, గజవాహనం, రథోత్సవం, తిరుకల్యాణోత్సవం, ధ్వజారోహణం, వడాయత్తు ఉత్సవం, అధికారనందివాహనం, రావణబ్రహ్మవాహనం, యాళివాహనం, సూర్యప్రభ, చంద్రప్రభ, కల్పవృక్షం, పుష్పపల్లకి, కామధేనువాహనం, విమానోత్సవం, తెప్ప తిరుణాల వంటి సేవలు బ్రహ్మోత్సవాల్లో నిర్వహిస్తారు.

ఇతర దేవాలయాలు:

ఈ ఆలయానికి పడమట రెండు ఫర్లాంగుల దూరంలో ఈశ్వరాలయం ఉంది. పార్వతీ దేవి, కుమార స్వామి ఆలయాలు ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి. గర్భాలయం వెలుపల నందీశ్వరుడున్నాడు. నందీశ్వరుని కొమ్ముల దగ్గర గర్భాలయం గోడకు చిన్న రంధ్రం ఉంది. ఆ రంధ్రం నుంచి గుడి లోకి చూచి నట్లైతే ఈశ్వర లింగం కనిపిస్తుంది. వినాయకుని ఆలయానికి ఎడప వైపున కళ్యాణ కట్ట, దుకాణాల సముదాయం, ముందు వైపున చతురస్రాకారంలో ఉన్న పెద్ద పుష్కరిణి ఉంది. వినాయకాలయం లోపల ఎడమ వైపున ఆంజనేయ స్వామి గుడి, గర్భాలయం వెనుక వైపున నాగుల కట్ట, కుడి వైపున నవ గ్రహాలు ఉన్నాయి.

రవాణా, వసతి సదుపాయాలు:

ఆలయం లోపల దేవస్థానం వారి దుకాణ సముదాయం ఉంది. ఆలయానికి చేరువలో బస్ స్టాండ్‌ ఉంది. కాణి పాకానికి వివిధ ప్రాంతాల నుంచి రవాణా సౌకర్యాలున్నాయి. తిరుపతి నుంచి ప్రతి అర్ధ గంటకూ ఒక బస్సు ఉంది. చిత్తూరు నుంచి లెక్కలేనన్ని బస్సులు రాత్రి పది గంటల వరకూ యాత్రికులను చేర వేస్తూనే ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చిత్తూరు వరకూ రైలులో ప్రయాణించే సౌకర్యం ఉంది.

భక్తుల కోసం టి.టి.డి. వసతి సౌకర్యం కల్పించింది. ఇవే కాకుండా చాలా ప్రైవేటు వసతి సౌకర్యాలు కూడా ఉన్నాయి.
Read More

1. మానస సరోవరం, 2. పంపా సరోవరం, 3. పుష్కర్‌ సరోవరం, 4. నారాయణ సరోవరం, 5. బిందు సరోవరం,



మన సంసృతి సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాము. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడ ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలని పిలుచుకుంటున్నాం. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు 'పంచ సరోవరాలు' గా ప్రసిద్ధికెక్కాయి. అవి:


1. మానస సరోవరం, 2. పంపా సరోవరం, 3. పుష్కర్‌ సరోవరం, 4. నారాయణ సరోవరం, 5. బిందు సరోవరం,


2. పంపా సరోవరం

పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.

ఆ కథ ప్రకారం, ఒక బోయకాంత అయిన శబరి, పంపానదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది.

సీతాన్వేషణలో కబంధుని సూచనను అనుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది. "శ్రీ రామచంద్రమూర్తి! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికి తపః సిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓ పురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించినట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్దురాలినయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్యలోకాలకు చేరుకుంటాను. స్వామీ, మతంగముని శిష్యులకు సేవ చేస్తూండేదానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచీ మీకోసం ఎదురుచూస్తూ, పండ్లు ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి నువ్వు నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి" అని అభ్యర్థించగా, శ్రీరాముడు "శబరీ! కబంధుడు నీ గురించి, నీ గురువుల గురించి చెప్పారు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుపవలసింది" అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.

"ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షిగణాలతో ఈ మతంగ వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను చేసేవారు. వారి తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్తసాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది. రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆస్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.

హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు - హుబ్లీ రైలు మార్గంలోనున్న హోస్పెటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.

3.పుష్కర సరోవరం

పద్మపురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట. అవి పలికిన స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆ వృక్షాలను ఏదైనా వరం కోరుకొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమైయ్యాడట.

ఈ సరస్సు రాజస్థాన్‌లోని అజ్మీరుకు ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే బ్రహ్మదేవుని ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణగా 9 వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని చెబుతూంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పాణాలను చేస్తుంటారు.

4.నారాయణ వన సరోవరం

ఈ సరోవరం గుజరాత్‌ రాష్ట్రంలో కచ్‌ ప్రాంతంలో ఉంది. గుజరాత్‌లోని భుజ్‌ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణ వన సరోవరం ఉంది. ఈ నారాయణ వన పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థలపురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది. ఒకసారి పరమశివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, ఆశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడవేస్తాడు. దాంతో కోపగించుకున్న శివపరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్లిపోయాడని కథనం. ఇలా శివుడు నారాయణ వన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువబడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.

భుజ్‌ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం రెండుగంటల ప్రయాణమే కాబట్టి, ప్రయాణానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. నారాయణవన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి.

5. బిందు సరోవరం

గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.

ఓ పురాణ కథనం ప్రకారం,స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్తవయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్రయత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం.

కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు.

ఆ పుత్రుడే కపిలుడు.

ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.

బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్‌ అహ్మదాబాద్‌ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టనాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్‌ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి. అహ్మదాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందుసరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.

ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచసరోవర యాత్రలను చేస్తుంటారు. మరికొంతమంది ఆయా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడున్న సరోవరాలను దర్శించుకుంటుంటారు. మొత్తం మీద పంచసరోవరాల దర్శనం ఉభయతారకం. ఎందుకంటే ఒకప్రక్క తీర్థయాత్రను చేసిన అనుభూతితో పాటు, మరో ప్రక్క పితృదేవతలకూ తర్పణాలను విడిచి, వారికి ఉత్తమలోక గతులను ఏర్పరచి, పితృదేవతల్ను తృప్తి పరిచినట్లు అవుతుంది. ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల మనలో మానసికతీర్థాలు కూడ నెలకొంటాయి. అవి: సత్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, దయ, ఋజుత్వం, దానం, తృప్తి, బ్రహ్మచర్యం, మధురసంభాషణం, జ్ఞానం, తపశ్చర్యలు తదితరాలు మానసిక తీర్థాలు. ‌
Read More

Saturday, 21 March 2015

కాకికి అన్నం పెట్టండి, గయక్షేత్ర మహాత్మ్యం :



కాకికి అన్నం పెట్టండి

కాకి శనైశ్చరుని వాహనం అనితేలుసు కాని పితృదేవతల ఆరాధనలో కాకికి ముఖ్యత్వం వుందనేది తెలుసా కాకి యమలోక ద్వారం వద్ద వుంది యమధర్మరాజుకు దూతగా కూడా వ్యవ్యహరిస్తుంది కాకికి అన్నం పెడితే యమలోకమందు వుండు పితరులకు ఆకలి తీరుతుంది మన పితరులకు శాంతి చేకూరి మనకు ఆశీస్సులు లభిస్తుంది కాకి మనం పెట్టిన అన్నం ముత్తకున్దాపోతే మన పితరులకు మనపైన నిరాశ నిస్పృహ కలిగింది అని మనం తెలుసుకోవాలి గయ క్షేత్రంలోని శిలకు కాకశిల అనికూడా పేరు కలదు ఆ శిలపైనే మనము పిండము వుంచి పితరులను ప్రార్తిస్తాము


గయక్షేత్ర మహాత్మ్యం : మన సంప్రదాయంలో ప్రయాగ కాశి గయలో పితరులకు పిందదానాదులు చేయడం ఒక పరిపాటి. మనం ఇంటిలో చేసే పార్వణ స్రాద్ధములో అక్షయవటం గయ క్షేత్రం అనేది తరచూ వింటూ ఉంటాము అక్షయ వటం అనే మఱ్ఱిచెట్టు గయలో వుంది దాని మూలవేరు ప్రయాగాలోను మంధ్య భాగం వారణాసిలోను వ్యాపించి వుంది ఈమూడు స్థలములను వటవృక్షము ఒకటిగా కలుపుతుంది గయలో అన్నశ్రాద్ధం పెట్టడం చాల ప్రశస్తం గయాసురుడు అనే రాక్షసుడు బ్రంహవద్ధ వరం కోరుకుంటాడు తన దేహమును ఎవరు స్ప్రుసిస్తారో వారందరికీ స్వర్గం ప్రాప్తించాలని అతను వరం ఇవ్వడంతో అందరు స్వర్గమునకు వెళ్ళడం ప్రారంభం అయ్యింది మంచి చెడ్డ పాప పుణ్యం ఎమిలేకుండా వెళ్ళు చుండిరి ఇది చూసి దేవతలు మహావిష్ణువును ప్రార్థించగా విష్ణువు గయాసురుని తలపైన తన పాదము పెట్టి పాతాలలోకమునకు పంపివేసెను విష్ణుపాదం తగలడంతో పునీతుడైన గయాసురుడు విష్ణువును వరంకోరుకుంటాడు

ప్రపంచములో అందరు తమ తల్లితండ్రులు బ్రతికి ఉన్నంత వరకు అభిమానం ప్రేమతో చూసుకొని తర్వాత వారికి తర్పనాదులు శ్రాద్ధాదులు క్రమముగా ఇవ్వడానికి బుద్ధిని ప్రేరేపిమ్పచేయాలని కోరుకుంటాడు తన శరీరమైన గయకు వచ్చి విష్ణుపాదం వటవృక్షం ఫల్గుణి నడిప్రాంతంలో పితరులకు శ్రాద్ధాదులు ఇవ్వడం చేయాలని కోరుకుంటాడు .



Read More

బ్రహ్మపురీశ్వర దేవస్థానం – కాంచీపురం



బ్రహ్మపురీశ్వర దేవస్థానం – కాంచీపురం

ఈ దేవస్థానం వేయి సంవత్సరముల పురాతనమైనది ఇది కాంచీపురంలో వున్నది శివ సన్నిధి, పార్వతి సన్నిధికి మధ్య కుమారస్వామి సన్నిధి వుండిన సోమస్కంద మూర్తిగా పరిగణింప బడుతుంది కానీ కాంచీపురంలోని తేనంబాక్కం అనేచోట వెలసియున్న బ్రహ్మపురీశ్వర దేవస్థానంలో శివ పార్వతులకు మధ్య వినాయక సన్నిధి ఉండడం ప్రపంచములో వేరెక్కడ చూడలేని ఒక ప్రత్యేకత దీనికి సోమగణపతి దేవస్థానం అని పిలువబడుతుంది స్థలపురాణం: శివునకు ఎడమపక్క ఉద్భవించిన మహావిష్ణు నాభి నుంచి బ్రహ్మ ఉద్భవించెను బ్రహ్మ తనకు సృష్టి చేసే విధానము బోధించమని శివుని ప్రార్థించగా భూలోకంలోని పుణ్యక్షేత్రమైన కంచి నగరంలో తనను గురించి ఏకాగ్రచిత్తంతో తపము చేస్తే తనకు ఉపదేశిస్తానని అంటారు. బ్రహ్మకంచికి వెళ్లి తపము ఆచరించుచు సోమయాగము చేయ తలంచి తన దేవేరి సరస్వతిని ఆశించెను కాని సరస్వతికి సమన్వయము కాకుండా వెళ్ళిపోయింది. బ్రహ్మ సావిత్రి గాయత్రి అనే దేవతలను సృష్టించి యాగము ప్రారంభించిరి. దీనిని గ్రహించిన సరస్వతి ఒక నదీ రూపముగా వచ్చి యాగకుండమును పాడుచేయ వచ్చెను. బ్రహ్మ తన యాగమును కాపాడమని శివుని ప్రార్థించగా మహావిష్ణువును పంపుతాడు ఈశ్వరుడు. మహావిష్ణువు సరస్వతి నదికి అడ్డుగా ఒక ఆనకట్టగా అడ్డుపడి యాగము పూర్తి చేయిస్తారు. తర్వాత తన తప్పును గ్రహించి సరస్వతి బ్రహ్మతో రాజీపడి యాగము పూర్తి గావించడానికి తోడ్పడుతుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై సృష్టి రహస్యము బ్రహ్మకు చెపుతాడు. అప్పుడు బ్రహ్మ తాను తపము గావించిన ఈ స్థలమును ఆస్థాన స్థలముగా స్వీకరించమని శివుని ప్రార్థించగా శివుడు అనుగ్రహిస్తాడు. అందువల్లే ఈ స్థలమునకు శివాస్థానం అని పేరు. బ్రహ్మ స్వయంగా పూజించినందున శివునికి బ్రహ్మపురీశ్వరుడు అని పేరు.


Read More

Wednesday, 25 September 2013

బృహదీశ్వరాలయం

బృహదీశ్వరాలయం
బృహదీశ్వర ఆలయం(పెరువుదైయార్ కోయిల్) ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. ఇది శైవాలయం (శివాలయం). దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.
దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు. ఇది చాల పెద్ద ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది. రాజ రాజ చోళుడు క్రీ.శ. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు..

రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి.


Read More

ఇంద్రకీలాద్రి పర్వతం-కనకదుర్గ గుడి విజయవాడ

ఇంద్రకీలాద్రి పర్వతం-కనకదుర్గ గుడి విజయవాడ


పాండవమధ్యముడు అయిన అర్జునుడు అరణ్యవాస సమయంలో తన అన్న ధర్మరాజు ఆజ్ఞమీద ఇంద్రకీలాద్రి మీద ఇంద్రుని కొరకు తపస్సు చేసాడు. అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై శివమంత్రం ఉపదేశించి, పాశుపతాస్త్రం కొరకు శివుని ఆరాధించమని చెప్తాడు. అలా అర్జునుడు తపస్సు చెస్తున్నప్పుడు, ఒకానొక రోజు అతి భయంకరమైన పెద్ద పంది ఒకటి వచ్చి తపస్సుకి భంగం కలిగించసాగింది. తపోభంగమైన అర్జునుడు దాన్ని వేటాడసాగాడు. కాని అది చాలా చురుకుగా బాణాలనుండి తప్పించుకొని పారిపోతుంది. ఎట్టకేలకు అర్జునుడు గురిచూసి దాని మీదకు బాణం వేసాడు. కాని దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి రెండు బాణాలు గుచ్చుకొని ఉన్నాయి. అంతలో ఒక కోయదొర వచ్చి ఆ పందిని తీసుకొని వెళ్ళసాగాడు. అప్పుడు అర్జునుడు ఆ పందిని నేను సంహరించాను కాబట్టి ఆ పంది నాది అని వాదించసాగాడు. దానికి ఆ కోయదొర నవ్వాడు. దానికి కోపం వచ్చిన అర్జునుడు అతనితో ఎవరు గొప్పో తేల్చుకుందామని యుద్ధానికి దిగాడు. అర్జునుడు ఎన్ని దివ్యాస్త్రాలు వేసినా కూడా ఆ కోయరాజుని ఏమీచేయలేక పోయాడు. తన దివ్యాస్త్రాలన్ని వృధాఅయిన కారణంగా అర్జునుడు తన విల్లు తీసుకొని ఆ కోయరాజు తలమీద కొట్టబోతాడు. అప్పుడు ఆ కోయరాజు మాయమై ఆ ప్రదేశంలో పరమశివుడు ప్రత్యక్షమై నవ్వుతూ కనిపిస్తాడు. పరమశివుని తో యుద్ధం చేసిన కారణానికి అర్జునుడు ఎంతో సిగ్గుపడి, బాధపడతాడు. తర్వాత శివుని స్తుతిస్తాడు. దానికి సంతసించిన శివుడు అర్జునికి పాశుపతాస్త్రం ఇచ్చి, దాన్ని అత్యవసర సందర్భాలలో, అరుదుగా మాత్రమే వాడాలి అని చెప్తాడు. తర్వాత శివుడు అర్జునికి నిగ్రహం సాధించమని చెప్పి అప్పుడు మాత్రమే అస్త్రాలు లోకకళ్యాణం కు ఉపయోగపడతాయి అని చెప్పి మాయమవుతాడు. అర్జునికి వరాలిచ్చిన మల్లేశ్వరస్వామి శక్తి కనక దుర్గ . ఇంద్రుడిచేత కీలితం చేయబడ్డాడు కాబట్టి అర్జునికి ఇంద్రకీలుడు అని కూడా పేరు వచ్చింది. అర్జునికి ఉన్న విజయనామం వల్ల యీ ప్రాంతానికి విజయపురి, విజయవాటిక, విజయవాడ, బెజవాడ, బెజ్జువాడ అని పేర్లు వచ్చాయని చెప్తారు.


https://fbcdn-sphotos-b-a.akamaihd.net/hphotos-ak-ash3/1374746_222621654563970_1237205528_n.jpg
Read More

భారతదేశంలో అతిపెద్ద నంది శిల్పం.. లేపాక్షి

భారతదేశంలో అతిపెద్ద నంది శిల్పం.. లేపాక్షి

"సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు."

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణమే లేపాక్షి. ఇది బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాదు, బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షి ఊరిలోకి ప్రవేశించగానే... అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో మనకు ఆహ్వానం పలుకుతుంది.

పురాతత్వశాఖవారి లెక్కల ప్రకారం ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. తంజావూరు బృహదీశ్వరాలయం, మైసూరులోని చాముండి హిల్, బెంగళూరులోని బసవన్న గుళ్లలో ఉండే నంది విగ్రహాలకంటే, లేపాక్షి విగ్రహమే పెద్దది.



http://www.indiamonuments.org/Lepakshi,%20AP/Nandi_-Lepakshi-Temple_-Andhra-Pradesh.jpg
Read More

Powered By Blogger | Template Created By Lord HTML